ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు లెసైన్సులను మూకుమ్మడిగా రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంవల్ల విద్యుత్ సంక్షోభానికి దారితీయొచ్చని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది.
బొగ్గు స్కామ్ కేసులో 1993 నుంచి గత ప్రభుత్వాల హయాంలో కేటాయించిన మొత్తం 218 బొగ్గు బ్లాకులకుగాను 4 మినహా మిగతా 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీం బుధవారం తీర్పునివ్వడం తెలిసిందే. తీర్పువల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులకు విఘాతం కలగడంతోపాటు ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా సన్నగిల్లుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ పేర్కొన్నారు.
బొగ్గు కొరత తీవ్రతరం...
రద్దయిన బొగ్గు బ్లాకుల్లో 42 వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవే. దేశంలో సరఫరా అవుతున్న మొత్తం బొగ్గులో 10 శాతం(53 మిలియన్ టన్నులు) వీటిద్వారానే లభిస్తోంది. ఇప్పుడు సుప్రీం తీర్పు కారణంగా ఈ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయి.. సరఫరాలకు బ్రేక్ పడుతుందని శ్రీరామ్ చెప్పారు. దిగుమతులు భారీగా పెరిగిపోయి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకేందుకు దారితీస్తుందన్నారు.
కోర్టు ఆదేశాలతో అనిశ్చితి నెలకొందని.. కీలకమైన విద్యుత్, స్టీల్, మైనింగ్ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ పాలసీల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో మూడింట రెండోవంతు బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు సరఫరా చాలకపోవడంతో 80 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇంధన కొరత మరింత తీవ్రతరమవుతుంది. ప్రభుత్వం మళ్లీ వేగంగా గనులను కేటాయించడం ద్వారా విద్యుదుత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి’ అని శ్రీరామ్ పేర్కొన్నారు.
కాస్త కఠిన తీర్పు ఇది: అసోచామ్
ఈ తీర్పు కాస్త కఠినమైనదేనని, దీనివల్ల దేశంలోకి బొగ్గు దిగుమతులు పెరుగుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రద్దయిన బ్లాకులతో భారీస్థాయి పెట్టుబడులు ముడిపడిఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ, ఇన్వెస్ట్‌మెంట్ వాతావరణం దెబ్బతింటుందని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగానికి బొగ్గు మైనింగ్‌లో ప్రవేశం కల్పించేవిధంగా ఈ రంగానికి సంబంధించిన చట్టాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలన్నారు. కాగా, బ్లాకుల రద్దు కారణంగా దేశ బొగ్గు దిగుమతుల బిల్లు దాదాపు రూ.18,000 కోట్ల మేర ఎగబాకవచ్చని మెక్వారీ తాజా నివేదిక పేర్కొంది. గతేడాది(2013-14) భారత్ 168.4 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. దీని విలువ రూ.95,000 కోట్లు.
బ్యాంకులకు రూ. లక్ష కోట్ల గండం..
సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు... బ్యాంకులను కూడా వణికిస్తోంది. రద్దయిన బ్లాకులపై ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లకు దేశీ బ్యాంకులు రూ. లక్ష కోట్లకు పైగా రుణాలివ్వడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్‌లు గనుక సమస్యల్లో చిక్కుకుంటే బ్యాంకులిచ్చిన రుణాల వసూళ్లలోనూ తిప్పలుతప్పవు. ప్రధానంగా దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అత్యధికంగా రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి. కాగా, తామిచ్చిన రుణాల విలువను లెక్కగట్టే పనిలో ఉన్నట్లు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలు పేర్కొన్నాయి.
‘సుప్రీం తీర్పును మేం గౌరవిస్తున్నాం. రద్దయిన బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు ప్రభుత్వం పారదర్శకతతోకూడిన తక్షణ ప్రణాళికలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. తద్వారా బొగ్గు సరఫరాలకు ఆటంకాలు తప్పుతాయి’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ బ్లాకులతో సంబంధం ఉన్న విద్యుత్ ప్లాంట్లకు తామిచ్చిన రుణాలు రూ.4,000 కోట్ల వరకూ మాత్రమే ఉండొచ్చని గతంలో ఆమె చెప్పారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ రూ.2,000 కోట్ల రుణాలిచ్చినట్లు అంచనా.