కేబినెట్‌లో నేర చరితులు వద్దు
* ప్రధాని, సీఎంలకు సుప్రీంకోర్టు సూచన
* విచక్షణతో మెలగాలి
* చీఫ్ జస్టిస్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ: అవినీతి, క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను మంత్రులుగా నియమించవద్దంటూ ప్రధాని, ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు సూచించింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా అలాంటి వారిని దూరంగా పెట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అలాంటి వారు మంత్రి పదవులు చేపట్టడానికి అనర్హులని మాత్రం పేర్కొనలేదు. ఈ విషయాన్ని ప్రధాని, ముఖ్యమంత్రుల విచక్షణాధికారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి, నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్య పవిత్రతను దెబ్బతీస్తాయని పేర్కొంది. నేర చరితులను కేబినెట్‌లోకి తీసుకోకుండా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ప్రధాని, కేబినెట్ మంత్రుల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 75(1)లో అనర్హత అంశాన్ని చేర్చలేమని, అయితే ఈ విషయంలో ప్రధాని, సీఎంలే కల్పించుకుని నేరమయ వ్యక్తులను కేబినెట్‌లోకి తీసుకోకుండా దూరంగా పెట్టాలని పేర్కొంది. ప్రధాని, ముఖ్యమంత్రులను రాజ్యాంగం అమితంగా విశ్వాసంలోకి తీసుకున్నదని, అందువల్ల రాజ్యాంగ బాధ్యతలను ధర్మాసనం అభిప్రాయపడింది. విశ్వసనీయతకు ప్రధాని కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో విచక్షణతో మెలగాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పాలనను ప్రజలెవరూ కోరుకోరని రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రాజ్యాంగ అమలులో ప్రభుత్వాధినేతల పాత్రను గుర్తు చేయడం కోర్టు బాధ్యత అని, అందుకే ప్రధాని, సీఎంలు వివేకంతో ప్రవర్తించాలని జస్టిస్ జోసెఫ్ అన్నారు.
మార్పు కష్టమే!: సుప్రీంకోర్టు తీర్పు ప్రధానంగా సలహాపూర్వకమైనది కాబట్టి అది ప్రధాని, ముఖ్యమంత్రులపై కొంతవరకు నైతికపరమైన ఒత్తిడి తేగలుగుతుంది కానీ ప్రభుత్వ వ్యవస్థలో భారీ మార్పు తీసుకురాలేకపోవచ్చని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక నిర్ణయం ప్రధానిదే: సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రధాని మోడీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్డీయే ప్రభుత్వంలోని 14 మంది మంత్రులపై కేసులు ఉన్నాయని, వారిని కొనసాగించే విషయం మోడీ చేతుల్లోనే ఉందని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ పేర్కొన్నారు.