న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా నలుగుతున్న ముళ్లపెరియార్ డ్యామ్ వివాదంలో కేరళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 120 ఏళ్ల నాటి ఈ డ్యామ్ సురక్షితమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో నీటిమట్టాన్ని 142 అడుగుల ఎత్తుకు పెంచుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. డ్యామ్‌ను మరింత పటిష్టపరిచాక నీటిమట్టాన్ని అంతిమంగా 152 అడుగులకు కూడా పెంచుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా, న్యాయమూర్తులు హెచ్‌ఎల్ దత్తు, సీకే ప్రసాద్, మదన్ బి.లోకూర్, ఎంవై ఇక్బాల్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తమిళనాడును అడ్డుకోరాదని కేరళను ఆదేశించింది. అంతేగాక, డ్యామ్ సురక్షితం కాదని, కనుక నీటిమట్టాన్ని 136 అడుగులకే పరిమితం చేయాలని పేర్కొంటూ కేరళ సర్కారు 2006లో చేసిన చట్టాన్ని కొట్టేసింది. తమ గత తీర్పును ఉల్లంఘిస్తూ అలాంటి చట్టం చేసినందుకు అక్షింతలు వేసింది. తమ రాష్ట్ర ప్రజల భద్రత కోసమే ఆ చట్టం చేయాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది.