న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అధికార పరిధిలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలపై విచారణకు ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల రాసిన లేఖ చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య మైత్రి ప్రజాస్వామ్యానికి చావు గంట అని ఈ నెల 21న రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సీజేఐతో పాటు సుప్రీంలోని 22 మంది జడ్జీలకూ లేఖ కాపీలు పంపారు.
డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ భట్‌పై కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి విచారణకు ఆదేశించడాన్ని చలమేశ్వర్ ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జడ్జీగా నియమించడమో లేదా నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలన కోసం కొలీజియం సిఫార్సుల్ని తిరిగి పంపడమో చేయకుండా న్యాయ శాఖ కర్ణాటక సీజేకి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు.
కొలీజియం సిఫార్సుల్ని పక్కనపెట్టడమే..
సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ జడ్జిపై ఆరోపణల విషయంలో పునఃవిచారణకు ఆదేశించడమంటే గత విచారణ నివేదికను పక్కనపెట్టడమే కాకుండా, కొలీజియం సిఫార్సుల్ని స్తంభింపచేయడమేనని చలమేశ్వర్ అన్నారు. ఈ అంశంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. కొలీజియం సిఫార్సుల్ని పునఃమూల్యాంకనం చేయమని హైకోర్టును ప్రభుత్వం కోరడాన్ని అనుచిత చర్యగా , మొండివైఖరిగా భావించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేఖలో ప్రస్తావిస్తూ.. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం.. మన న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతలోకి కార్యనిర్వాహక వ్యవస్థ కొద్దికొద్దిగా చొరబడేందుకు చోటిస్తున్నామనే అపవాదును మూటగట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు..
‘తప్పని తేలిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలపై మళ్లీ విచారణ జరపమన్న దృష్టాంతాలు నాకు తెలిసినంత వరకూ గతంలో లేవు. సుప్రీం సిఫార్సులు పెండింగ్‌లో ఉండగా అత్యున్నత న్యాయస్థానాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకోకుండా పనిచేసిన ఉదంతాలు లేవు’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జీని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే పునఃపరిశీలనకు కొలీజియం సిఫార్సుల్ని తిప్పి పంపవచ్చని, అలా చేయకుండా వారిదగ్గర అలాగే అట్టే పెట్టుకున్నారన్నారని తప్పుపట్టారు.
కొంతకాలానికి సుప్రీంకోర్టు సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించడమనేది మినహాయింపుగా మారిపోతుందని, సిఫార్సుల్ని వారి వద్ద అట్టిపెట్టుకోవడం నిబంధనగా పరిణమించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. జడ్జీల బదిలీకి సంబంధించి హైకోర్టులతో న్యాయశాఖ నేరుగా సంప్రదించడాన్ని గతంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని, ఆ అంశమే 1981లో మొదటి జడ్జీల కేసులో తీర్పు వెలువడేందుకు కారణమైందని గుర్తుచేశారు. జడ్జి కృష్ణ భట్‌పై మహిళా న్యాయాధికారి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని 2016లో అప్పటి సుప్రీం సీజేఐ ఠాకూర్ అప్పటి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖర్జీని ఆదేశించారు. విచారణలో భట్‌కు క్లీన్‌చిట్ దక్కడంతో ఆయనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు కొలీజియం సిఫార్సు చేసింది.
సంప్రదాయానికి కొలీజియం బ్రేక్
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియామకం కోసం తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడటం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా సంబంధిత హైకోర్టు కొలీజియాలు సిఫార్సు చేసిన 12 మంది లాయర్లు, ట్రయల్ కోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా, అత్యంత సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం అనధికారికంగా గురువారం ఇంటర్వ్యూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment