కష్టాల్లో సీబీఐ మాజీ బాస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల స్కాం వ్యవహారం సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ తన నివేదికలో పేర్కొంది.
రంజిత్ సిన్హాను సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనను ఈ స్కాం నిందితులు కలిశారని దర్యాప్తు కమిటీ తేల్చింది. 2004-2009 మధ్యకాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతుండగా.. అప్పటి సీబీఐ బాస్ అయిన రంజిత్ సిన్హా అధికారిక నివాసానికి పలువురు నిందితులు వచ్చి కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆయన నివాసం సందర్శకుల రిజిస్టర్‌లో నిందితుల పేర్లు నమోదయ్యాయని వెలుగుచూడటంతో ఈ వివాదంపై దర్యాప్తునకు 2015లో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నియమించింది.
సందర్శకుల రిజిస్టర్ నిజమైనదేనని, అందులో ఎలాంటి తప్పులు లేవని విచారణ కమిటీ తేల్చింది. ఈ రిజిస్టర్ ప్రకారం బొగ్గు స్కాం నిందితులు రంజిత్ సిన్హాను కలిసినట్టు తెలుస్తోందని పేర్కొంది. అయితే, ఈ కమిటీ నివేదికపై మంగళవారం సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కమిటీ నివేదిక ఆధారంగా రంజిత్ సిన్హాపై చర్యలు తీసుకోలేమని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేసినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అయితే, పిటిషనర్ మాత్రం కమిటీ నివేదికలోని వివరాలు సమగ్రంగా ఉన్నాయని, వీటి ఆధారంగా రంజిత్ సిన్హాను కేసును ముందుకు తీసుకెళ్లవచ్చునని కోర్టుకు నివేదించారు.