Allocation of coal blocks
-
బొగ్గు స్కామ్‌లో మధు కోడాకు బెయిల్
న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురికి కూడా బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులు బెయిల్ లభించినవారిలో ఉన్నారు. ఈ కేసులో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ప్రభాత్ ప్రశార్ పేర్కొన్నారు. ఒక్కొక్కరు లక్షరూపాయల వ్యక్తిగత బాండ్లు, అంతే మొత్తంలో పూచీకత్తు సమర్పించాలని షరతు విధించారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు. వాదనల సందర్భంగా వీరికి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ కోర్టును కోరింది. వీరంతా అధికార దుర్వినియోగంతోపాటు కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపింది. ఇందులో హెచ్‌సీ గుప్తా గతంలో ప్రధాని కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టించారని సీబీఐ, ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. -
అవన్నీ తప్పుడు కేటాయింపులే!
-
కోల్గేట్ పై సుప్రీంకోర్టు
-
కేటాయింపులన్నీ రద్దు
‘కోల్గేట్’పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం 1993 నుంచి కేటాయించిన 218 బ్లాకుల్లో 214 రద్దు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఇరవయ్యేళ్లలో కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. రద్దు చేసిన బ్లాకుల్లో పనిని నిలిపేసి.. ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 163 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఆయా బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం తిరిగి వేలం నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. ‘కోల్’గేట్ దుమారం: యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విష యం తెలిసిందే. ‘కోల్గేట్’ స్కామ్‌గా పేరు పొందిన ఈ వ్యవహారంలో.. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం గద్దెదిగాలంటూ విపక్షాలు కొద్దిరోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది. రద్దు చేయవద్దన్న యూపీఏ: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయవద్దని అప్పట్లో జరిగిన విచారణ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ బ్లాకులను పొందిన సంస్థలు వాటిల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయని.. దీంతోపాటు ఈ కేటాయింపులను రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందని వాదించింది. కానీ ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. అసలు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... బొగ్గు కేటాయింపులను రద్దు చేయడం వల్ల నెలకొంటాయని భావిస్తున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. అన్నీ చట్ట విరుద్ధమే..: ‘కోల్’గేట్ కుంభకోణం విచారణలో భాగంగా 1993 నుంచి 2010 వరకూ కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు చేసిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినవారికి బొగ్గు కేటాయింపులు చేశారని.. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. పారదర్శకత ఏ మాత్రం లేని విధానం వల్ల జాతీయ సంపద అయిన బొగ్గు అక్రమ కేటాయింపులకు కారణమైందని ధర్మాసనం పేర్కొంది. అసలు స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడూ నిలకడగా లేదని.. సరైన విధానమేదీ లేకుండానే, నిబంధనలను పాటించకుండానే ప్రతిపాదనలు చేసిందంటూ ధర్మాసనం తప్పుబట్టింది. నాలుగింటికే మినహాయింపు..: 1993 నుంచి చేసిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపులో.. ఎన్టీపీసీ, సెయిల్లకు కేటాయించిన ఒక్కో బ్లాకు, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన 2 బ్లాకులు మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపును ఇచ్చింది. మిగతా 214 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ బ్లాకులు పొందిన సంస్థలన్నీ కూడా.. ఆయా చోట్ల తమ వ్యాపారాన్ని ముగించి, బ్లాకులను ప్రభుత్వానికి అప్పగించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వానికి పరిహారం చెల్లించండి: కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. దీని పై కాగ్ సూచించిన మేరకు ఆయా సంస్థలు బొగ్గు వెలికితీత అంచనాపై ఒక్కో టన్నుకు రూ. 295 చొప్పు న ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం! న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... భవిష్యత్తులో బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన అంశంపై సంబంధిత భాగస్వాములు (బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన సంస్థల) అందరి ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఆరునెలల పాటు గడువు ఇచ్చిందని.. ఈ లోగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హర్షణీయమని.. ఇది సరికొత్త విధానానికి తోడ్పడుతుందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఆరోపణల్లోని డొల్లతనం సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ‘కోల్’ వివాదమిదీ..! ► 1992 జూలై: ప్రైవేటు సంస్థలకు తొలుత వచ్చి న వారికి తొలుత ప్రాతిపదికన బొగ్గు గనుల కేటాయింపు ప్రతిపాదనల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుకు బొగ్గు శాఖ ఆదేశాలు. ► 1992 జూలై 14: కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ప్రణాళికల్లో లేని 143 కొత్త బొగ్గు బ్లాకుల గుర్తింపు, జాబితా తయారీ. ► 1993 -2010: దాదాపు 1993 నుంచి 2005 మధ్య 70 బొగ్గు బ్లాకులు, 2006లో 53, 2007లో 52, 2008లో 24, 2009లో 16, 2010లో 1.. మొత్తంగా 216 బొగ్గు బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించారు. వీటిలో 24 బ్లాకుల కేటాయింపును మధ్యలో రద్దు చేశారు. ► 2012 మార్చి: బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ వెల్లడించింది. 2004-09 మధ్య దాదాపు రూ.10.7 లక్షల కోట్ల లబ్ధి ఆయా సంస్థలకు చేకూరిందని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. ► 2012 మే 31: ఇద్దరు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఆధారంగా ఈ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఆదేశించింది. ► 2012 జూన్: ఈ అంశంపై సమీక్షకు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 80 బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని, 42 సంస్థలకు చెందిన బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకుంది. ► 2012 సెప్టెంబర్ 6: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిల్ . సీబీఐ దర్యాప్తును పర్యవేక్షణలోకి తీసుకున్న కోర్టు. ► 2013 మార్చి: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేయొద్దని సీబీఐకి ఆదేశం. ► 2013 ఏప్రిల్ 23: ఈ అంశంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం. 1993-2008 మధ్య కేటాయింపులన్నీ అసంబద్ధమేనని అందులో వెల్లడి. ► 2013 ఏప్రిల్ 26: దర్యాప్తు అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌కు అందజేసినట్లు కోర్టుకు సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా వెల్లడి ► 2013 మే 10: అశ్వనీకుమార్ రాజీనామా ► 2013 జూన్ 11: ‘బొగ్గు’ కేసులో పారిశ్రామిక వేత్తలు నవీన్ జిందాల్, దాసరి నారాయణరావు పేర్లను పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్. ► 2014 జూలై: ‘బొగ్గు’ కేసులన్నింటి విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు. ► 2014 ఆగస్ట్: బిర్లా, పరేఖ్‌లపై కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయం ► 2014 ఆగస్ట్ 25: 1993 నుంచి 2010 మధ్య కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు. ► 2014 సెప్టెంబర్ 24: 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు. -
సుప్రీం, గణాంకాలపై దృష్టి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కు సంబంధించి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు తెరలేవనుంది. గత రెండు దశాబ్దాలలో(1993 నుంచి 2010 వరకూ) వివిధ ప్రభుత్వాలు చేపట్టిన కేటాయింపులన్నీ అక్రమమేనంటూ ఇప్పటికే సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వారంలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వె ల్లడికానున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని, దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూసే అవకాశాలున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బుల్లిష్ ధోరణిలో సాగుతున్న మార్కెట్లకు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో హియరింగ్ ప్రభావం మెటల్, పవర్ షేర్లపై కనిపిస్తుందని పేర్కొన్నారు. మరింత ముందుకు.... జూలై నెలకు ఐఐపీ, ఆగస్ట్ నెలకు సీపీఐ గణాంకాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ మార్కెట్ల సంకేతాలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు వివరించారు. గడచిన వారంలో సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 27,027 వద్ద ముగిసింది. ఒక దశలో 27,226 పాయింట్ల కొత్త గరిష్టానికి సైతం చేరింది. డెరివేటివ్ లావాదేవీలు, ట్రేడర్ల ఆసక్తి, బలపడ్డ సెంటిమెంట్ వంటి అంశాల ఆధారంగా ఈ వారంలోనూ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కొనసాగుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా ఇందుకు సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు. జీడీపీతో జోష్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో జీడీపీ 5.7%కు పుంజుకోవడం గత వారంలో ఇన్వెస్టర ్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం చల్లబడటం వంటి అంశాలు దీనికి జతకలిశాయని చెప్పారు. ఇకపై ఐఐపీ, సీపీఐ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇంతక్రితం విడుదలైన ఈ గణాంకాల్లో వృద్ధి నమోదుకావడంతో వీటిపై సానుకూల అంచనాలున్నాయని తెలిపారు. కాగా, సాంకేతిక అంశాల ప్రకారం మార్కెట్లు మరింత పురోగమిస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. అయితే బొగ్గు క్షేత్రాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో పరిమాణాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు. గడచిన శుక్రవారం యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) పాలసీ రేట్లను తగ్గించడంతోపాటు, అదనపు సహాయక ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరిన్ని విదేశీ నిధులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు తరలి వస్తాయన్న అంచనాలు పెరిగాయని డీలర్లు చెప్పారు. తొలి వారం రూ. 9,000 కోట్ల పెట్టుబడులు దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ. 9,000 కోట్లను(150 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 3,972 కోట్లను(65.6 కోట్ల డాలర్లు) స్టాక్స్ కొనుగోలుకి వెచ్చించగా, రూ. 5,013 కోట్లను(82.8 కోట్ల డాలర్లు) బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు. -
మళ్లీ వేలం వేస్తాం!
* బొగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకు కేంద్రం వివరణ * 40 గనులకు మాత్రం రద్దు నుంచి మినహాయింపు కోరిన ఏజీ న్యూఢిల్లీ: 1993- 2010 మధ్య జరిగిన అన్ని బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే.. వాటిని మళ్లీ వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 1993 నుంచి 2010 వరకు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అడ్డగోలుగా, అక్రమంగా జరిగాయని ఆగస్టు 25న సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు. ‘బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి ఆగస్ట్ 25 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగా మొత్తం 218 బొగ్గు క్షేత్రాలను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వాటిలో నుంచి విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా.. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 40 బొగ్గు గనులకు రద్దు నుంచి మినహాయింపునిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది’ అని రోహత్గీ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి స్పష్టం చేశారు. అయితే, అన్ని కేటాయింపులూ చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు స్పష్టం చేసినందువల్ల.. ఆ తీర్పు ప్రకారమే వెళ్లాలనుకుంటే అన్ని కేటాయింపులను రద్దు చేసి తాజాగా వేలం వేయాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలను సమీక్షించేందుకు మాజీ న్యాయమూర్తితో కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని రోహత్గీ స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. సెప్టెంబర్ 8 లోగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలతో పాటు పిటిషనర్లను ఆదేశించింది. బొగ్గు గనుల కేటాయింపు అంశంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నందున, ఆగస్ట్ 25 నాటి తీర్పును వ్యక్తుల నేరసంబంధ అంశాల జోలికి వెళ్లకుండా.. చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తతతో ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు విచారణలో తనకు సహకరించేందుకు ముగ్గురు సీనియర్ సీబీఐ ప్రాసిక్యూటర్లను నియమించాలన్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ చీమా అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వీకే శర్మ, సంజయ్‌కుమార్, ఏపీ సింగ్‌లకు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. ఆ క్లోజర్ రిపోర్ట్ నిర్హేతుకం కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై, ఆ సంస్థ డెరైక్టర్లపై బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించిన కేసులను మూసేయాలం టూ సీబీఐ రూపొందించిన ముగింపు నివేదిక(క్లోజర్ రిపోర్ట్)ను ప్రత్యేక కోర్టు సోమవారం తీవ్రంగా ఆక్షేపించింది. ఆ నివేదిక అసంబద్ధం గా, తర్కదూరంగా ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశ్కర్ తప్పుపట్టారు.