Coalgate
-
నెస్లేను తరిమేస్తా, కోల్గేట్కు గేట్ పెడతా
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు ఆహార పదార్థాల వ్యాపార రంగంలోనూ తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. పతంజలి గ్రూప్ ప్రొడక్ట్స్‌తో ఇప్పటికే కోల్గేట్, నెస్లే వంటి బహుళ జాతి సంస్థలకు ఎసరు పెట్టిన ఆయన తాజాగా మరో శపథం చేశారు. దేశం నుంచి 'నెస్లే' పక్షిని తరిమేస్తానని, 'కోల్గేట్'కు దేశంలోకి రాకుండా గేటు పెట్టేస్తానని, వాటిని భారత్‌లో లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల టర్నవర్ సాధించడమే పతంజలి కంపెనీ లక్ష్యమని ఆయన మంగళవారం ప్రకటించారు. పతంజలి సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాందేవ్ 2012 మార్చి నుంచి పతంజలి కంపెనీ ద్వారా పలు ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ప్రొడక్ట్స్‌ను దేశంలో మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టూత్ పేస్ట్, న్యూడిల్స్, నెయ్యి వంటి పలు రకాల ఉత్పత్తులతో పతంజలి కంపెనీ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఈ కంపెనీ 2011-12లో రూ. 446 కోట్లు, 2012-13లో రూ. 850 కోట్లు, 2013-14లో రూ. 1200 కోట్లు, 2014-15లో రూ. 2006 కోట్ల టర్నోవర్ సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 శాతం వృద్ధితో రూ. ఐదువేల కోట్ల టర్నోవర్‌ను పతంజలి గ్రూప్ సాధించనుంది. -
ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు లెసైన్సులను మూకుమ్మడిగా రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంవల్ల విద్యుత్ సంక్షోభానికి దారితీయొచ్చని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. బొగ్గు స్కామ్ కేసులో 1993 నుంచి గత ప్రభుత్వాల హయాంలో కేటాయించిన మొత్తం 218 బొగ్గు బ్లాకులకుగాను 4 మినహా మిగతా 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీం బుధవారం తీర్పునివ్వడం తెలిసిందే. తీర్పువల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులకు విఘాతం కలగడంతోపాటు ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా సన్నగిల్లుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ పేర్కొన్నారు. బొగ్గు కొరత తీవ్రతరం... రద్దయిన బొగ్గు బ్లాకుల్లో 42 వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవే. దేశంలో సరఫరా అవుతున్న మొత్తం బొగ్గులో 10 శాతం(53 మిలియన్ టన్నులు) వీటిద్వారానే లభిస్తోంది. ఇప్పుడు సుప్రీం తీర్పు కారణంగా ఈ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయి.. సరఫరాలకు బ్రేక్ పడుతుందని శ్రీరామ్ చెప్పారు. దిగుమతులు భారీగా పెరిగిపోయి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకేందుకు దారితీస్తుందన్నారు. కోర్టు ఆదేశాలతో అనిశ్చితి నెలకొందని.. కీలకమైన విద్యుత్, స్టీల్, మైనింగ్ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ పాలసీల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో మూడింట రెండోవంతు బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు సరఫరా చాలకపోవడంతో 80 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇంధన కొరత మరింత తీవ్రతరమవుతుంది. ప్రభుత్వం మళ్లీ వేగంగా గనులను కేటాయించడం ద్వారా విద్యుదుత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి’ అని శ్రీరామ్ పేర్కొన్నారు. కాస్త కఠిన తీర్పు ఇది: అసోచామ్ ఈ తీర్పు కాస్త కఠినమైనదేనని, దీనివల్ల దేశంలోకి బొగ్గు దిగుమతులు పెరుగుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రద్దయిన బ్లాకులతో భారీస్థాయి పెట్టుబడులు ముడిపడిఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ, ఇన్వెస్ట్మెంట్ వాతావరణం దెబ్బతింటుందని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగానికి బొగ్గు మైనింగ్‌లో ప్రవేశం కల్పించేవిధంగా ఈ రంగానికి సంబంధించిన చట్టాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలన్నారు. కాగా, బ్లాకుల రద్దు కారణంగా దేశ బొగ్గు దిగుమతుల బిల్లు దాదాపు రూ.18,000 కోట్ల మేర ఎగబాకవచ్చని మెక్వారీ తాజా నివేదిక పేర్కొంది. గతేడాది(2013-14) భారత్ 168.4 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. దీని విలువ రూ.95,000 కోట్లు. బ్యాంకులకు రూ. లక్ష కోట్ల గండం.. సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు... బ్యాంకులను కూడా వణికిస్తోంది. రద్దయిన బ్లాకులపై ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లకు దేశీ బ్యాంకులు రూ. లక్ష కోట్లకు పైగా రుణాలివ్వడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్లు గనుక సమస్యల్లో చిక్కుకుంటే బ్యాంకులిచ్చిన రుణాల వసూళ్లలోనూ తిప్పలుతప్పవు. ప్రధానంగా దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అత్యధికంగా రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి. కాగా, తామిచ్చిన రుణాల విలువను లెక్కగట్టే పనిలో ఉన్నట్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలు పేర్కొన్నాయి. ‘సుప్రీం తీర్పును మేం గౌరవిస్తున్నాం. రద్దయిన బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు ప్రభుత్వం పారదర్శకతతోకూడిన తక్షణ ప్రణాళికలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. తద్వారా బొగ్గు సరఫరాలకు ఆటంకాలు తప్పుతాయి’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ బ్లాకులతో సంబంధం ఉన్న విద్యుత్ ప్లాంట్లకు తామిచ్చిన రుణాలు రూ.4,000 కోట్ల వరకూ మాత్రమే ఉండొచ్చని గతంలో ఆమె చెప్పారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ రూ.2,000 కోట్ల రుణాలిచ్చినట్లు అంచనా. -
వినోద్ ఆరోపణలపై స్పందించిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారు. ప్రధానిగా నా భాధ్యతల్ని సక్రమంగానే నిర్వహించాను అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. 2జీ స్పెక్ట్రమ్, కోల్ గేట్ కుంభకోణాల అంశాలపై ప్రధానిపై మాజీ కాగ్ చైర్మన్ వినోద్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వినోద్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని మన్మోహన్ తెలిపారు. మన్మోహన్ సింగ్ కూతురు దామన్ సింగ్ రచించిన 'స్ట్రిక్ట్ లీ పరసనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ!
హిండాల్కో కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది. 2005 లో ఆదిత్య బిర్లా కంపెనీని తిరస్కరించిన తర్వాత బొగ్గు శాఖ కు నవీన్ పట్నాయక్ లేఖ రాసిన అంశపై సీబీఐ విచారించే అవకాశం ఉంది. ఒడిశాలోని తలబిరా రెండవ బ్లాక్ కోసం దరఖాస్తు చేసుకున్న హిండాల్కో కంపెనీ తిరస్కారానికి గురైన తర్వాత పున: పరిశీలించాలని పట్నాయక్ లేఖ రాశారని సీబీఐ అధికారి తెలిపారు. పట్నాయక్ రాసిన లేఖలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిని విచారించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం జరుగలేదని తెలిసింది. -
రూ.7వేల కోట్ల కుంభకోణాల గుట్టు రట్టు
న్యూఢిల్లీ: కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) గత ఏడాది కోల్గేట్ సహా మొత్తం రూ.7 వేల కోట్లకు పైగా విలువైన కుంభకోణాలను బట్టబయలు చేసింది. బీహార్‌కు చెందిన ఓ టెలివిజన్ గ్రూపు రూ.2,700 కోట్ల మేరకు ఆర్థిక అవకతవకలకు పాల్పడటాన్ని నిఘా సంస్థ గుర్తించింది. ముంబై స్టేట్ ట్రేడింగ్ కార్పొరే షన్ నిర్వహణలోని రూ.725 కోట్ల బీమా పథకం దుర్వినియోగం కావడాన్ని కూడా బహిర్గత పరచింది. ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన 2012 వార్షిక నివేదికలో సీవీసీ ఈ విషయాలను పేర్కొంది. ఇక బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. 2006-09 మధ్య కాలంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ కొందరు ఎంపీల నుంచి 2012 మార్చి 14న ఫిర్యాదు అందింది. ప్రభుత్వ ఖజానాకు రూ.43,96,943 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా విజిలెన్స్ కమిషన్ సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలోనే 1993-2004 మధ్యకాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి 2012 సెప్టెంబర్ 5న మరికొందరు ఇతర ఎంపీల నుంచి మరో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కూడా సీబీఐకి నివేదించడం జరిగింది. ఇప్పటివరకు మూడు ప్రాథమిక విచారణలు, 13 ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేసింది. మూడు టెలికం కంపెనీలు లెసైన్సులు దుర్వినియోగం చేయడాన్ని, కొన్ని బ్యాంకులకు సంబంధించిన మూడు వేర్వేరు కేసుల్లో రూ.3,568 కోట్ల మోసాన్ని కూడా 2012లో సీవీసీ బట్టబయలు చేసింది. -
బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం దాచిపెట్టటానికి ఏమీలేదని, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి సీబీఐ కోరిన అధికారిక పత్రాలు అదృశ్యమయ్యాయనే నిర్ధారణకు రావటం పొరపాటని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఈమేరకు పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో కీలకమైన ఫైళ్లు అదృశ్యమవటంపై ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా పార్లమెంటును స్తంభింపచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ముందుగా సిద్ధంచేసుకున్న ప్రకటనను తొలుత రాజ్యసభ, అనంతరం లోక్‌సభలో మన్మోహన్ చదివి వినిపించారు. కనిపించకుండాపోయిన పత్రాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. అవి దొరకని పక్షంలో సీబీఐతో సహా సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. మన్మోహన్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభల్లోనూ నిరసనకు దిగటంతో పార్లమెంటు మళ్లీ స్తంభించింది. 2006-09 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 204 బొగ్గు క్షేత్రాలను కేటాయించారు. వీటిలో 40 లెసైన్సులను ఆ తర్వాత రద్దుచేశారు. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి మొత్తం 189 పత్రాలు కనిపించటం లేదని ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్జైస్వాల్ ఆగస్టు 23న పార్లమెంటుకు తెలిపారు. ఫైళ్ల అదృశ్యంపై విపక్షాల ఆందోళన నేపధ్యంలో ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘‘బొగ్గు క్షేత్రాల కేటాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. సభ్యులు తొందరపాటు నిర్ధారణలకు రాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు, సీబీఐకి ప్రభుత్వం సహకారం అందించిందని చెప్పారు. సీబీఐకి ఇప్పటికే 1,50,000కు పైగా పేజీలను అందించామని.. ఇది సీబీఐ దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంచేస్తోందని చెప్పారు. కొందరు సభ్యులు వాస్తవ పరిస్థితిని విస్మరించి ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉందని నిర్ధారించారన్నారు. ఏవైనా ఫైళ్లు నిజంగా అదృశ్యమైన పక్షంలో దానిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని, దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం: జైట్లీ కానీ.. మన్మోహన్ ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. రెండు సభల్లోనూ ప్రధాని ప్రకటన చేసి వెంటనే నిష్ర్కమించారు. దీంతో తమ సందేహాలను నివృత్తి చేయలేదంటూ ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగటంతో గందరగోళం తలెత్తింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా, బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతంతో కేటాయింపులు జరిపిందని.. ఈ నేరానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫైళ్ల అదృశ్యంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేయలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది అనుమానాలను మరింతగా పెంచుతోందన్నారు. ఫైళ్లు అదృశ్యమైనప్పుడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్నదెవరని సమాజ్‌వాది పార్టీ నేత నరేష్‌అగర్వాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధానమంత్రి సమాధానం చెప్పలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విపక్షాల ‘షేమ్ షేమ్’ నినాదాల మధ్య ధ్వజమెత్తారు. ప్రధాని సభ నుంచి నిష్ర్కమించారని, తానేమీ చేయలేనని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నుంచే సమాధానాలు కావాలని విపక్షాలు పట్టుపట్టి ఆందోళనకు దిగాయి. దీంతో కురియన్ సభను వాయిదా వేశారు. అందుబాటులో లేని పత్రాలు ఏమయ్యాయి? లోక్‌సభలో ప్రధాని ప్రకటన చేసిన తర్వాత తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీలు కోరగా.. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించటంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఆ తర్వాత బుధవారానికి వాయిదా వేశారు. బాహాటంగా దాచేస్తున్నారు: సీపీఎం ప్రధాని ప్రకటనలో కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవని సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. సభలో ప్రకటన చేసిన వెంటనే ప్రధాని ఎన్నడూ లేని రీతిలో వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోవటం తాము చూశామన్నారు. కాగా, ప్రధాని పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ ఫైళ్ల బాధ్యత నేరుగా ప్రధాని బాధ్యత కాదని పేర్కొంది. -
తెలంగాణ, కోల్ గేట్ అంశాలపై రగడ, లోకసభ వాయిదా!
తెలంగాణ, ఉల్లి ధర పెరుగుదల, కోల్ గేట్ అంశాలు లోకసభలో గందరగోళం సృష్టించాయి. సభ ఆరంభం కాగానే తెలంగాణ, ధరల పెరుగుదల, కోల్ గేట్ అంశాలు కార్యక్రమాలకు అడ్డు పడటంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. ఐనా సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య మంగళవారం ఉదయం ప్రభుత్వం మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆహార భద్రత బిల్లుకు సంబంధించిన ముఖ్య పత్రాలను సమర్పించిన తర్వాత, బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆహార బిల్లుపై చర్చించేందుకు ప్రశ్నోత్తర సమయాన్ని కూడా రద్దు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ న్యాయం చేయాలంటూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో గందరగోళం సృష్టించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు, ఉల్లి ధర ఆకాశనంటిన నేపథ్యంలో వామ పక్ష పార్టీల సభ్యులు పోడియంలోకి దూసుకుపోయి నినాదాలతో హోరెత్తించారు. తమిళనాడుకు చెందిన సీపీఐ సభ్యుడు శ్రీలంకలో జరుగుతున్న కామన్ వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనకూడదని ప్లకార్డుతో నిరసన తెలిపారు. సభలో నినాదాలు, నిరసనల మధ్య ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటి ఫర్ ఉమెన్ బిల్లును మానవ వనరుల శాఖ మంత్రి పల్లం రాజు, పౌర విమానశాఖ సహాయ మంత్రి కేసీ వేణుగో్పాల్ రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ బిల్లు 2013, సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (2013) బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే సివిల్ ఏవియేషన్ అథారిటి ఆఫ్ ఇండియా బిల్లును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగథ రాయ్ వ్యతిరేకించారు. బిల్లులపై చర్చ చేపట్టాలని చేసిన ప్రయత్నాలకు సభ్యులు అడ్డుతగలడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. ఆతర్వాత సభ ఆరంభమైన తర్వాత కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక ఫైల్లు మాయం కావడంపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో సభ సరిగా జరగడానికి అనువుగా లేకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.