బొగ్గు కేసులో మన్మోహన్‌కు ఊరట
- సబీఐ కోర్టు సమన్లపై సుప్రీంకోర్టు స్టే
- నేరపూరిత కుట్ర ఎక్కడ ఉందని ప్రశ్నించిన సిబల్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న కోర్టుకు హాజరవ్వాలంటూ మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను కూడా నిలిపివేస్తూ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అలాగే, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డీ)(3) చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలంటూ కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ప్రధానిగా ఉన్న సమయంలో ఒడిశాలోని తలబిర 2 బొగ్గు గనులను హిందాల్కో కంపెనీకి అక్రమంగా కేటాయించిన కేసులో మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ ఈ మాజీ ప్రధానిని కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన స్టే ఆ కేసులో ఇతర నిందితులు హిందాల్కో యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖ్, హిందాల్కో సంస్థ, ఆ కంపెనీ ఉన్నతాధికారులు భట్టాచార్య, శుభేందు అమితాబ్‌లకు కూడా వర్తిస్తుంది. మాజీ ప్రధాని తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల సమయంలో మన్మో హన్‌సింగ్ కుమార్తెలు ఉపీందర్ సింగ్, దామన్ సింగ్ కోర్టుహాల్లోనే ఉన్నారు. హిందాల్కోకు బొగ్గు గనిని కేటాయించడం పరిపాలనాపరంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)కి అన్వయించడాన్ని తప్పుబడుతూ.. మన్మోహన్‌సింగ్‌కు జారీ చేసిన సమన్ల న్యాయబద్ధతను తన వాదన సందర్భంగా సిబల్ ప్రశ్నించారు. సిబల్ వాదనలోని ముఖ్యాంశాలు..
- స్కీనింగ్ కమిటీ విధివిధానాలు చట్టబద్ధంగా లేవంటూ.. గతంలో జరిగిన అన్ని బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అదే స్క్రీనింగ్ కమిటీ విధివిధానాలను పాటించలేదంటూ నా క్లయింట్ మన్మో హన్‌కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇది హేతుబద్ధంగా లేదు.
- సీఆర్‌పీసీ ప్రకారం నేర నిర్ధారణకు అవసరమైన వాటిలో.. నిందితులంతా కలసి నేరం చేయడానికి కుట్ర పన్ని ఉండాలి. ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదు. తలబిర గనులను ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందా? ఒక బొగ్గుగనిని ప్రైవేటు కంపెనీకి కేటాయించడం నేరమవుతుందా?
- సమాఖ్య స్ఫూర్తితో ఒడిశా ప్రభుత్వ వినతిని గౌరవిస్తూ ప్రధాని మన్మోహన్ బొగ్గుశాఖ మంత్రి హోదాలో ఆ నిర్ణయం తీసుకున్నారు.
- చట్టపరంగా, సాక్ష్యాలను అర్థం చేసుకునే పరంగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు సమన్లు జారీ చేయడం ట్రయల్ కోర్టు చేసిన దారుణమైన తప్పు.
- నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 197 కింద పబ్లిక్ సర్వెంట్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ముందస్తు అనుమతి అవసరమన్న విషయాన్ని ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు.
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విచారించాలంటూ 2014, డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు సీబీఐని ఆదేశించడం కూ డా తప్పు. ఒక న్యాయమూర్తి అలా ఆదేశించకూడదు. సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించవచ్చు కానీ దర్యా ప్తు తీరును జడ్జి నిర్ణయించకూడదు.