‘బొగ్గు బ్లాకుల’పై తీర్పు రిజర్వు
* కేటాయింపుల రద్దుకు సుముఖమేనన్న కేంద్రం
* 46 బ్లాకులను మాత్రం మినహాయించాలని సుప్రీం కోర్టుకు వినతి
* ప్రభుత్వ వాదనతో విభేదించిన కేటాయింపులు పొందిన కంపెనీలు
* అవకతవకలకు ప్రభుత్వానిదే బాధ్యతన్న కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి 2010 మధ్య జరిగిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపుల భవితవ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. కేటాయింపులన్నీ అక్రమమంటూ ఆగస్టు 25నే పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘‘ఈ వ్యవహారంలో ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితుల గురించి ఆలోచించాం. అవకతవకలు జరిగినప్పుడు వాటి ప్రభావం అందరిపై పడుతుంది. అందువల్ల బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దునే మేం కోరుకుంటున్నాం.
అయితే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభిస్తున్న 40 బొగ్గు బ్లాకులతోపాటు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు బ్లాకులను మినహాయించాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వైఖరితో బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందిన సంస్థలు తమ వాదనల సందర్భంగా విభేదించాయి. ఆగస్టు 25 నాటి సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటును ప్రభుత్వం కోరకపోవడాన్ని తూర్పారబట్టాయి. కేటాయింపుల్లో అవకతకలకు ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించాయి. ఒక్కో బొగ్గు బ్లాకు కేటాయింపుపై దర్యాప్తు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు కోర్టు తీర్పునకు సహజ పరిణామమన్న వైఖరిని కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవ ర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ప్రభుత్వ వైఖరి దేశంలో పెను విపత్తుకు దారితీస్తుందని...ఇప్పటికే విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ జనాభాను మరిన్ని కష్టాల్లోకి నెడుతుందని పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ వాదనను సీనియర్ అడ్వొకేట్లు కె.కె. వేణుగోపాల్, హరీశ్ సాల్వే తదితరులు తోసిపుచ్చారు. వాస్తవానికి కేటాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టునే ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
దర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం తన పరిస్థితినే తెలియజేస్తోందని పేర్కొంది. ప్రభుత్వం అన్ని అంశాలను అర్థం చేసుకుంటుందని...దేశంలో చీకట్ల గురించి ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తీర్పును రిజర్వులో ఉంచింది. అంతకుముందు ధర్మాసనం ఈ వాదనల సందర్భంగా స్పందిస్తూ తాము ప్రభుత్వ కేటాయింపుల నిర్ణయాన్ని పరిశీలించలేదని...నిర్ణయం తీసుకునే ప్రక్రియనే పరిశీలించామంది. ‘‘మీరు (ప్రభుత్వం)తప్పు చేశారా లేదా అనే విషయం గురిం చి మేం ఆలోచించడం లేదు. కానీ జరిగిన తప్పుడు ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ఫలానా వైఖరికే కట్టుబడాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని చెప్పింది.
వాహనవతికి కితాబు
బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారంలో గత వారం కన్నుమూసిన మాజీ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ‘‘ఆయన భౌతికంగా లేరు. కానీ ఈ కేసు విషయంలో ఎంతో శ్రమకోర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివిధ పత్రాలను పద్ధతి ప్రకారం సిద్ధం చేశారు. ఆయన్ను అభినందించాలి’’ అని కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
‘ప్రభుత్వానికి కనువిప్పు’
న్యూఢిల్లీ: 1993 నుంచి 2010 వరకూ జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు అక్రమమైనవిగా పేర్కొనడం తమకు కనువిప్పు కలిగించడమేనని కేంద్ర విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి గోయల్ అన్నారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలోనూ జవాబుదారీతనం మరింతగా ఉండాలని మంగళవారం ఢిల్లీ లో పేర్కొన్నారు. అధికారులు తమ బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.