సీబీఐ జేడీగా అర్చన నియామకం అక్రమం
తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
కేంద్రం నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది
న్యూఢిల్లీ: సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరాన్ని నియమించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ప్రాథమిక ఆధారాలను అనుసరించి ఆమె నియామకం అక్రమం, చట్టవిరుద్ధమని శుక్రవారం తేల్చిచెప్పింది. ఆమె పేరును సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించకపోయినా ఎలా నియమించారంటూ చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. ఒకసారి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని అమలుచేయాలని కేంద్రానికి చెప్పింది. అదే న్యాయమని, దానిని పాటించాలని పేర్కొంది. కేంద్ర నిర్ణయం చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని, సీబీఐ నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం తెలిపింది. ఎస్‌పీ ఆపై ర్యాంకుల నియామకాలకు సంబంధించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్‌పీఈ) చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఆమె నియామకాన్ని చేపట్టారనేది పిటిషనర్ అందించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి అవగతమవుతోందని కోర్టు పేర్కొంది.
తదుపరి విచారణ వరకు అదనపు డెరైక్టర్‌గా ఆమెను విధుల్లో చేరకుండా నిరోధించాలని సీబీఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14కు వాయిదావేసింది. అర్చన నియామకం ఏకపక్షం గా తీసుకున్న నిర్ణయమని, గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును విస్మరించారని జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పైఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్.. ఎంపిక కమిటీ కొంతమందితో కూడిన ప్యానల్ పేర్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కపేరే ఇచ్చిందని తెలిపారు. ఆమె నియామక పత్రాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా, 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనా సుందరం సీబీఐ డీఐజీగా విధులు నిర్వహించారు. తర్వాత తొలి మహిళా జాయింట్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అయితే విధుల్లో చేరిన రోజే తమిళనాడు ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.