సంపాదకీయం: దేశంలో అవినీతిని అంతమొందించడానికి తాము కంకణం కట్టుకు న్నామని చెబుతూనే అందుకు అవరోధాలను సృష్టించగల అనేకానేక నిబంధనలను చట్టాల్లో చేర్చడాన్ని అలవాటుగా చేసుకున్న పాలకులకు సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు శరాఘాతం వంటిది. అవినీతి కేసుల్లో ఉన్నతస్థాయి అధికారులపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అవసరమనే చట్ట నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం చట్టం(డీఎస్‌పీ ఈఏ)లోని సెక్షన్ 6ఏ చెల్లబోదని ప్రకటించింది. అవినీతి కేసుల్లో ఇరుక్కునే సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను విచారించడానికి ఆయా విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల అనుమతిని సెక్షన్ 6ఏ తప్పనిసరి చేస్తున్నది. ఇలాంటి కేసుల్లో ఏళ్లూ పూళ్లూ గడిచినా అనుమతులు లభించక అవినీతి కేసుల దర్యాప్తు కొలిక్కిరావడం లేదు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులు రిటైరైతే తప్ప వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు సీబీఐకి లభించడంలేదు. కిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడే సందర్భాల్లో వెనువెంటనే వారిని అరెస్టు చేస్తారు. కొలువునుంచి సస్పెండ్ చేస్తారు. ఒకపక్క చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతుండగా అందుకు విరుద్ధమైన నిబంధనలు ఇప్పటికీ చట్టాల్లో క్షేమంగా ఉండటమే ఒక విడ్డూరం. పార్టీలు ఏవైనా, సిద్ధాంతాలు ఎలాంటివైనా అవినీతిని అంతమొందించే విషయంలో అందరిదీ పెడదారేనని సెక్షన్ 6ఏ నిరూపించింది. వాస్తవానికి 1946లో డీఎస్‌పీఈఏ చట్టం ఏర్పరిచి నప్పుడు అందులో ఈ నిబంధనలేదు. అటు తర్వాత ఇలాంటి నిబంధనపెట్టినప్పుడు జైన్ డైరీ-హవాలా కేసులో 1997లో సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసింది.
ఆ మరుసటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మళ్లీ దీన్ని చేరుస్తూ ఆర్డినెన్స్ జారీచేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ ఆర్డినెన్స్ కాస్తా మూలబడింది. మళ్లీ ఇదే నిబంధనను 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం డీఎస్‌పీఈఏలో 6ఏ రూపంలో చేర్చింది. ఈ నిబంధన కేవలం ఉన్నతాధికారులను మాత్రమే సంరక్షించే సాధనమైతే పాలకులు ఇంత శ్రద్ధ తీసుకునేవారు కాదు. తమకు కూడా ఇది పరోక్షంగా తోడ్పడుతున్నది గనుకే వారికా ఉత్సాహం! అవినీతి ఆరోపణలొచ్చిన ఉన్నతాధికారులను వెనువెంటనే విచారిస్తే, ఆ క్రమంలో తమ ప్రభుత్వ లొసుగులు లేదా మంత్రుల నిర్వాకాలు బయటికొస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులెదురవుతాయని పాల కులు భయపడుతున్నారు. అందువల్లే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని అవినీతి కేసులు తెమలకుండా జాగ్రత్తపడుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గంభీరంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే ప్రభుత్వమే తీరా అందుకు అవసరమైన అనుమతులను ఇవ్వకుండా ఆ దర్యాప్తునకు మోకాలడ్డుతుంది. ఇందులో మరో కోణం కూడా ఉన్నది. తమకు రాజకీయ ప్రత్యర్థులని భావించిన వారిని వేధించడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఎడాపెడా వాడుకుంటున్నది.
ఒకపక్క తమ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తూనే అందులో భాగంగా కేసులు ఎదుర్కొనే ఉన్నతాధికారుల దర్యాప్తునకు ఎంతకాల మైనా అనుమతులివ్వక సాగదీస్తోంది. అందుకు మన రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులే పెద్ద ఉదాహరణ. ఒకపక్క ఆయనపై చార్జిషీట్లు కూడా దాఖలుచేసి, అవి పూర్తయ్యేవరకూ 16 నెలలకాలంపాటు ఆయ నను నిర్బంధంలో ఉంచిన ప్రభుత్వం...అదే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న కొంతమంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు ఇంతవరకూ అనుమతు లివ్వలేదు. అలాంటి అనుమతులు వెనువెంటనే ఇచ్చివుంటే కేసులు త్వరితగతిన పూర్తవుతాయి. పాలకుల డొల్లతనం కూడా బయటపడు తుంది. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు దీర్ఘకాలం సాగలాగితేనే తమకు లాభదాయకమని భావించడంవల్లే పాలకులు ఇలా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారు.
నిందితులపై సత్వరమే దర్యాప్తు పూర్తిచేసి, దోషులుగా తేలినవారిని శిక్షించాలని భావించడంలో తప్పుబట్టాల్సింది లేదు. కానీ, ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ కోణాన్ని స్పృశించినట్టు లేదు. సీబీఐ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, ఆ సంస్థకు తగినంతగా స్వయంప్రతిపత్తి ఇస్తే...దానికి జవాబుదారీతనాన్ని కూడా తప్పనిసరిచేస్తే ఇలాంటి నిబంధనలను తొలగించడంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ, దాన్ని ఇప్పుడున్న తరహాలోనే ఉంచి 6ఏ వంటి నిబంధనలను తొలగిం చడంవల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఆ నిబంధనను గుత్తగా తొలగించే బదులు...అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసినప్పుడు దానిపై నిర్దిష్ట కాలావధిలో కేంద్రం నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేస్తే బాగుండేది.
ఆ వ్యవధిలోగా కేంద్రం స్పందించకపోతే ఆ అధికారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి మంజూరుచేసినట్టుగా భావించేలా నిబంధన ఉంటే సరిపోతుంది. కనీసం నిందపడిన ఉన్నతా ధికారి విషయంలో సీబీఐ ముందుకెళ్లాలో లేదో నిర్ణయించే అధికారాన్ని సీవీసీ వంటి వ్యవస్థలకు కట్టబెట్టినా సబబుగా ఉంటుంది. ఉన్నతాధి కారవర్గం విధానపరమైన అంశాల్లో నిర్ణయం తీసుకోవడానికి లేదా అధికారంలో ఉన్నవారికి సలహాలివ్వడానికి సందేహిస్తే... సీబీఐ కత్తి తమపై వేలాడుతున్నదని భావిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా పాలనపై పడుతుంది. రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే బాగుండేది.
అవినీతిపై సుప్రీం పంజా!
Published Thu, May 8 2014 1:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement