coal blocks allocation
-
కష్టాల్లో సీబీఐ మాజీ బాస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల స్కాం వ్యవహారం సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ తన నివేదికలో పేర్కొంది. రంజిత్ సిన్హాను సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనను ఈ స్కాం నిందితులు కలిశారని దర్యాప్తు కమిటీ తేల్చింది. 2004-2009 మధ్యకాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతుండగా.. అప్పటి సీబీఐ బాస్ అయిన రంజిత్ సిన్హా అధికారిక నివాసానికి పలువురు నిందితులు వచ్చి కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆయన నివాసం సందర్శకుల రిజిస్టర్లో నిందితుల పేర్లు నమోదయ్యాయని వెలుగుచూడటంతో ఈ వివాదంపై దర్యాప్తునకు 2015లో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నియమించింది. సందర్శకుల రిజిస్టర్ నిజమైనదేనని, అందులో ఎలాంటి తప్పులు లేవని విచారణ కమిటీ తేల్చింది. ఈ రిజిస్టర్ ప్రకారం బొగ్గు స్కాం నిందితులు రంజిత్ సిన్హాను కలిసినట్టు తెలుస్తోందని పేర్కొంది. అయితే, ఈ కమిటీ నివేదికపై మంగళవారం సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కమిటీ నివేదిక ఆధారంగా రంజిత్ సిన్హాపై చర్యలు తీసుకోలేమని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేసినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అయితే, పిటిషనర్ మాత్రం కమిటీ నివేదికలోని వివరాలు సమగ్రంగా ఉన్నాయని, వీటి ఆధారంగా రంజిత్ సిన్హాను కేసును ముందుకు తీసుకెళ్లవచ్చునని కోర్టుకు నివేదించారు. -
‘బొగ్గు గనుల కేటాయింపులో నిర్ణయం మన్మోహన్‌దే’
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుపై నిర్ణయాలను ఆ శాఖ మంత్రి హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా బుధవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా గుప్తా కేవలం సిఫారసులే చేశారని గుప్తా న్యాయవాది కోర్టుకు నివేదించారు. జార్ఖండ్‌లోని రాజ్హరా నార్త్‌బ్లాక్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ బుధవారం చార్జిషీటు దాఖలు చేసిన సందర్భంలో కోర్టులో వాదనలు జరిగాయి. -
‘బొగ్గు బ్లాకుల’పై తీర్పు రిజర్వు
-
‘బొగ్గు బ్లాకుల’పై తీర్పు రిజర్వు
* కేటాయింపుల రద్దుకు సుముఖమేనన్న కేంద్రం * 46 బ్లాకులను మాత్రం మినహాయించాలని సుప్రీం కోర్టుకు వినతి * ప్రభుత్వ వాదనతో విభేదించిన కేటాయింపులు పొందిన కంపెనీలు * అవకతవకలకు ప్రభుత్వానిదే బాధ్యతన్న కంపెనీలు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి 2010 మధ్య జరిగిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపుల భవితవ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. కేటాయింపులన్నీ అక్రమమంటూ ఆగస్టు 25నే పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘‘ఈ వ్యవహారంలో ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితుల గురించి ఆలోచించాం. అవకతవకలు జరిగినప్పుడు వాటి ప్రభావం అందరిపై పడుతుంది. అందువల్ల బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దునే మేం కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభిస్తున్న 40 బొగ్గు బ్లాకులతోపాటు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు బ్లాకులను మినహాయించాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వైఖరితో బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందిన సంస్థలు తమ వాదనల సందర్భంగా విభేదించాయి. ఆగస్టు 25 నాటి సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటును ప్రభుత్వం కోరకపోవడాన్ని తూర్పారబట్టాయి. కేటాయింపుల్లో అవకతకలకు ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించాయి. ఒక్కో బొగ్గు బ్లాకు కేటాయింపుపై దర్యాప్తు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు కోర్టు తీర్పునకు సహజ పరిణామమన్న వైఖరిని కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవ ర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ప్రభుత్వ వైఖరి దేశంలో పెను విపత్తుకు దారితీస్తుందని...ఇప్పటికే విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ జనాభాను మరిన్ని కష్టాల్లోకి నెడుతుందని పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ వాదనను సీనియర్ అడ్వొకేట్లు కె.కె. వేణుగోపాల్, హరీశ్ సాల్వే తదితరులు తోసిపుచ్చారు. వాస్తవానికి కేటాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టునే ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. దర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం తన పరిస్థితినే తెలియజేస్తోందని పేర్కొంది. ప్రభుత్వం అన్ని అంశాలను అర్థం చేసుకుంటుందని...దేశంలో చీకట్ల గురించి ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తీర్పును రిజర్వులో ఉంచింది. అంతకుముందు ధర్మాసనం ఈ వాదనల సందర్భంగా స్పందిస్తూ తాము ప్రభుత్వ కేటాయింపుల నిర్ణయాన్ని పరిశీలించలేదని...నిర్ణయం తీసుకునే ప్రక్రియనే పరిశీలించామంది. ‘‘మీరు (ప్రభుత్వం)తప్పు చేశారా లేదా అనే విషయం గురిం చి మేం ఆలోచించడం లేదు. కానీ జరిగిన తప్పుడు ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ఫలానా వైఖరికే కట్టుబడాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని చెప్పింది. వాహనవతికి కితాబు బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారంలో గత వారం కన్నుమూసిన మాజీ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ‘‘ఆయన భౌతికంగా లేరు. కానీ ఈ కేసు విషయంలో ఎంతో శ్రమకోర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివిధ పత్రాలను పద్ధతి ప్రకారం సిద్ధం చేశారు. ఆయన్ను అభినందించాలి’’ అని కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ‘ప్రభుత్వానికి కనువిప్పు’ న్యూఢిల్లీ: 1993 నుంచి 2010 వరకూ జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు అక్రమమైనవిగా పేర్కొనడం తమకు కనువిప్పు కలిగించడమేనని కేంద్ర విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి గోయల్ అన్నారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలోనూ జవాబుదారీతనం మరింతగా ఉండాలని మంగళవారం ఢిల్లీ లో పేర్కొన్నారు. అధికారులు తమ బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. -
బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం దాచిపెట్టటానికి ఏమీలేదని, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి సీబీఐ కోరిన అధికారిక పత్రాలు అదృశ్యమయ్యాయనే నిర్ధారణకు రావటం పొరపాటని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఈమేరకు పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో కీలకమైన ఫైళ్లు అదృశ్యమవటంపై ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా పార్లమెంటును స్తంభింపచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ముందుగా సిద్ధంచేసుకున్న ప్రకటనను తొలుత రాజ్యసభ, అనంతరం లోక్‌సభలో మన్మోహన్ చదివి వినిపించారు. కనిపించకుండాపోయిన పత్రాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. అవి దొరకని పక్షంలో సీబీఐతో సహా సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. మన్మోహన్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభల్లోనూ నిరసనకు దిగటంతో పార్లమెంటు మళ్లీ స్తంభించింది. 2006-09 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 204 బొగ్గు క్షేత్రాలను కేటాయించారు. వీటిలో 40 లెసైన్సులను ఆ తర్వాత రద్దుచేశారు. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి మొత్తం 189 పత్రాలు కనిపించటం లేదని ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్జైస్వాల్ ఆగస్టు 23న పార్లమెంటుకు తెలిపారు. ఫైళ్ల అదృశ్యంపై విపక్షాల ఆందోళన నేపధ్యంలో ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘‘బొగ్గు క్షేత్రాల కేటాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. సభ్యులు తొందరపాటు నిర్ధారణలకు రాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు, సీబీఐకి ప్రభుత్వం సహకారం అందించిందని చెప్పారు. సీబీఐకి ఇప్పటికే 1,50,000కు పైగా పేజీలను అందించామని.. ఇది సీబీఐ దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంచేస్తోందని చెప్పారు. కొందరు సభ్యులు వాస్తవ పరిస్థితిని విస్మరించి ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉందని నిర్ధారించారన్నారు. ఏవైనా ఫైళ్లు నిజంగా అదృశ్యమైన పక్షంలో దానిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని, దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం: జైట్లీ కానీ.. మన్మోహన్ ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. రెండు సభల్లోనూ ప్రధాని ప్రకటన చేసి వెంటనే నిష్ర్కమించారు. దీంతో తమ సందేహాలను నివృత్తి చేయలేదంటూ ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగటంతో గందరగోళం తలెత్తింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా, బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతంతో కేటాయింపులు జరిపిందని.. ఈ నేరానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫైళ్ల అదృశ్యంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేయలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది అనుమానాలను మరింతగా పెంచుతోందన్నారు. ఫైళ్లు అదృశ్యమైనప్పుడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్నదెవరని సమాజ్‌వాది పార్టీ నేత నరేష్‌అగర్వాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధానమంత్రి సమాధానం చెప్పలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విపక్షాల ‘షేమ్ షేమ్’ నినాదాల మధ్య ధ్వజమెత్తారు. ప్రధాని సభ నుంచి నిష్ర్కమించారని, తానేమీ చేయలేనని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నుంచే సమాధానాలు కావాలని విపక్షాలు పట్టుపట్టి ఆందోళనకు దిగాయి. దీంతో కురియన్ సభను వాయిదా వేశారు. అందుబాటులో లేని పత్రాలు ఏమయ్యాయి? లోక్‌సభలో ప్రధాని ప్రకటన చేసిన తర్వాత తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీలు కోరగా.. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించటంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఆ తర్వాత బుధవారానికి వాయిదా వేశారు. బాహాటంగా దాచేస్తున్నారు: సీపీఎం ప్రధాని ప్రకటనలో కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవని సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. సభలో ప్రకటన చేసిన వెంటనే ప్రధాని ఎన్నడూ లేని రీతిలో వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోవటం తాము చూశామన్నారు. కాగా, ప్రధాని పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ ఫైళ్ల బాధ్యత నేరుగా ప్రధాని బాధ్యత కాదని పేర్కొంది. -
‘బొగ్గు’పై జోక్యం చేసుకోనున్న ప్రధాని
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో ప్రభుత్వానికి దాచాల్సిందేమీ లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ గురువారం లోక్‌సభలో అన్నారు. ఈ అంశంపై బొగ్గుశాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ ప్రకటన చేస్తారని, ఆయన ప్రకటనపై చర్చ జరిగినప్పుడు ప్రధాని జోక్యం చేసుకుంటారని చెప్పారు. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా ఈ అంశంలో ప్రధాని జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు ‘బొగ్గు’ ఫైళ్ల గల్లంతుపై పార్లమెంటు ఉభయ సభలనూ విపక్షాలు హోరెత్తించాయి. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. గల్లంతైన ఫైళ్లు ప్రధాని బొగ్గు శాఖ బాధ్యతలను పర్యవేక్షించిన 2006-09 కాలానికి చెందినవేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.