న్యూఢిల్లీ: కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) గత ఏడాది కోల్‌గేట్ సహా మొత్తం రూ.7 వేల కోట్లకు పైగా విలువైన కుంభకోణాలను బట్టబయలు చేసింది. బీహార్‌కు చెందిన ఓ టెలివిజన్ గ్రూపు రూ.2,700 కోట్ల మేరకు ఆర్థిక అవకతవకలకు పాల్పడటాన్ని నిఘా సంస్థ గుర్తించింది. ముంబై స్టేట్ ట్రేడింగ్ కార్పొరే షన్ నిర్వహణలోని రూ.725 కోట్ల బీమా పథకం దుర్వినియోగం కావడాన్ని కూడా బహిర్గత పరచింది. ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన 2012 వార్షిక నివేదికలో సీవీసీ ఈ విషయాలను పేర్కొంది. ఇక బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. 2006-09 మధ్య కాలంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ కొందరు ఎంపీల నుంచి 2012 మార్చి 14న ఫిర్యాదు అందింది.
ప్రభుత్వ ఖజానాకు రూ.43,96,943 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా విజిలెన్స్ కమిషన్ సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలోనే 1993-2004 మధ్యకాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి 2012 సెప్టెంబర్ 5న మరికొందరు ఇతర ఎంపీల నుంచి మరో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కూడా సీబీఐకి నివేదించడం జరిగింది. ఇప్పటివరకు మూడు ప్రాథమిక విచారణలు, 13 ఎఫ్‌ఐఆర్‌లు సీబీఐ నమోదు చేసింది. మూడు టెలికం కంపెనీలు లెసైన్సులు దుర్వినియోగం చేయడాన్ని, కొన్ని బ్యాంకులకు సంబంధించిన మూడు వేర్వేరు కేసుల్లో రూ.3,568 కోట్ల మోసాన్ని కూడా 2012లో సీవీసీ బట్టబయలు చేసింది.
రూ.7వేల కోట్ల కుంభకోణాల గుట్టు రట్టు
Published Thu, Sep 5 2013 6:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement