RM lodha
-
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
మాజీ సీజేఐకి రూ. లక్ష టోకరా
న్యూఢిల్లీ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ హ్యాకర్స్ బారిన పడుతూ అకౌంట్లు గుల్ల చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు. ఏకంగా మాజీ సీజేఐ లావాదేవీలపై కన్నేసిన హ్యాకర్స్.. ఆయన ఫ్రెండ్స్ లిస్టులోని జస్టిస్ బీసీ సింగ్ ఈ- మెయిల్‌ను హ్యాక్ చేసి లోధా నుంచి లక్ష రూపాయలు దోచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలని.. ‘ ఏప్రిల్ 19న బీపీ సింగ్ నుంచి నాకు ఈ-మెయిల్ వచ్చింది. తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలని అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కదా అని వెంటనే లక్ష రూపాయలు ఆన్లైన్ ద్వారా(రెండు విడతల్లో) పంపించాను’ అని జస్టిస్ లోధా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి దక్షిణ ఢిల్లీ ఏసీపీ మాట్లాడుతూ..‘ జస్టిస్ బీపీ సింగ్ తన ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. ఈ క్రమంలో తన అకౌంట్ నుంచి ఆర్ఎం లోధాకు వెళ్లిన మెసేజ్‌ల వల్ల ఆయన మోసపోయారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా లోధాకు సూచించారు. దీంతో జస్టిస్ లోధా మమ్మల్ని ఆశ్రయించారు. చీటింగ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని..సైబర్ క్రైమ్ బ్రాంచ్ టీం విచారణ జరుపుతున్నారు’ అని తెలిపారు. -
అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్‌తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న. ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు? అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్‌లోని ‘కామన్వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా! -
ఇంగ్లండ్ జట్టు ఖర్చులపై ఏం చేయాలి?
లోధా ప్యానెల్‌కు లేఖ రాసిన బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టుకు సంబంధించిన ఖర్చుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కోరుతూ జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్‌కు బీసీసీఐ లేఖ రాసింది. పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ పరస్పర అంగీ కార పత్రం (ఎంవోయూ)పై సంతకం చేయాల్సి ఉంటుంది. ‘ద్వైపాక్షిక సిరీస్ కాబట్టి ఇంగ్లండ్ జట్టు హోటల్ వసతి, ప్రయాణ, ఇతర ఖర్చులన్నీ మేమే భరించాల్సి ఉంటుంది. అరుుతే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ ఖర్చులను మేం చెల్లించాలా? లేక వారినే చెల్లించుకోమనాలా? ఈ విషయంలో మాకు స్పష్టత అవసరం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐకి సంబంధించిన ఖర్చులపైన ప్యానెల్ నియమించిన ఆడిటర్ పర్యవేక్షణ ఉండాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. -
సుప్రీంలో మహిళా లాయర్ ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది ఆత్మాహత్యాయత్నం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా కేసుల విచారణ అనంతరం తన స్థానం నుంచి లేచి వెళుతున్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా న్యాయవాది తనపై భర్త కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ఆమె మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో తోటి మహిళా న్యాయవాది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మహిళా న్యాయవాది తాను నాప్తలిన్ బాల్స్ మింగానని చెప్పారు. ఆమెను సుప్రీంకోర్టు ఆస్పత్రికి తరలించాలని లోధా ఆదేశించారు. -
‘బొగ్గు బ్లాకుల’పై తీర్పు రిజర్వు
-
‘బొగ్గు బ్లాకుల’పై తీర్పు రిజర్వు
* కేటాయింపుల రద్దుకు సుముఖమేనన్న కేంద్రం * 46 బ్లాకులను మాత్రం మినహాయించాలని సుప్రీం కోర్టుకు వినతి * ప్రభుత్వ వాదనతో విభేదించిన కేటాయింపులు పొందిన కంపెనీలు * అవకతవకలకు ప్రభుత్వానిదే బాధ్యతన్న కంపెనీలు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి 2010 మధ్య జరిగిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపుల భవితవ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. కేటాయింపులన్నీ అక్రమమంటూ ఆగస్టు 25నే పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘‘ఈ వ్యవహారంలో ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితుల గురించి ఆలోచించాం. అవకతవకలు జరిగినప్పుడు వాటి ప్రభావం అందరిపై పడుతుంది. అందువల్ల బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దునే మేం కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభిస్తున్న 40 బొగ్గు బ్లాకులతోపాటు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు బ్లాకులను మినహాయించాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వైఖరితో బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందిన సంస్థలు తమ వాదనల సందర్భంగా విభేదించాయి. ఆగస్టు 25 నాటి సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటును ప్రభుత్వం కోరకపోవడాన్ని తూర్పారబట్టాయి. కేటాయింపుల్లో అవకతకలకు ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించాయి. ఒక్కో బొగ్గు బ్లాకు కేటాయింపుపై దర్యాప్తు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు కోర్టు తీర్పునకు సహజ పరిణామమన్న వైఖరిని కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవ ర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ప్రభుత్వ వైఖరి దేశంలో పెను విపత్తుకు దారితీస్తుందని...ఇప్పటికే విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ జనాభాను మరిన్ని కష్టాల్లోకి నెడుతుందని పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ వాదనను సీనియర్ అడ్వొకేట్లు కె.కె. వేణుగోపాల్, హరీశ్ సాల్వే తదితరులు తోసిపుచ్చారు. వాస్తవానికి కేటాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టునే ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. దర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం తన పరిస్థితినే తెలియజేస్తోందని పేర్కొంది. ప్రభుత్వం అన్ని అంశాలను అర్థం చేసుకుంటుందని...దేశంలో చీకట్ల గురించి ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తీర్పును రిజర్వులో ఉంచింది. అంతకుముందు ధర్మాసనం ఈ వాదనల సందర్భంగా స్పందిస్తూ తాము ప్రభుత్వ కేటాయింపుల నిర్ణయాన్ని పరిశీలించలేదని...నిర్ణయం తీసుకునే ప్రక్రియనే పరిశీలించామంది. ‘‘మీరు (ప్రభుత్వం)తప్పు చేశారా లేదా అనే విషయం గురిం చి మేం ఆలోచించడం లేదు. కానీ జరిగిన తప్పుడు ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ఫలానా వైఖరికే కట్టుబడాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని చెప్పింది. వాహనవతికి కితాబు బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారంలో గత వారం కన్నుమూసిన మాజీ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ‘‘ఆయన భౌతికంగా లేరు. కానీ ఈ కేసు విషయంలో ఎంతో శ్రమకోర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివిధ పత్రాలను పద్ధతి ప్రకారం సిద్ధం చేశారు. ఆయన్ను అభినందించాలి’’ అని కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ‘ప్రభుత్వానికి కనువిప్పు’ న్యూఢిల్లీ: 1993 నుంచి 2010 వరకూ జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు అక్రమమైనవిగా పేర్కొనడం తమకు కనువిప్పు కలిగించడమేనని కేంద్ర విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి గోయల్ అన్నారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలోనూ జవాబుదారీతనం మరింతగా ఉండాలని మంగళవారం ఢిల్లీ లో పేర్కొన్నారు. అధికారులు తమ బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. -
మళ్లీ వేలం వేస్తాం!
* బొగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకు కేంద్రం వివరణ * 40 గనులకు మాత్రం రద్దు నుంచి మినహాయింపు కోరిన ఏజీ న్యూఢిల్లీ: 1993- 2010 మధ్య జరిగిన అన్ని బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే.. వాటిని మళ్లీ వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 1993 నుంచి 2010 వరకు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అడ్డగోలుగా, అక్రమంగా జరిగాయని ఆగస్టు 25న సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు. ‘బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి ఆగస్ట్ 25 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగా మొత్తం 218 బొగ్గు క్షేత్రాలను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వాటిలో నుంచి విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా.. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 40 బొగ్గు గనులకు రద్దు నుంచి మినహాయింపునిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది’ అని రోహత్గీ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి స్పష్టం చేశారు. అయితే, అన్ని కేటాయింపులూ చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు స్పష్టం చేసినందువల్ల.. ఆ తీర్పు ప్రకారమే వెళ్లాలనుకుంటే అన్ని కేటాయింపులను రద్దు చేసి తాజాగా వేలం వేయాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలను సమీక్షించేందుకు మాజీ న్యాయమూర్తితో కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని రోహత్గీ స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. సెప్టెంబర్ 8 లోగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలతో పాటు పిటిషనర్లను ఆదేశించింది. బొగ్గు గనుల కేటాయింపు అంశంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నందున, ఆగస్ట్ 25 నాటి తీర్పును వ్యక్తుల నేరసంబంధ అంశాల జోలికి వెళ్లకుండా.. చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తతతో ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు విచారణలో తనకు సహకరించేందుకు ముగ్గురు సీనియర్ సీబీఐ ప్రాసిక్యూటర్లను నియమించాలన్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ చీమా అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వీకే శర్మ, సంజయ్‌కుమార్, ఏపీ సింగ్‌లకు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. ఆ క్లోజర్ రిపోర్ట్ నిర్హేతుకం కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై, ఆ సంస్థ డెరైక్టర్లపై బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించిన కేసులను మూసేయాలం టూ సీబీఐ రూపొందించిన ముగింపు నివేదిక(క్లోజర్ రిపోర్ట్)ను ప్రత్యేక కోర్టు సోమవారం తీవ్రంగా ఆక్షేపించింది. ఆ నివేదిక అసంబద్ధం గా, తర్కదూరంగా ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశ్కర్ తప్పుపట్టారు. -
కేబినెట్లో నేర చరితులు వద్దు
* ప్రధాని, సీఎంలకు సుప్రీంకోర్టు సూచన * విచక్షణతో మెలగాలి * చీఫ్ జస్టిస్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు న్యూఢిల్లీ: అవినీతి, క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను మంత్రులుగా నియమించవద్దంటూ ప్రధాని, ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు సూచించింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా అలాంటి వారిని దూరంగా పెట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అలాంటి వారు మంత్రి పదవులు చేపట్టడానికి అనర్హులని మాత్రం పేర్కొనలేదు. ఈ విషయాన్ని ప్రధాని, ముఖ్యమంత్రుల విచక్షణాధికారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి, నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్య పవిత్రతను దెబ్బతీస్తాయని పేర్కొంది. నేర చరితులను కేబినెట్లోకి తీసుకోకుండా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రధాని, కేబినెట్ మంత్రుల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 75(1)లో అనర్హత అంశాన్ని చేర్చలేమని, అయితే ఈ విషయంలో ప్రధాని, సీఎంలే కల్పించుకుని నేరమయ వ్యక్తులను కేబినెట్లోకి తీసుకోకుండా దూరంగా పెట్టాలని పేర్కొంది. ప్రధాని, ముఖ్యమంత్రులను రాజ్యాంగం అమితంగా విశ్వాసంలోకి తీసుకున్నదని, అందువల్ల రాజ్యాంగ బాధ్యతలను ధర్మాసనం అభిప్రాయపడింది. విశ్వసనీయతకు ప్రధాని కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో విచక్షణతో మెలగాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పాలనను ప్రజలెవరూ కోరుకోరని రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రాజ్యాంగ అమలులో ప్రభుత్వాధినేతల పాత్రను గుర్తు చేయడం కోర్టు బాధ్యత అని, అందుకే ప్రధాని, సీఎంలు వివేకంతో ప్రవర్తించాలని జస్టిస్ జోసెఫ్ అన్నారు. మార్పు కష్టమే!: సుప్రీంకోర్టు తీర్పు ప్రధానంగా సలహాపూర్వకమైనది కాబట్టి అది ప్రధాని, ముఖ్యమంత్రులపై కొంతవరకు నైతికపరమైన ఒత్తిడి తేగలుగుతుంది కానీ ప్రభుత్వ వ్యవస్థలో భారీ మార్పు తీసుకురాలేకపోవచ్చని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక నిర్ణయం ప్రధానిదే: సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రధాని మోడీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్డీయే ప్రభుత్వంలోని 14 మంది మంత్రులపై కేసులు ఉన్నాయని, వారిని కొనసాగించే విషయం మోడీ చేతుల్లోనే ఉందని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ పేర్కొన్నారు. -
ఎల్‌వోపీపై స్పష్టతకు సుప్రీం నిర్ణయం
ప్రతిపక్ష నేత పాత్ర చట్ట సభల్లో కీలకమైనది అది లోక్‌పాల్‌కు మాత్రమే పరిమితం కాదు రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని ఆదేశం న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) హోదాపై కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టబద్ధమైన సంస్థల్లో ప్రతిపక్ష నేత హోదాపై అర్థ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయాన్ని తెలపాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ప్రజల మనోభావాలను ప్రతిపక్ష నేత విభిన్న కోణంలో సభల్లో వినిపిస్తారంటూ ఆ హోదా ప్రాముఖ్యాన్ని ధర్మాసనం వివరించింది. లోక్‌పాల్ ఎంపికలో ఎలోవోపీ పాత్ర కూడా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేత లేని కారణంగా ఆ చట్టాన్ని కోల్డ్‌స్టోరేజిలో పెట్ట లేమని, ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం గుర్తించింది. లోక్‌పాల్ చట్టానికి సంబంధించి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతకు ప్రతిపక్షనేత హోదా ఇస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. సెప్టెంబర్ 9న జరిగే విచారణలో తమ అభిప్రాయాన్ని తెలపాలని ఆదేశించింది. ఎల్వోపీ పాత్ర కేవలం లోక్‌పాల్‌కు మాత్రమే పరిమితం కాదని, ప్రస్తుతం ఉన్న, భవిష్యత్‌లో తెచ్చే చట్టాల విషయంలో ఆ పాత్రకు కీలక పరిధి ఉందని సుప్రీం తెలిపింది. లోక్‌పాల్ చట్టంలో కొన్ని నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉందని విచారణలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సెలెక్షన్ కమిటీలో ఎల్వోపీ లేకపోతే లోక్‌పాల్ ఖాళీగానే ఉండిపోతుందని అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గీ కోర్టుకు తెలిపారు. గతంలో కూడా కొన్ని సార్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేరని ఆయన చెప్పారు. అప్పట్లో ఇలాంటి చట్టాలు లేవన్న కోర్టు.. ఎల్‌వోపీపై సరియైన నిర్వచనం అవసరం అని అభిప్రాయపడింది. స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించాలి లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాపై స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. సుప్రీం నిర్ణయం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. శుక్రవారం ఆయన గోరఖ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధిస్తేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కానీ కాంగ్రెస్ ఆ సంఖ్య సాధించలేకపోయిందన్నారు. అందువల్ల ఆ పార్టీ స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించాలని కోరారు. సుప్రీం వాఖ్యలపై కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. తమ అభిప్రాయాన్నే కోర్టు స్పష్టం చేసిందన్నారు. కొత్త సీఐసీ నియామకం నిలుపుదల న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌కు నూతన చీఫ్ నియామకాన్ని కేంద్రం శుక్రవారం నిలుపుదల చేసింది. నూతన సీఐసీ ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. 2005 లో సీఐసీ ఏర్పడినప్పటి నుంచి ఆ సంస్థకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకపోవడం ఇదే తొలిసారి. త్రిసభ్య కమిటీలో ప్రధాని, మరో కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీని సిఫార్సు మేరకు రాష్ట్రపతి సీఐసీని నియమిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరినీ గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీల్లో అత్యధిక సీట్లున్న పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా పరిగణించవచ్చు. -
గవర్నర్ తొలగింపుపై నోటీసులు
ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు చర్య న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపుపై ఏర్పడిన వివాదం తాజాగా కోర్టుకెక్కింది. ఉత్తరాఖండ్ గవర్నర్ పదవినుంచి తనచేత రాజీనామా చేయించేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరును సవాలుచేస్తూ అజీజ్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని, లేదా కేంద్రంచేత బర్తరఫ్కు సిద్ధపడాలని తనను బెదిరించినట్టు ఖురేషీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్‌లోని అంశాలు రాజ్యాంగంలోని 156వ ఆర్టికల్ (గవర్నర్ పదవీకాలం)కు సంబంధించివైనందున పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదలీ చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా అధ్యక్షతలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ, గవర్నర్ రాజీనామా కోరేందుకు ఒక పద్ధతి అంటూ ఉండాలని, గవర్నర్‌ను తొలగించేందుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుందని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి కేవలం ఒక ఫోన్‌కాల్‌తో గవర్నర్‌ను రాజీనామా కోరడం కుదరదని అన్నారు. ఈ అంశంపై గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిబల్ ఉదహరించారు. గవర్నర్ల తొలగింపు వ్యవహారంలో మోడీ సర్కార్ చర్యను వ్యతిరేకిస్తూ ఖురేషీ మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీఏ నియమించిన మరో ఇద్దరు గవర్నర్లను కేంద్రం బర్తరఫ్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ నలుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. -
న్యాయ వ్యవస్థలో జోక్యం తగదు: సీజేఐ
వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ముఖ్యం ‘జడ్జీల బిల్లు’కు పార్లమెంటు ఆమోదం మర్నాడే వ్యాఖ్యలు న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పర గౌరవాన్ని పాటించాలని, ఆయా వ్యవస్థల బాధ్యతల నిర్వహణకు బయటినుంచి అడ్డంకులు ఎదురుకాకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఆర్ఎం లోధా అభిప్రాయపడ్డారు. న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలతోపాటు పార్లమెంటు ప్రతినిధులకు, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిపక్వత ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థ వ్యవహారాల పరిధిలో పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడారు. రాజ్యవ్యవస్థలన్నీ ఇతర వ్యవస్థల విధుల్లో జోక్యంచేసుకోకుండా ఉండేలా రాజ్యాంగ నిర్మాతలు తగిన చర్యలు తీసుకున్నారని, కానీ జ్యుడిషియరీ అభిప్రాయాలను పట్టించుకోకుండానే,.. న్యాయమూర్తుల నియామకానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకోసం రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థను రద్దుచేసే బిల్లును పార్లమెంటు ఆమోదించిన మర్నాడే జస్టిస్ లోధా ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎం లోధా
-
సీబీఐ జేడీగా అర్చన నియామకం అక్రమం
తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు కేంద్రం నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది న్యూఢిల్లీ: సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరాన్ని నియమించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ప్రాథమిక ఆధారాలను అనుసరించి ఆమె నియామకం అక్రమం, చట్టవిరుద్ధమని శుక్రవారం తేల్చిచెప్పింది. ఆమె పేరును సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించకపోయినా ఎలా నియమించారంటూ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. ఒకసారి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని అమలుచేయాలని కేంద్రానికి చెప్పింది. అదే న్యాయమని, దానిని పాటించాలని పేర్కొంది. కేంద్ర నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని, సీబీఐ నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం తెలిపింది. ఎస్పీ ఆపై ర్యాంకుల నియామకాలకు సంబంధించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఆమె నియామకాన్ని చేపట్టారనేది పిటిషనర్ అందించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి అవగతమవుతోందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వరకు అదనపు డెరైక్టర్‌గా ఆమెను విధుల్లో చేరకుండా నిరోధించాలని సీబీఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14కు వాయిదావేసింది. అర్చన నియామకం ఏకపక్షం గా తీసుకున్న నిర్ణయమని, గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును విస్మరించారని జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పైఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్.. ఎంపిక కమిటీ కొంతమందితో కూడిన ప్యానల్ పేర్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కపేరే ఇచ్చిందని తెలిపారు. ఆమె నియామక పత్రాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా, 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనా సుందరం సీబీఐ డీఐజీగా విధులు నిర్వహించారు. తర్వాత తొలి మహిళా జాయింట్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అయితే విధుల్లో చేరిన రోజే తమిళనాడు ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
‘ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు పెంచుకోండి’
న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా నలుగుతున్న ముళ్లపెరియార్ డ్యామ్ వివాదంలో కేరళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 120 ఏళ్ల నాటి ఈ డ్యామ్ సురక్షితమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో నీటిమట్టాన్ని 142 అడుగుల ఎత్తుకు పెంచుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. డ్యామ్‌ను మరింత పటిష్టపరిచాక నీటిమట్టాన్ని అంతిమంగా 152 అడుగులకు కూడా పెంచుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, న్యాయమూర్తులు హెచ్ఎల్ దత్తు, సీకే ప్రసాద్, మదన్ బి.లోకూర్, ఎంవై ఇక్బాల్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తమిళనాడును అడ్డుకోరాదని కేరళను ఆదేశించింది. అంతేగాక, డ్యామ్ సురక్షితం కాదని, కనుక నీటిమట్టాన్ని 136 అడుగులకే పరిమితం చేయాలని పేర్కొంటూ కేరళ సర్కారు 2006లో చేసిన చట్టాన్ని కొట్టేసింది. తమ గత తీర్పును ఉల్లంఘిస్తూ అలాంటి చట్టం చేసినందుకు అక్షింతలు వేసింది. తమ రాష్ట్ర ప్రజల భద్రత కోసమే ఆ చట్టం చేయాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది. -
అవినీతిపై సుప్రీం పంజా!
సంపాదకీయం: దేశంలో అవినీతిని అంతమొందించడానికి తాము కంకణం కట్టుకు న్నామని చెబుతూనే అందుకు అవరోధాలను సృష్టించగల అనేకానేక నిబంధనలను చట్టాల్లో చేర్చడాన్ని అలవాటుగా చేసుకున్న పాలకులకు సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు శరాఘాతం వంటిది. అవినీతి కేసుల్లో ఉన్నతస్థాయి అధికారులపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అవసరమనే చట్ట నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం చట్టం(డీఎస్పీ ఈఏ)లోని సెక్షన్ 6ఏ చెల్లబోదని ప్రకటించింది. అవినీతి కేసుల్లో ఇరుక్కునే సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను విచారించడానికి ఆయా విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల అనుమతిని సెక్షన్ 6ఏ తప్పనిసరి చేస్తున్నది. ఇలాంటి కేసుల్లో ఏళ్లూ పూళ్లూ గడిచినా అనుమతులు లభించక అవినీతి కేసుల దర్యాప్తు కొలిక్కిరావడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులు రిటైరైతే తప్ప వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు సీబీఐకి లభించడంలేదు. కిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడే సందర్భాల్లో వెనువెంటనే వారిని అరెస్టు చేస్తారు. కొలువునుంచి సస్పెండ్ చేస్తారు. ఒకపక్క చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతుండగా అందుకు విరుద్ధమైన నిబంధనలు ఇప్పటికీ చట్టాల్లో క్షేమంగా ఉండటమే ఒక విడ్డూరం. పార్టీలు ఏవైనా, సిద్ధాంతాలు ఎలాంటివైనా అవినీతిని అంతమొందించే విషయంలో అందరిదీ పెడదారేనని సెక్షన్ 6ఏ నిరూపించింది. వాస్తవానికి 1946లో డీఎస్‌పీఈఏ చట్టం ఏర్పరిచి నప్పుడు అందులో ఈ నిబంధనలేదు. అటు తర్వాత ఇలాంటి నిబంధనపెట్టినప్పుడు జైన్ డైరీ-హవాలా కేసులో 1997లో సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసింది. ఆ మరుసటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మళ్లీ దీన్ని చేరుస్తూ ఆర్డినెన్స్ జారీచేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ ఆర్డినెన్స్ కాస్తా మూలబడింది. మళ్లీ ఇదే నిబంధనను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం డీఎస్పీఈఏలో 6ఏ రూపంలో చేర్చింది. ఈ నిబంధన కేవలం ఉన్నతాధికారులను మాత్రమే సంరక్షించే సాధనమైతే పాలకులు ఇంత శ్రద్ధ తీసుకునేవారు కాదు. తమకు కూడా ఇది పరోక్షంగా తోడ్పడుతున్నది గనుకే వారికా ఉత్సాహం! అవినీతి ఆరోపణలొచ్చిన ఉన్నతాధికారులను వెనువెంటనే విచారిస్తే, ఆ క్రమంలో తమ ప్రభుత్వ లొసుగులు లేదా మంత్రుల నిర్వాకాలు బయటికొస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులెదురవుతాయని పాల కులు భయపడుతున్నారు. అందువల్లే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని అవినీతి కేసులు తెమలకుండా జాగ్రత్తపడుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గంభీరంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే ప్రభుత్వమే తీరా అందుకు అవసరమైన అనుమతులను ఇవ్వకుండా ఆ దర్యాప్తునకు మోకాలడ్డుతుంది. ఇందులో మరో కోణం కూడా ఉన్నది. తమకు రాజకీయ ప్రత్యర్థులని భావించిన వారిని వేధించడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఎడాపెడా వాడుకుంటున్నది. ఒకపక్క తమ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తూనే అందులో భాగంగా కేసులు ఎదుర్కొనే ఉన్నతాధికారుల దర్యాప్తునకు ఎంతకాల మైనా అనుమతులివ్వక సాగదీస్తోంది. అందుకు మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులే పెద్ద ఉదాహరణ. ఒకపక్క ఆయనపై చార్జిషీట్లు కూడా దాఖలుచేసి, అవి పూర్తయ్యేవరకూ 16 నెలలకాలంపాటు ఆయ నను నిర్బంధంలో ఉంచిన ప్రభుత్వం...అదే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న కొంతమంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు ఇంతవరకూ అనుమతు లివ్వలేదు. అలాంటి అనుమతులు వెనువెంటనే ఇచ్చివుంటే కేసులు త్వరితగతిన పూర్తవుతాయి. పాలకుల డొల్లతనం కూడా బయటపడు తుంది. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు దీర్ఘకాలం సాగలాగితేనే తమకు లాభదాయకమని భావించడంవల్లే పాలకులు ఇలా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారు. నిందితులపై సత్వరమే దర్యాప్తు పూర్తిచేసి, దోషులుగా తేలినవారిని శిక్షించాలని భావించడంలో తప్పుబట్టాల్సింది లేదు. కానీ, ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ కోణాన్ని స్పృశించినట్టు లేదు. సీబీఐ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, ఆ సంస్థకు తగినంతగా స్వయంప్రతిపత్తి ఇస్తే...దానికి జవాబుదారీతనాన్ని కూడా తప్పనిసరిచేస్తే ఇలాంటి నిబంధనలను తొలగించడంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ, దాన్ని ఇప్పుడున్న తరహాలోనే ఉంచి 6ఏ వంటి నిబంధనలను తొలగిం చడంవల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఆ నిబంధనను గుత్తగా తొలగించే బదులు...అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసినప్పుడు దానిపై నిర్దిష్ట కాలావధిలో కేంద్రం నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేస్తే బాగుండేది. ఆ వ్యవధిలోగా కేంద్రం స్పందించకపోతే ఆ అధికారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి మంజూరుచేసినట్టుగా భావించేలా నిబంధన ఉంటే సరిపోతుంది. కనీసం నిందపడిన ఉన్నతా ధికారి విషయంలో సీబీఐ ముందుకెళ్లాలో లేదో నిర్ణయించే అధికారాన్ని సీవీసీ వంటి వ్యవస్థలకు కట్టబెట్టినా సబబుగా ఉంటుంది. ఉన్నతాధి కారవర్గం విధానపరమైన అంశాల్లో నిర్ణయం తీసుకోవడానికి లేదా అధికారంలో ఉన్నవారికి సలహాలివ్వడానికి సందేహిస్తే... సీబీఐ కత్తి తమపై వేలాడుతున్నదని భావిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా పాలనపై పడుతుంది. రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే బాగుండేది. -
మాతృభాష తప్పనిసరి కాదు
* బోధనా భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టీకరణ * కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ప్రాథమిక విద్యాభ్యాసానికి గాను పాఠశాల ల్లో మాతృభాషను ప్రభుత్వం తప్పనిసరి చేయజాలదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భాషాపరమైన అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని తెలిపింది. రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ప్రాథమిక విద్యను నేర్చుకునేందుకు మాతృ భాషను తప్పనిసరి చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మీడియంలోనే బోధించాలని 1994లో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు సవాలు చేశాయి. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తొలుత ఇద్దరు సభ్యుల సుప్రీం బెంచ్ ముందుకు ఈ అంశం వచ్చింది. సదరు బెంచ్ గత ఏడాది జూలైలో.. పిల్లల అభ్యున్నతిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని తెలియజేసింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న అంశం ప్రస్తుత తరమే కాకుండా భవిష్యత్ తరాల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ లోధా నేతృత్వంలో న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎస్.జె.ముఖోపాధ్యాయ, దీపక్ మిశ్రా, ఎస్.ఎం.ఐ.కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. రాజ్యాంగంలోని 350 ఏ ప్రకారం.. కేవలం మాతృభాషనే బోధనా మాధ్యమంగా ఎంచుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయజాలదని పేర్కొంటూ తీర్పు చెప్పింది. విద్యార్థికి మరింత ప్రయోజనకరమనే కారణంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా బలవంతం చేయజాలదని స్పష్టం చేసింది. మాతృభాషను తప్పనిసరి చేయడం విద్యా ప్రమాణాలపై ఏ విధంగానూ ప్రభావం చూపించదని, పైగా రాజ్యాంగంలోని అధికరణాలు 19(1)(ఏ), 19(1)(జీ) కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ప్రభావం చూపుతాయని ధర్మాసనం పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలో బోధన కోసం భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టం చేసింది.