The judiciary
-
న్యాయవ్యవస్థలో స్థిరపడాలి
న్యూఢిల్లీ: న్యాయవిద్య అభ్యసించిన చాలామంది యువతీయువకులు న్యాయవ్యవస్థలో కాకుండా ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ లా యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవంలో జస్టిస్ గొగోయ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ‘లాయర్ల పాత్ర, పనితీరును మనం పరిశీలించాల్సిన అవసరముంది. న్యాయ రంగంలో గొప్ప అవకాశాలు, ఆకర్షణ ఉన్నప్పటికీ న్యాయవిద్యను అభ్యసించినవారిలో చాలామంది ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. చాలామంది న్యాయవాదులు మధ్యవర్తులుగా, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేవారిగా, న్యాయాధికారులుగా, సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతకాలంలో కార్పొరేట్ న్యాయవాదుల కెరీర్ చాలా ఆకర్షణీయంగా మారింది. ఇందులోని ఆర్థిక మూలాలకు నేను పోదల్చుకోలేదు. అదే సమయంలో బార్, బెంచ్‌లోని ఆసక్తికరమైన బాధ్యతలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది. నేను బార్, బెంచ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశా. ఇక్కడ పని కారణంగా దొరికే సంతృప్తి చాలాఎక్కువ. ప్రస్తుతం మనం అందిస్తున్న ఐదేళ్ల ‘లా’ డిగ్రీ కోర్సును సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఈ పద్ధతి అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో పూర్తిగా విఫలం కూడా కాలేదు. బార్ వ్యవస్థను పటిష్టం చేసేందుకే ‘లా’ స్కూళ్లను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం ఎన్ని ‘లా’ స్కూళ్లు తమ ఏర్పాటు వెనుకున్న లక్ష్యాన్ని అందుకుంటున్నాయి? ఈ విషయమై బార్ విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
ఆ మైత్రి ప్రజాస్వామ్యానికి చావుగంటే!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అధికార పరిధిలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలపై విచారణకు ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల రాసిన లేఖ చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య మైత్రి ప్రజాస్వామ్యానికి చావు గంట అని ఈ నెల 21న రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సీజేఐతో పాటు సుప్రీంలోని 22 మంది జడ్జీలకూ లేఖ కాపీలు పంపారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ భట్‌పై కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి విచారణకు ఆదేశించడాన్ని చలమేశ్వర్ ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జడ్జీగా నియమించడమో లేదా నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలన కోసం కొలీజియం సిఫార్సుల్ని తిరిగి పంపడమో చేయకుండా న్యాయ శాఖ కర్ణాటక సీజేకి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కొలీజియం సిఫార్సుల్ని పక్కనపెట్టడమే.. సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ జడ్జిపై ఆరోపణల విషయంలో పునఃవిచారణకు ఆదేశించడమంటే గత విచారణ నివేదికను పక్కనపెట్టడమే కాకుండా, కొలీజియం సిఫార్సుల్ని స్తంభింపచేయడమేనని చలమేశ్వర్ అన్నారు. ఈ అంశంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. కొలీజియం సిఫార్సుల్ని పునఃమూల్యాంకనం చేయమని హైకోర్టును ప్రభుత్వం కోరడాన్ని అనుచిత చర్యగా , మొండివైఖరిగా భావించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేఖలో ప్రస్తావిస్తూ.. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం.. మన న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతలోకి కార్యనిర్వాహక వ్యవస్థ కొద్దికొద్దిగా చొరబడేందుకు చోటిస్తున్నామనే అపవాదును మూటగట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.. ‘తప్పని తేలిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలపై మళ్లీ విచారణ జరపమన్న దృష్టాంతాలు నాకు తెలిసినంత వరకూ గతంలో లేవు. సుప్రీం సిఫార్సులు పెండింగ్‌లో ఉండగా అత్యున్నత న్యాయస్థానాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకోకుండా పనిచేసిన ఉదంతాలు లేవు’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జీని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే పునఃపరిశీలనకు కొలీజియం సిఫార్సుల్ని తిప్పి పంపవచ్చని, అలా చేయకుండా వారిదగ్గర అలాగే అట్టే పెట్టుకున్నారన్నారని తప్పుపట్టారు. కొంతకాలానికి సుప్రీంకోర్టు సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించడమనేది మినహాయింపుగా మారిపోతుందని, సిఫార్సుల్ని వారి వద్ద అట్టిపెట్టుకోవడం నిబంధనగా పరిణమించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. జడ్జీల బదిలీకి సంబంధించి హైకోర్టులతో న్యాయశాఖ నేరుగా సంప్రదించడాన్ని గతంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని, ఆ అంశమే 1981లో మొదటి జడ్జీల కేసులో తీర్పు వెలువడేందుకు కారణమైందని గుర్తుచేశారు. జడ్జి కృష్ణ భట్‌పై మహిళా న్యాయాధికారి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని 2016లో అప్పటి సుప్రీం సీజేఐ ఠాకూర్ అప్పటి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖర్జీని ఆదేశించారు. విచారణలో భట్‌కు క్లీన్చిట్ దక్కడంతో ఆయనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు కొలీజియం సిఫార్సు చేసింది. సంప్రదాయానికి కొలీజియం బ్రేక్ హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియామకం కోసం తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడటం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా సంబంధిత హైకోర్టు కొలీజియాలు సిఫార్సు చేసిన 12 మంది లాయర్లు, ట్రయల్ కోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా, అత్యంత సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం అనధికారికంగా గురువారం ఇంటర్వ్యూలు చేసింది. -
న్యాయవ్యవస్థ సుప్రీం
సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు బెంగళూరు : ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తితే అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని అన్నారు. శనివారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన ‘న్యాయశాఖ అధికారుల 17వ ద్వైవార్షిక సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయాన్ని చేరువ చేసే దిశగా న్యాయమూర్తులు, న్యాయశాఖలోని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయమూర్తులు సరిగా పనిచేయకపోవడం వల్లే దేశంలోని అనేక కోర్టులలో కోట్ల సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఒక వైపు కేసులు పరిష్కారం అవుతూనే ఉన్నా మరో వైపు రోజూ కొత్త కొత్త కేసులు న్యాయస్థానం ముందుకు వస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు బాధితులకు అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో నిర్వహించిన జాతీయ అదాలత్‌లో ఒకే రోజున 1.25కోట్ల కేసులను పరిష్కరించినట్లు దత్తు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఎంతైనా అవసరమని అన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి వాఘేలా మాట్లాడుతూ... కర్ణాటక ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అవసరమైన అన్ని విధాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ఖాళీగా ఉన్న ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, డి గ్రూప్ ఉద్యోగుల భర్తీ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, లోకాయుక్త భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం
ఆదిలాబాద్ క్రైం : సమస్యలు సత్వరమే పరిష్కరించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని హైకోర్టు జడ్జి జి.చంద్రయ్య అన్నారు.రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సన్నద్ధ సమావేశం ఏర్పాటు చేశా రు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి చం ద్రయ్య ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39-ఏ ప్రకారం 1987లో న్యాయసేవాధికార చట్టం అమల్లోకి వచ్చిందని, కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రెండో జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక ర్లు, కక్షిదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ప్రత్యేక కోర్టు జడ్జి రాజ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి అజిత్‌సింహరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్‌కుమార్‌పటేల్ పాల్గొన్నారు. -
న్యాయ వ్యవస్థలో జోక్యం తగదు: సీజేఐ
వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ముఖ్యం ‘జడ్జీల బిల్లు’కు పార్లమెంటు ఆమోదం మర్నాడే వ్యాఖ్యలు న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పర గౌరవాన్ని పాటించాలని, ఆయా వ్యవస్థల బాధ్యతల నిర్వహణకు బయటినుంచి అడ్డంకులు ఎదురుకాకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఆర్ఎం లోధా అభిప్రాయపడ్డారు. న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలతోపాటు పార్లమెంటు ప్రతినిధులకు, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిపక్వత ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థ వ్యవహారాల పరిధిలో పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడారు. రాజ్యవ్యవస్థలన్నీ ఇతర వ్యవస్థల విధుల్లో జోక్యంచేసుకోకుండా ఉండేలా రాజ్యాంగ నిర్మాతలు తగిన చర్యలు తీసుకున్నారని, కానీ జ్యుడిషియరీ అభిప్రాయాలను పట్టించుకోకుండానే,.. న్యాయమూర్తుల నియామకానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకోసం రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థను రద్దుచేసే బిల్లును పార్లమెంటు ఆమోదించిన మర్నాడే జస్టిస్ లోధా ఈ వ్యాఖ్యలు చేశారు.