న్యాయ వ్యవస్థలో జోక్యం తగదు: సీజేఐ
వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ముఖ్యం
‘జడ్జీల బిల్లు’కు పార్లమెంటు ఆమోదం మర్నాడే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పర గౌరవాన్ని పాటించాలని, ఆయా వ్యవస్థల బాధ్యతల నిర్వహణకు బయటినుంచి అడ్డంకులు ఎదురుకాకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఆర్‌ఎం లోధా అభిప్రాయపడ్డారు. న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలతోపాటు పార్లమెంటు ప్రతినిధులకు, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిపక్వత ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థ వ్యవహారాల పరిధిలో పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు.
సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడారు. రాజ్యవ్యవస్థలన్నీ ఇతర వ్యవస్థల విధుల్లో జోక్యంచేసుకోకుండా ఉండేలా రాజ్యాంగ నిర్మాతలు తగిన చర్యలు తీసుకున్నారని, కానీ జ్యుడిషియరీ అభిప్రాయాలను పట్టించుకోకుండానే,.. న్యాయమూర్తుల నియామకానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకోసం రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థను రద్దుచేసే బిల్లును పార్లమెంటు ఆమోదించిన మర్నాడే జస్టిస్ లోధా ఈ వ్యాఖ్యలు చేశారు.