న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం జరగడానికి ఆర్‌బీఐ ఆడిటింగ్ తీరు సరిగా లేకపోవడం కూడా కారణమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి తప్పుబట్టారు. స్కామ్ జరిగిన సమయంలో ఆర్‌బీఐ నుంచి సరైన ఆడిటింగ్ జరగలేదన్నారు. మరింత పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్‌బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు.
‘‘రిస్క్‌ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి. కానీ, స్కామ్‌లు జరుగుతున్న సమయంలో ఆర్‌బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్‌బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్‌ను ఎలా కొలుస్తారు. స్కామ్‌లు ఎందుకు బయటకు రావడం లేదు’’అని చౌదరి అన్నారు.
ఆర్‌బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు. నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్‌బీకే స్కామ్‌లు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అనుసరించాలని సూచించారు.
ఐసీఏఐకి వివరాలివ్వండి...
స్కామ్ వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ)కి కూడా ఇవ్వాలని పీఎన్‌బీ, దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ స్కామ్‌కు దారితీసిన వ్యవస్థాగత లోటుపాట్లను అధ్యయనం చేయడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోతగిన చర్యలను సూచించేందుకు ఐసీఏఐ.. పది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment