బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం దాచిపెట్టటానికి ఏమీలేదని, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి సీబీఐ కోరిన అధికారిక పత్రాలు అదృశ్యమయ్యాయనే నిర్ధారణకు రావటం పొరపాటని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఈమేరకు పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో కీలకమైన ఫైళ్లు అదృశ్యమవటంపై ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా పార్లమెంటును స్తంభింపచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ముందుగా సిద్ధంచేసుకున్న ప్రకటనను తొలుత రాజ్యసభ, అనంతరం లోక్‌సభలో మన్మోహన్ చదివి వినిపించారు. కనిపించకుండాపోయిన పత్రాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. అవి దొరకని పక్షంలో సీబీఐతో సహా సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. మన్మోహన్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభల్లోనూ నిరసనకు దిగటంతో పార్లమెంటు మళ్లీ స్తంభించింది. 2006-09 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 204 బొగ్గు క్షేత్రాలను కేటాయించారు.
వీటిలో 40 లెసైన్సులను ఆ తర్వాత రద్దుచేశారు. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి మొత్తం 189 పత్రాలు కనిపించటం లేదని ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్‌జైస్వాల్ ఆగస్టు 23న పార్లమెంటుకు తెలిపారు. ఫైళ్ల అదృశ్యంపై విపక్షాల ఆందోళన నేపధ్యంలో ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘‘బొగ్గు క్షేత్రాల కేటాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. సభ్యులు తొందరపాటు నిర్ధారణలకు రాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు, సీబీఐకి ప్రభుత్వం సహకారం అందించిందని చెప్పారు. సీబీఐకి ఇప్పటికే 1,50,000కు పైగా పేజీలను అందించామని.. ఇది సీబీఐ దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంచేస్తోందని చెప్పారు. కొందరు సభ్యులు వాస్తవ పరిస్థితిని విస్మరించి ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉందని నిర్ధారించారన్నారు. ఏవైనా ఫైళ్లు నిజంగా అదృశ్యమైన పక్షంలో దానిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని, దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం: జైట్లీ
కానీ.. మన్మోహన్ ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. రెండు సభల్లోనూ ప్రధాని ప్రకటన చేసి వెంటనే నిష్ర్కమించారు. దీంతో తమ సందేహాలను నివృత్తి చేయలేదంటూ ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగటంతో గందరగోళం తలెత్తింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా, బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతంతో కేటాయింపులు జరిపిందని.. ఈ నేరానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫైళ్ల అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదుచేయలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది అనుమానాలను మరింతగా పెంచుతోందన్నారు. ఫైళ్లు అదృశ్యమైనప్పుడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్నదెవరని సమాజ్‌వాది పార్టీ నేత నరేష్‌అగర్వాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధానమంత్రి సమాధానం చెప్పలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విపక్షాల ‘షేమ్ షేమ్’ నినాదాల మధ్య ధ్వజమెత్తారు. ప్రధాని సభ నుంచి నిష్ర్కమించారని, తానేమీ చేయలేనని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నుంచే సమాధానాలు కావాలని విపక్షాలు పట్టుపట్టి ఆందోళనకు దిగాయి. దీంతో కురియన్ సభను వాయిదా వేశారు.
అందుబాటులో లేని పత్రాలు ఏమయ్యాయి?
లోక్‌సభలో ప్రధాని ప్రకటన చేసిన తర్వాత తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీలు కోరగా.. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించటంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఆ తర్వాత బుధవారానికి వాయిదా వేశారు.
బాహాటంగా దాచేస్తున్నారు: సీపీఎం
ప్రధాని ప్రకటనలో కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవని సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. సభలో ప్రకటన చేసిన వెంటనే ప్రధాని ఎన్నడూ లేని రీతిలో వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోవటం తాము చూశామన్నారు. కాగా, ప్రధాని పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ ఫైళ్ల బాధ్యత నేరుగా ప్రధాని బాధ్యత కాదని పేర్కొంది.