న్యూఢిల్లీ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ హ్యాకర్స్ బారిన పడుతూ అకౌంట్లు గుల్ల చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు. ఏకంగా మాజీ సీజేఐ లావాదేవీలపై కన్నేసిన హ్యాకర్స్.. ఆయన ఫ్రెండ్స్ లిస్టులోని జస్టిస్ బీసీ సింగ్ ఈ- మెయిల్‌ను హ్యాక్ చేసి లోధా నుంచి లక్ష రూపాయలు దోచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ట్రీట్‌మెంట్ కోసం డబ్బు కావాలని..
‘ ఏప్రిల్ 19న బీపీ సింగ్ నుంచి నాకు ఈ-మెయిల్ వచ్చింది. తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలని అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కదా అని వెంటనే లక్ష రూపాయలు ఆన్‌లైన్ ద్వారా(రెండు విడతల్లో) పంపించాను’ అని జస్టిస్ లోధా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి దక్షిణ ఢిల్లీ ఏసీపీ మాట్లాడుతూ..‘ జస్టిస్ బీపీ సింగ్ తన ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. ఈ క్రమంలో తన అకౌంట్ నుంచి ఆర్‌ఎం లోధాకు వెళ్లిన మెసేజ్‌ల వల్ల ఆయన మోసపోయారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా లోధాకు సూచించారు. దీంతో జస్టిస్ లోధా మమ్మల్ని ఆశ్రయించారు. చీటింగ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని..సైబర్ క్రైమ్ బ్రాంచ్ టీం విచారణ జరుపుతున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment