ఎల్‌వోపీపై స్పష్టతకు సుప్రీం నిర్ణయం
ప్రతిపక్ష నేత పాత్ర చట్ట సభల్లో కీలకమైనది
అది లోక్‌పాల్‌కు మాత్రమే పరిమితం కాదు
రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని ఆదేశం
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) హోదాపై కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టబద్ధమైన సంస్థల్లో ప్రతిపక్ష నేత హోదాపై అర్థ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయాన్ని తెలపాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ప్రజల మనోభావాలను ప్రతిపక్ష నేత విభిన్న కోణంలో సభల్లో వినిపిస్తారంటూ ఆ హోదా ప్రాముఖ్యాన్ని ధర్మాసనం వివరించింది. లోక్‌పాల్ ఎంపికలో ఎలోవోపీ పాత్ర కూడా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేత లేని కారణంగా ఆ చట్టాన్ని కోల్డ్‌స్టోరేజిలో పెట్ట లేమని, ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం గుర్తించింది. లోక్‌పాల్ చట్టానికి సంబంధించి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతకు ప్రతిపక్షనేత హోదా ఇస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. సెప్టెంబర్ 9న జరిగే విచారణలో తమ అభిప్రాయాన్ని తెలపాలని ఆదేశించింది. ఎల్‌వోపీ పాత్ర కేవలం లోక్‌పాల్‌కు మాత్రమే పరిమితం కాదని, ప్రస్తుతం ఉన్న, భవిష్యత్‌లో తెచ్చే చట్టాల విషయంలో ఆ పాత్రకు కీలక పరిధి ఉందని సుప్రీం తెలిపింది. లోక్‌పాల్ చట్టంలో కొన్ని నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉందని విచారణలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సెలెక్షన్ కమిటీలో ఎల్‌వోపీ లేకపోతే లోక్‌పాల్ ఖాళీగానే ఉండిపోతుందని అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గీ కోర్టుకు తెలిపారు. గతంలో కూడా కొన్ని సార్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేరని ఆయన చెప్పారు. అప్పట్లో ఇలాంటి చట్టాలు లేవన్న కోర్టు.. ఎల్‌వోపీపై సరియైన నిర్వచనం అవసరం అని అభిప్రాయపడింది.
స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించాలి
లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాపై స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. సుప్రీం నిర్ణయం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. శుక్రవారం ఆయన గోరఖ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధిస్తేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కానీ కాంగ్రెస్ ఆ సంఖ్య సాధించలేకపోయిందన్నారు. అందువల్ల ఆ పార్టీ స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించాలని కోరారు. సుప్రీం వాఖ్యలపై కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. తమ అభిప్రాయాన్నే కోర్టు స్పష్టం చేసిందన్నారు.
కొత్త సీఐసీ నియామకం నిలుపుదల
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌కు నూతన చీఫ్ నియామకాన్ని కేంద్రం శుక్రవారం నిలుపుదల చేసింది. నూతన సీఐసీ ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. 2005 లో సీఐసీ ఏర్పడినప్పటి నుంచి ఆ సంస్థకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకపోవడం ఇదే తొలిసారి. త్రిసభ్య కమిటీలో ప్రధాని, మరో కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీని సిఫార్సు మేరకు రాష్ట్రపతి సీఐసీని నియమిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరినీ గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీల్లో అత్యధిక సీట్లున్న పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా పరిగణించవచ్చు.