kv chowdary
-
రిలయన్స్ బోర్డులోకి మాజీ సీవీసీ
సాక్షి, ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి కేవీ చౌదరి చేరారు. ఈ మేరకు రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం అందించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో చౌదరిని నాన్ ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్ గా నియమకానికి ఆమెదం లభించినట్టు తెలిపింది. అలాగే ఆయన బాధ్యతలు సంస్థలో ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం లేదని పేర్కొంది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి . 1978-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) బ్యాచ్‌కు చెందినవారు. కేవీ చౌదరి ఆగస్టు 2014 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ఛైర్మన్‌గా బాధ్యలను నిర్వహించారు. ఆ తరువాత, సమస్యలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగాను, జూన్ 2015నుంచి 2019 జూన్ వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) గాను పనిచేశారు. కాగా సీవీసీగా అతని నాలుగేళ్ల పదవీకాలంలో, ముఖ్యంగా 2018 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అంతర్గత పోరును పరిష్కరించే క్రమంలో కేవీ చౌదరి వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్‌తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న. ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు? అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్‌లోని ‘కామన్వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా! -
ఆర్బీఐ ఆడిటింగ్ సరిగా లేదు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం జరగడానికి ఆర్బీఐ ఆడిటింగ్ తీరు సరిగా లేకపోవడం కూడా కారణమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి తప్పుబట్టారు. స్కామ్ జరిగిన సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ జరగలేదన్నారు. మరింత పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు. ‘‘రిస్క్‌ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి. కానీ, స్కామ్‌లు జరుగుతున్న సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్‌ను ఎలా కొలుస్తారు. స్కామ్‌లు ఎందుకు బయటకు రావడం లేదు’’అని చౌదరి అన్నారు. ఆర్బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు. నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్‌బీకే స్కామ్‌లు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అనుసరించాలని సూచించారు. ఐసీఏఐకి వివరాలివ్వండి... స్కామ్ వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ)కి కూడా ఇవ్వాలని పీఎన్బీ, దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ స్కామ్‌కు దారితీసిన వ్యవస్థాగత లోటుపాట్లను అధ్యయనం చేయడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోతగిన చర్యలను సూచించేందుకు ఐసీఏఐ.. పది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. -
20న చెన్నైలో ఐసీఏఐ అవార్డుల కార్యక్రమం
న్యూఢిల్లీ: ఐసీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 10వ పురస్కారాల కార్యక్రమం ఈ నెల 20న చెన్నైలో జరగనుంది. సీఏ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించేందుకు గత 9 సంవత్సరాలుగా ఐసీఏఐ ఈ అవార్డులు ఇస్తోంది. ప్రధానంగా 3 విభాగాల్లో ఈ ఏడాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర నిఘా కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జరిగిన జ్యూరీ సమావేశంలో ఈ ఏడాది విజేతలను ఎంపిక చేశారు. మొత్తం 21 మంది సభ్యుల జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసింది. -
సీవీసీగా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేవీ చౌదరితో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కేవీ చౌదరి (కొసరాజు వీరయ్య చౌదరి) కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. -
సీవీసీగా కేవీ చౌదరి
సీఐసీగా విజయ్ శర్మ నియామకం న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మను నియమించింది. గతవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నియామకాల కమిటీ వీరిద్దరి పేర్లను ఖరారు చేయడం తెలిసిందే. వీరి నియామకాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. వీరిద్దరితో పాటు ఇండియన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి సుధీర్ భార్గవను సమాచార శాఖ కమిషనర్‌గా నియమించారు. అవినీతి నిఘా విభాగాల్లో కీలకమైన సీవీసీ పదవికి ఒక ఐఏఎస్ అధికారి కాని వారిని నియమించడం 1964 నుంచి ఇదే మొదటిసారి. ఇక సీఐసీ నియామకంలో సమాచార కమిషనర్లలో ఎక్కువ సీనియారిటీ ఉన్న కమిషనర్‌ను నియమించాలనే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించింది. 2014 ఆగస్టు 22న సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం ముగిసినప్పటి నుంచీ కూడా ప్రభుత్వం ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ప్రధాన కమిషనర్ లేకుండా సీఐసీలో విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు 40,051 ఉన్నాయి. కాగా సీఐసీలో ఖాళీగా ఉన్న మూడు కమిషనర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కురుముద్దాలి నుంచి ఢిల్లీ దాకా సాక్షి ప్రతినిధి, విజయవాడ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన కొసరాజు వీరయ్య చౌదరి కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. 1978 బ్యాచ్ ఐఆర్ఎస్కు చెందిన ఈయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం చైర్మన్‌గా పనిచేశారు.. బ్లాక్‌మనీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందంలో సభ్యుడిగా కూడా చౌదరి పనిచేశారు. ఈయన టూజీ కేసు విచారణలోనూ కీలక అధికారిగా పనిచేశారు. సీబీడీటీ ఇన్వెస్టిగేషన్, ఆడిట్ అండ్ జుడీషియల్ విభాగాల్లో సభ్యుడిగా ఉన్నారు. కేవీ చౌదరి దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిన్నమనేని కోటేశ్వరరావు అల్లుడు.