గవర్నర్ తొలగింపుపై నోటీసులు
ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు చర్య
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపుపై ఏర్పడిన వివాదం తాజాగా కోర్టుకెక్కింది. ఉత్తరాఖండ్ గవర్నర్ పదవినుంచి తనచేత రాజీనామా చేయించేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరును సవాలుచేస్తూ అజీజ్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని, లేదా కేంద్రంచేత బర్తరఫ్‌కు సిద్ధపడాలని తనను బెదిరించినట్టు ఖురేషీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్‌లోని అంశాలు రాజ్యాంగంలోని 156వ ఆర్టికల్ (గవర్నర్ పదవీకాలం)కు సంబంధించివైనందున పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదలీ చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా అధ్యక్షతలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ, గవర్నర్ రాజీనామా కోరేందుకు ఒక పద్ధతి అంటూ ఉండాలని, గవర్నర్‌ను తొలగించేందుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుందని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి కేవలం ఒక ఫోన్‌కాల్‌తో గవర్నర్‌ను రాజీనామా కోరడం కుదరదని అన్నారు. ఈ అంశంపై గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిబల్ ఉదహరించారు. గవర్నర్ల తొలగింపు వ్యవహారంలో మోడీ సర్కార్ చర్యను వ్యతిరేకిస్తూ ఖురేషీ మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీఏ నియమించిన మరో ఇద్దరు గవర్నర్లను కేంద్రం బర్తరఫ్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ నలుగురు గవర్నర్లు రాజీనామా చేశారు.