మళ్లీ వేలం వేస్తాం!
* బొగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకు కేంద్రం వివరణ
* 40 గనులకు మాత్రం రద్దు నుంచి మినహాయింపు కోరిన ఏజీ
న్యూఢిల్లీ: 1993- 2010 మధ్య జరిగిన అన్ని బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే.. వాటిని మళ్లీ వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 1993 నుంచి 2010 వరకు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అడ్డగోలుగా, అక్రమంగా జరిగాయని ఆగస్టు 25న సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు. ‘బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి ఆగస్ట్ 25 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
అందుకు అనుగుణంగా మొత్తం 218 బొగ్గు క్షేత్రాలను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వాటిలో నుంచి విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా.. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 40 బొగ్గు గనులకు రద్దు నుంచి మినహాయింపునిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది’ అని రోహత్గీ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి స్పష్టం చేశారు. అయితే, అన్ని కేటాయింపులూ చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు స్పష్టం చేసినందువల్ల.. ఆ తీర్పు ప్రకారమే వెళ్లాలనుకుంటే అన్ని కేటాయింపులను రద్దు చేసి తాజాగా వేలం వేయాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలను సమీక్షించేందుకు మాజీ న్యాయమూర్తితో కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని రోహత్గీ స్పష్టం చేశారు.
తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. సెప్టెంబర్ 8 లోగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలతో పాటు పిటిషనర్లను ఆదేశించింది. బొగ్గు గనుల కేటాయింపు అంశంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నందున, ఆగస్ట్ 25 నాటి తీర్పును వ్యక్తుల నేరసంబంధ అంశాల జోలికి వెళ్లకుండా.. చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తతతో ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు విచారణలో తనకు సహకరించేందుకు ముగ్గురు సీనియర్ సీబీఐ ప్రాసిక్యూటర్లను నియమించాలన్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్‌ఎస్ చీమా అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వీకే శర్మ, సంజయ్‌కుమార్, ఏపీ సింగ్‌లకు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది.
ఆ క్లోజర్ రిపోర్ట్ నిర్హేతుకం
కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై, ఆ సంస్థ డెరైక్టర్లపై బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించిన కేసులను మూసేయాలం టూ సీబీఐ రూపొందించిన ముగింపు నివేదిక(క్లోజర్ రిపోర్ట్)ను ప్రత్యేక కోర్టు సోమవారం తీవ్రంగా ఆక్షేపించింది. ఆ నివేదిక అసంబద్ధం గా, తర్కదూరంగా ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశ్కర్ తప్పుపట్టారు.