సీబీఐ చరిత్రలో తొలిసారిగా..
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు విచారణలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు సీబీఐని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తిని, సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రంజిత్‌ను విచారించే బృందానికి కొత్త సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఇంచార్జీగా వ్యవహరిస్తారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్‌గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ గతంలో నివేదిక సమర్పించింది.