India Inc
-
‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికి మించి స్వేచ్ఛా విపణిగా మారగలుగుతోందని మైండ్‌మైన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి అనంతరం భారత్ అనేక వినూత్న ప్రయోగాలను ఆవిష్కరిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది.. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌పై నమ్మకంగా ఉన్నప్పుడు దేశీయంగా ప్రైవేట్ సంస్థలు తయారీలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియడం లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చించేందుకు, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హనుమంతుడిలాగా పరిశ్రమకు తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ హనుమాన్‌లాగా మారిందా? మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం కలగడం లేదా. ఎవరైనా మీ పక్కన నిల్చుని, మీకు హనుమంతుడి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి .. ముందుకు కదలండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అలా హనుమంతుడికి ప్రస్తుతం చెప్పేవారు ఎవరున్నారు. పరిశ్రమ కదిలి వచ్చి ఇన్వెస్ట్ చేసేందుకు ఏమేమి చేయగలదో అంతా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారో మీ నుంచి వినాలని ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. -
3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్ డీల్స్ రూ.97,680 కోట్లు
ముంబై: దేశీయంగా కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది. కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు. జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్ రిటైల్, డిజిటల్ హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్టెక్ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్ థార్న్టన్ పేర్కొంది. చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా -
టాప్–100 ప్రభావశీల వ్యక్తుల్లో బిలిమోరియా
లండన్: భారత్–బ్రిటన్ బంధాలను ప్రభావితం చేసిన టాప్ వంద మంది ప్రముఖుల్లో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ చాన్స్‌లర్ లార్డ్ కరణ్ బిలిమోరియాకు చోటుదక్కింది. ఆయనతోపాటు ఇదే వర్సిటీ సహాయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాబిన్ మాసన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. యూకే–ఇండియా వీక్ 2018లో భాగంగా ‘ఇండియా ఐఎన్‌సీ. టాప్ 100’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో భారత్, బ్రిటన్ల్లో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు గడించిన పలువరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన కరణ్ బిలిమోరియా బ్రిటన్‌లో ప్రఖ్యాత కోబ్రా బీర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి అధ్యక్షుడిగా, యూకే–ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక చైర్మన్‌గానూ ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
ఆర్థిక రంగం పనితీరు బాగు
♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం ♦ సమీప కాలంలో డిమాండ్ ♦ ఊపందుకుంటుందనే ఆశాభావం న్యూఢిల్లీ: దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అంతకుముందు ఆరు నెలల కాలంతో పోల్చి చూసినప్పుడు మెరుగ్గా ఉన్నాయని భారత పరిశ్రమ (ఇండియా ఇంక్) వర్గాలు భావిస్తున్నారుు. అరుుతే, రుణాలపై వ్యయాలు, రుణాల అందుబాటు విషయంలో ఇంకా ఆందోళనకర పరిస్థితే ఉన్నట్టు ఫిక్కీ నిర్వహించిన వ్యాపార విశ్వాస సూచీ (ఓబీసీఐ) సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యారుు. వ్యాపార విశ్వాసం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థారుుకి చేరింది. సూచీ విలువ గత సర్వేలో 62.8గా ఉండగా తాజా సర్వేలో అది 67.3 శాతానికి పెరిగింది. సర్వే ప్రధానాంశాలు ♦ మోస్తరు నుంచి గరిష్ట స్థారుులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 63 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి వర్షాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు డిమాండ్‌ను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తమైంది. ♦ సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 31 శాతం మంది రానున్న ఆరు నెలల్లో మరింత మంది ఉద్యోగులను భర్తీ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే 56 శాతం మంది మాత్రం తాము సమీప భవిష్యత్తులో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవచ్చని పేర్కొన్నారు. ♦ 75 శాతం మంది సమీప భవిష్యత్తులో ఆర్థిక రంగం మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. పరిశ్రమ స్థారుులో పనితీరు మెరుగుపడుతుందని 63 శాతం మంది అంచనా వేయగా, సంస్థల స్థారుులో మెరుగైన పనితీరు ఉంటుందని 70 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ♦ దేశ ఆర్థిక రంగం తిరిగి కోలుకునే క్రమంలో ఉందని, ఆర్థిక రంగం పనితీరు మెరుగుపడుతుందనే సంకేతాలు ఉన్నట్టు చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంటూ ఇకపైనా ఇదే కొనసాగుతుందనే ఆశావహ దక్పథం వ్యక్తమైంది. జీఎస్టీని దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేదిగా కంపెనీలు అభివర్ణించారుు. ♦ రుణాల వ్యయం విషయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు సర్వేలో 46 శాతం మందే ఇలా చెప్పారు. రుణాల అందుబాటు విషయంలో 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. -
జీఎస్టీ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది
ముంబై: భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలు జీఎస్టీ బిల్లు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ గా పేర్కొంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదంకోసం వేచి చూస్తున్నాయి. వివిధ పరోక్ష పన్నులు, పన్నుశాతాల తొలగింపు, ఒకే పన్ను ఒకే దేశం పద్ధతిద్వారా పారదర్శకత నెలకొంటుందని భావిస్తున్నాయి. ఇది ఆర్థికవృద్ధికి మంచి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నాయి. బుధవారం రాజ్యసభలో వాడి వేడి చర్చల నేపథ్యంలో ప్రముఖ కంపెనీల పెద్దలు స్పందించారు. ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. భారీ ఉత్పాదకతో పాటు లక్షల ఉద్యోగాలకు సృష్టించే సామర్ధ్యం జీఎస్టీ బిల్లుకు ఉందని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ట్విట్ చేశారు. జీఎస్ టీ బిల్లులేని భారత ఆర్థిక వ్యవస్థ లేదని ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాఅన్నారు. జీఎస్టీ లేకుండా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సాద్యంకాదని లేకుండా కోటక్ ఆటో మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్విట్ చేశారు. ఈ బిల్లు పాస్ కావాలని ప్రార్ధిస్తున్నాన్నారు. బీజేపీ పాపులర్ స్లోగన్ అచ్చే దిన్ తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. సంస్కరణల ప్రక్రియలో జీఎస్ టీ బిల్లు ఒక "మైలురాయి" లాంటిదని జెఎస్ డబ్ల్యు స్టీల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. దీనికి అన్ని పార్టీలు ప్రభుత్వానికి అభినందనలు తెలపాలన్నారు. సాధారణ ప్రజలకు జీఎస్టీ ఉపయోగపడుతుందని బయోకాన్ ఎండీ కిరణ మజుందార్ షా ఇటీవల తన ట్విట్ లో పేర్కొన్నారు. As #GST enters the last mile,all political parties must be congratulated 4 what will be a landmark event in #India's economic reform process — Sajjan Jindal (@sajjanjindal59) August 1, 2016 #GSTBill will not only unlock huge productivity but also create millions of formal sector jobs - #repost https://t.co/viPt9orDtz — Sachin Bansal (@_sachinbansal) August 3, 2016 -
ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు లెసైన్సులను మూకుమ్మడిగా రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంవల్ల విద్యుత్ సంక్షోభానికి దారితీయొచ్చని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. బొగ్గు స్కామ్ కేసులో 1993 నుంచి గత ప్రభుత్వాల హయాంలో కేటాయించిన మొత్తం 218 బొగ్గు బ్లాకులకుగాను 4 మినహా మిగతా 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీం బుధవారం తీర్పునివ్వడం తెలిసిందే. తీర్పువల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులకు విఘాతం కలగడంతోపాటు ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా సన్నగిల్లుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ పేర్కొన్నారు. బొగ్గు కొరత తీవ్రతరం... రద్దయిన బొగ్గు బ్లాకుల్లో 42 వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవే. దేశంలో సరఫరా అవుతున్న మొత్తం బొగ్గులో 10 శాతం(53 మిలియన్ టన్నులు) వీటిద్వారానే లభిస్తోంది. ఇప్పుడు సుప్రీం తీర్పు కారణంగా ఈ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయి.. సరఫరాలకు బ్రేక్ పడుతుందని శ్రీరామ్ చెప్పారు. దిగుమతులు భారీగా పెరిగిపోయి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకేందుకు దారితీస్తుందన్నారు. కోర్టు ఆదేశాలతో అనిశ్చితి నెలకొందని.. కీలకమైన విద్యుత్, స్టీల్, మైనింగ్ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ పాలసీల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో మూడింట రెండోవంతు బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు సరఫరా చాలకపోవడంతో 80 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇంధన కొరత మరింత తీవ్రతరమవుతుంది. ప్రభుత్వం మళ్లీ వేగంగా గనులను కేటాయించడం ద్వారా విద్యుదుత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి’ అని శ్రీరామ్ పేర్కొన్నారు. కాస్త కఠిన తీర్పు ఇది: అసోచామ్ ఈ తీర్పు కాస్త కఠినమైనదేనని, దీనివల్ల దేశంలోకి బొగ్గు దిగుమతులు పెరుగుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రద్దయిన బ్లాకులతో భారీస్థాయి పెట్టుబడులు ముడిపడిఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ, ఇన్వెస్ట్మెంట్ వాతావరణం దెబ్బతింటుందని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగానికి బొగ్గు మైనింగ్‌లో ప్రవేశం కల్పించేవిధంగా ఈ రంగానికి సంబంధించిన చట్టాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలన్నారు. కాగా, బ్లాకుల రద్దు కారణంగా దేశ బొగ్గు దిగుమతుల బిల్లు దాదాపు రూ.18,000 కోట్ల మేర ఎగబాకవచ్చని మెక్వారీ తాజా నివేదిక పేర్కొంది. గతేడాది(2013-14) భారత్ 168.4 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. దీని విలువ రూ.95,000 కోట్లు. బ్యాంకులకు రూ. లక్ష కోట్ల గండం.. సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు... బ్యాంకులను కూడా వణికిస్తోంది. రద్దయిన బ్లాకులపై ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లకు దేశీ బ్యాంకులు రూ. లక్ష కోట్లకు పైగా రుణాలివ్వడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్లు గనుక సమస్యల్లో చిక్కుకుంటే బ్యాంకులిచ్చిన రుణాల వసూళ్లలోనూ తిప్పలుతప్పవు. ప్రధానంగా దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అత్యధికంగా రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి. కాగా, తామిచ్చిన రుణాల విలువను లెక్కగట్టే పనిలో ఉన్నట్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలు పేర్కొన్నాయి. ‘సుప్రీం తీర్పును మేం గౌరవిస్తున్నాం. రద్దయిన బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు ప్రభుత్వం పారదర్శకతతోకూడిన తక్షణ ప్రణాళికలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. తద్వారా బొగ్గు సరఫరాలకు ఆటంకాలు తప్పుతాయి’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ బ్లాకులతో సంబంధం ఉన్న విద్యుత్ ప్లాంట్లకు తామిచ్చిన రుణాలు రూ.4,000 కోట్ల వరకూ మాత్రమే ఉండొచ్చని గతంలో ఆమె చెప్పారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ రూ.2,000 కోట్ల రుణాలిచ్చినట్లు అంచనా. -
నడత మారని పారిశ్రామికం
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగంలో రికవరీ కనబడ్డం లేదు. ఫిబ్రవరి తరహాలోనే (-1.8 శాతం) మార్చిలో సైతం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ఈ సూచీ -0.5 శాతం క్షీణించింది. ప్రధాన రంగాలు తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే ఫిబ్రవరితో పోల్చితే క్షీణత రేటు మెరుగుపడ్డమే ఇక్కడ చెప్పుకోదగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2013 మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.5 శాతం. ప్రధాన రంగాల పనితీరును పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు క్షీణతలోకి జారింది. 4.3% వృద్ధి రేటు మైనస్ 1.2%లోకి జారింది. మైనింగ్: సూచీలో 14 శాతం వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో క్షీణత కొనసాగుతోంది. అయితే క్షీణత (-) 2.1 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధిరేటు మాత్రం బాగుంది. ఇది 3.5 శాతం నుంచి 5.4 శాతానికి మెరుగుపడింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రధాన సూచికగా ఉండే భారీ ఉత్పత్తుల రంగం క్యాపిటల్ గూడ్స్ 9.6% వృద్ధి నుంచి మైనస్ 12.5 శాతంలోకి పడిపోయింది. వినియోగ వస్తువులు: ఈ రంగం 1.8% వృద్ధి నుంచి 0.9% క్షీణతలోకి చేరింది. ఈ రంగంలోని వినియోగ మన్నిక ఉత్పత్తుల్లో అసలు వృద్ధిలేకపోగా 11.8% క్షీణించింది. 2013 మార్చిలో సైతం ఈ రంగం క్షీణతలో ఉన్నా, అప్పట్లో ఇది మైనస్ 4.9 శాతం. -
చిదంబరంతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం ఆర్థికమంత్రి పీ చిదంబరంతో సమావేశమయ్యారు. ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుండడం, పేలవ స్థాయిలో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, రానున్న సమీక్ష సందర్భంగా రెపోరేటుకు సంబంధించి ఆర్బీఐ నిర్ణయంపై వేర్వేరు అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. బ్యాంకింగ్ లెసైన్సుల కోసం ముందు జాగ్రత్తగానే ఈసీ అనుమతి కోరాం: రాజన్ కొత్త బ్యాంకు లెసైన్సుల జారీకి ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోరింది ముందు జాగ్రత్తగానేనని రాజన్ చెప్పారు. ‘ఇలాంటి (లెసైన్సు) ప్రకటనల విషయంలో అనిశ్చితి ఉండకూడదు. అందుకే, లెసైన్సుల జారీ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడే ఉన్నదా అని ఈసీని అడిగి తెలుసుకోవడం ముఖ్యం..’ అని అన్నారు. రెపో పెంచే అవకాశాల్లేవ్: ఎస్బీఐ కాగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ప్రకారం రెపోను పెంచే అవకాశాలు లేవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. ఒకవేళ పెంచినా ఇది పావుశాతంకన్నా తక్కువ ఉంటుందని అభిప్రాయపడింది. బాసెల్ 3 ప్రమాణాల అమలు గడువు పొడిగింపు బ్యాంకుల మూలధన పెంపునకు సంబంధించి బాసెల్ 3 అంతర్జాతీయ ప్రమాణాల అమలు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గురువారం పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు గడువు మార్చి 2018 మార్చి 31కాగా, దీనిని మరో యేడాదికాలం అంటే 2019 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ తెలిపింది. మొండిబకాయిలు పెరగడం, బ్యాంకుల లాభదాయకతపై ఆందోళన వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం వెలువడింది.