కేటాయింపులన్నీ రద్దు | Supreme Court quashes allocation of 214 coal blocks | Sakshi
Sakshi News home page

కేటాయింపులన్నీ రద్దు

Published Thu, Sep 25 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

కేటాయింపులన్నీ రద్దు

కేటాయింపులన్నీ రద్దు

‘కోల్‌గేట్’పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం 
1993 నుంచి కేటాయించిన 218 బ్లాకుల్లో 214 రద్దు

 
న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఇరవయ్యేళ్లలో కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. రద్దు చేసిన బ్లాకుల్లో పనిని నిలిపేసి.. ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 163 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఆయా బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం తిరిగి వేలం నిర్వహించేందుకు అవకాశం లభించనుంది.

‘కోల్’గేట్ దుమారం: యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విష యం తెలిసిందే. ‘కోల్‌గేట్’ స్కామ్‌గా పేరు పొందిన ఈ వ్యవహారంలో.. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం గద్దెదిగాలంటూ విపక్షాలు కొద్దిరోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది.

రద్దు చేయవద్దన్న యూపీఏ: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయవద్దని అప్పట్లో జరిగిన విచారణ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ బ్లాకులను పొందిన సంస్థలు వాటిల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయని.. దీంతోపాటు ఈ కేటాయింపులను రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందని వాదించింది. కానీ ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. అసలు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... బొగ్గు కేటాయింపులను రద్దు చేయడం వల్ల నెలకొంటాయని భావిస్తున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది.
 అన్నీ చట్ట విరుద్ధమే..: ‘కోల్’గేట్ కుంభకోణం విచారణలో భాగంగా 1993 నుంచి 2010 వరకూ కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు చేసిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినవారికి బొగ్గు కేటాయింపులు చేశారని.. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. పారదర్శకత ఏ మాత్రం లేని విధానం వల్ల జాతీయ సంపద అయిన బొగ్గు అక్రమ కేటాయింపులకు కారణమైందని ధర్మాసనం పేర్కొంది. అసలు స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడూ నిలకడగా లేదని.. సరైన విధానమేదీ లేకుండానే, నిబంధనలను పాటించకుండానే ప్రతిపాదనలు చేసిందంటూ ధర్మాసనం తప్పుబట్టింది.

నాలుగింటికే మినహాయింపు..: 1993 నుంచి చేసిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపులో.. ఎన్టీపీసీ, సెయిల్‌లకు కేటాయించిన ఒక్కో బ్లాకు, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన 2 బ్లాకులు మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపును ఇచ్చింది. మిగతా 214 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ బ్లాకులు పొందిన సంస్థలన్నీ కూడా.. ఆయా చోట్ల తమ వ్యాపారాన్ని ముగించి, బ్లాకులను ప్రభుత్వానికి అప్పగించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది.

 ప్రభుత్వానికి పరిహారం చెల్లించండి: కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. దీని పై కాగ్ సూచించిన మేరకు ఆయా సంస్థలు బొగ్గు వెలికితీత అంచనాపై ఒక్కో టన్నుకు రూ. 295 చొప్పు న ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... భవిష్యత్తులో బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన అంశంపై సంబంధిత భాగస్వాములు (బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన సంస్థల) అందరి ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఆరునెలల పాటు గడువు ఇచ్చిందని.. ఈ లోగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హర్షణీయమని.. ఇది సరికొత్త విధానానికి తోడ్పడుతుందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఆరోపణల్లోని డొల్లతనం సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
 
‘కోల్’ వివాదమిదీ..!
 
1992 జూలై: ప్రైవేటు సంస్థలకు తొలుత వచ్చి న వారికి తొలుత ప్రాతిపదికన బొగ్గు గనుల కేటాయింపు ప్రతిపాదనల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుకు బొగ్గు శాఖ ఆదేశాలు.

1992 జూలై 14: కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ప్రణాళికల్లో లేని 143 కొత్త బొగ్గు బ్లాకుల గుర్తింపు, జాబితా తయారీ.
 
1993 -2010: దాదాపు 1993 నుంచి 2005 మధ్య 70 బొగ్గు బ్లాకులు, 2006లో 53, 2007లో 52, 2008లో 24, 2009లో 16,
2010లో 1.. మొత్తంగా 216 బొగ్గు బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించారు. వీటిలో 24 బ్లాకుల కేటాయింపును మధ్యలో రద్దు చేశారు.
 
2012 మార్చి: బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ వెల్లడించింది. 2004-09 మధ్య దాదాపు రూ.10.7 లక్షల కోట్ల లబ్ధి ఆయా సంస్థలకు చేకూరిందని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది.
 
2012 మే 31: ఇద్దరు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఆధారంగా ఈ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఆదేశించింది.
 
2012 జూన్: ఈ అంశంపై సమీక్షకు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 80 బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని, 42 సంస్థలకు చెందిన బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకుంది.
 
2012 సెప్టెంబర్ 6: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిల్ . సీబీఐ దర్యాప్తును పర్యవేక్షణలోకి తీసుకున్న కోర్టు.
 
2013 మార్చి: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేయొద్దని సీబీఐకి  ఆదేశం.
 
2013 ఏప్రిల్ 23: ఈ అంశంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం. 1993-2008 మధ్య కేటాయింపులన్నీ అసంబద్ధమేనని అందులో వెల్లడి.
 
2013 ఏప్రిల్ 26: దర్యాప్తు అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌కు అందజేసినట్లు కోర్టుకు సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా వెల్లడి
 
2013 మే 10: అశ్వనీకుమార్ రాజీనామా
 
2013 జూన్ 11: ‘బొగ్గు’ కేసులో పారిశ్రామిక వేత్తలు నవీన్ జిందాల్, దాసరి నారాయణరావు పేర్లను పేర్కొంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్.
 
2014 జూలై: ‘బొగ్గు’ కేసులన్నింటి విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు.
 
2014 ఆగస్ట్: బిర్లా, పరేఖ్‌లపై కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయం
 
2014 ఆగస్ట్ 25: 1993 నుంచి 2010 మధ్య కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు.
 
2014 సెప్టెంబర్ 24: 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement