సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే.
వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్‌తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న.
ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు.
జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు?
అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్‌లోని ‘కామన్‌వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా!
Comments
Please login to add a commentAdd a comment