సీబీఐ చీఫ్ అలోక్ వర్మ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఎదుట హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో వర్మ విచారణకు హాజరైనట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. కేవీ చౌదరి నేతృత్వంలో విజిలెన్స్ కమిషనర్లు శరద్ కుమార్, టీఎం భాసిన్, ఇతరులతో కూడిన కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు.
వర్మపై ఆస్థానా చేసిన ఆరోపణలను రెండు వారాల్లోగా నిగ్గుతేల్చాలని సుప్రీం కోర్టు గత నెల 26న సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం వర్మ గురువారం సైతం విజిలెన్స్ ఉన్నతాధికారులు చౌదరి, కుమార్‌లను కలిసిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ వర్మపై ఆస్ధానా చేసిన ఆరోపణలకు సంబంధించి పలువురు సీబీఐ అధికారులను సీవీసీ ప్రశ్నించినట్టు సమాచారం.
సీబీఐలో ఇన్‌స్పెక్టర్ స్ధాయి నుంచి ఎస్పీ వరకూ పలువురు సిబ్బందిని విచారించి సీవీసీ సీనియర్ అధికారి సమక్షంలో వారి వాదనలను సీవీసీ రికార్డు చేసింది. మొయిన్ ఖురేషీ ముడుపుల కేసు, లాలూ ప్రసాద్ ప్రమేయం ఉన్న ఐఆర్‌సీటీసీ స్కామ్ సహా పలు కేసులను విచారించిన అధికారుల స్టేట్‌మెంట్లను సైతం సీవీసీ రికార్డు చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment