గత ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు
ఈసారి లోయలో పోటీకే దూరం
స్థానిక చిన్న పార్టీలకు పరోక్ష మద్దతు
ఎన్‌సీ, పీడీపీలను దెబ్బ తీసేందుకే?
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 పైచిలుకు స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కశ్మీర్‌లో మాత్రం మూడు లోక్‌సభ స్థానాలకు దూరంగా ఉండటం విశ్లేషకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏవీ పోటీ చేయని స్థానాలు ఈ మూడే! ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కలి్పంచే ఆరి్టకల్ 370తో పాటు రాష్ట్ర హోదా కూడా రద్దు చేశాక జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకిలా ముఖం చాటేసినట్టన్న ప్రశ్న తలెత్తుతోంది...
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభ స్థానాలున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్– రాజౌరి స్థానాలు శ్రీనగర్ పరిధిలోనివి. వీటిల్లో ముస్లిం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి కావాలనుకుంటే వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థులను బరిలో దింపొచ్చు. కానీ జమ్మూ పరిధిలోని జమ్మూ, ఉదంపూర్ లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది.
ఈ రెండూ బీజేపీ సిట్టింగ్ స్థానాలే. తొలి, రెండో విడతలో వీటికి ఎన్నిక ముగిసింది. జమ్మూలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జుగల్ కిషోర్ శర్మ బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేశారు. ఉదంపూర్‌లోనూ గత రెండు ఎన్నికల నుంచి బీజేపీ టికెట్‌పై గెలుస్తున్న ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పోటీ చేశారు. శ్రీనగర్‌లో మే 13న పోలింగ్ ముగిసింది. మే 20న బారాముల్లా, మే 25న అనంతనాగ్–రాజౌరితో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు పూర్తవుతాయి.
కారణాలేమిటి?
ఆర్టికల్ 370ని, రాష్ట్ర హోదాను రద్దు చేయడం కశ్మీర్‌లో కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్నది బీజేపీ భావన. అలాంటప్పుడు అక్కడి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందని, పైగా తనను బూచిగా చూపి ఎన్‌సీ, పీడీపీ రెండూ ఓటర్లను ఏకీకృతం చేస్తాయని అంచనాకు వచ్చింది. అందుకే నేరుగా బరిలో దిగకుండా చిన్న పారీ్టలకు దన్నుగా నిలిచినట్టు చెబుతున్నారు. బారాముల్లా నుంచి ఎన్‌సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. ఆయనకు పీడీపీ నేత ఫయాజ్ మిర్, జేకేపీసీ చైర్మన్ సజ్జాద్ గనీ ప్రత్యర్థులుగా ఉన్నారు.
సజ్జాద్‌ను బీజేపీ ప్రతినిధేనని ఒమర్ అబ్దుల్లాతో పాటు పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఆరోపణలు చేశారు. అనంతనాగ్–రాజౌరిలో తమ ప్రత్యర్థి అయిన జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి జాఫర్ ఇక్బాల్ మన్‌హాస్‌కు బీజేపీ మద్దతిస్తోందని ముఫ్తీ ఆరోపించారు. శ్రీనగర్‌లో కూడా ఎన్‌సీ, పీడీపీలపై అప్నీ పార్టీ నుంచి మహమ్మద్ అష్రఫ్ మిర్ పోటీ చేశారు. ఈ అప్నీ పార్టీ బీజేపీ మద్దతుతోనే 2021లో పుట్టుకొచి్చందని ఎన్‌సీ అంటోంది.
అసలు లక్ష్యం అసెంబ్లీయే!?
‘‘మా ప్రత్యర్థులు అంచనా వేసినట్టుగా మేము కశ్మీర్‌ను జయించబోవడం లేదు. ప్రతి కశ్మీరీ హృదయాన్నీ గెలుచుకోవడమే మా కర్తవ్యం’’ అని ఏప్రిల్ 16న జమ్మూ ర్యాలీలో అమిత్‌షా చేసిన ప్రకటనను కీలకంగా చూడాలి. కశ్మీర్ లోయలో కమల వికాసంపై తమకేమీ తొందర లేదన్నారాయన. ప్రధాని మోదీ కూడా ఆరి్టకల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా మార్చిలో శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అప్పటికల్లా ఎన్‌సీ, పీడీపీలను వీలైనంతగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు భావిస్తున్నారు. కొన్నిసార్లు పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని నిర్ణయాలు తప్పవని లోయలో పోటీకి దూరంగా ఉండటంపై జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా చేసిన నర్మగర్భ ప్రకటన అంతరార్థం కూడా అదేనంటున్నారు. లోయలో దేశభక్తి కలిగిన పార్టీలకు బీజేపీ మద్దతిస్తుందని అప్పుడే ఆయన ప్రకటించారు కూడా. ఎన్‌సీ, పీడీపీలకు స్థానిక పారీ్టలతో చెక్ పెట్టడమే బీజేపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. లోయలోని మూడు లోక్‌సభ స్థానాలనూ 2019లో ఎన్‌సీ గెలుచుకోవడం గమనార్హం.
ఈసారి తెర వెనక పాత్ర
కశ్మీర్‌లో తనకు ఏమాత్రం బలం లేని మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా అక్కడ తెర వెనక కీలకపాత్రే పోషిస్తున్నట్టు స్థానిక రాజకీయ పారీ్టలతో పాటు బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కశ్మీర్లోని మూడు స్థానాలనూ కాంగ్రెస్ కూడా పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు కేటాయించడం విశేషం. అలా రెండు ప్రధాన జాతీయ పారీ్టలూ కశ్మీర్లో పోటీకి దూరంగానే ఉన్నాయి.
దాంతో ఈ స్థానాల్లో పోటీ ప్రధానంగా ఎన్‌సీ, పీడీపీ మధ్యే నెలకొంది. అయితే సజ్జాద్ లోన్‌కు చెందిన జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), అల్తాఫ్ బుఖారీకి చెందిన జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ, మాజీ సీఎం గులాంనబీ ఆజాద్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పారీ్ట (డీపీఏపీ) కూడా బరిలో ఉన్నాయి. ఇవి బీజేపీ షాడో పార్టీలని ఎన్‌సీ, పీడీపీ ఆరోపిస్తున్నాయి. బీజేపీ వైఖరి గమనిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీలకు ఓటు వేయొద్దని గత నెల ఇక్కడ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment