సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ సీనియర్ అధికారుల మధ్య వివాదంలో ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సీబీఐ ఉన్నతాధికారులు ఇరువురూ పిల్లుల మాదిరిగా కీచులాడుకున్నారని సుప్రీం బెంచ్ ఎదుట అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు.
వర్మ, ఆస్ధానాల మధ్య వివాదం తీవ్రస్ధాయికి చేరి బహిరంగ చర్చలా మారిందని ఆయన కోర్టుకు నివేదించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై తీసుకున్న చర్యలు బదిలీ వేటు కాదని, ఆయన విధులను ప్రభుత్వం ఉపసంహరింపచేసిందని కేంద్రం వివరణ ఇచ్చింది. సీబీఐ పట్ల ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టవలసివచ్చిందని వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వర్మను విజిలెన్స్ కమిషన్ ప్రశ్నించడంపై కొన్ని వార్తాపత్రికల క్లిప్పింగ్స్‌ను కూడా అటార్నీ జనరల్ కోర్టుకు సమర్పించారు. కాగా ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment