ఆర్థిక రంగం పనితీరు బాగు
♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం
♦ సమీప కాలంలో డిమాండ్
♦ ఊపందుకుంటుందనే ఆశాభావం
న్యూఢిల్లీ: దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అంతకుముందు ఆరు నెలల కాలంతో పోల్చి చూసినప్పుడు మెరుగ్గా ఉన్నాయని భారత పరిశ్రమ (ఇండియా ఇంక్) వర్గాలు భావిస్తున్నారుు. అరుుతే, రుణాలపై వ్యయాలు, రుణాల అందుబాటు విషయంలో ఇంకా ఆందోళనకర పరిస్థితే ఉన్నట్టు ఫిక్కీ నిర్వహించిన వ్యాపార విశ్వాస సూచీ (ఓబీసీఐ) సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యారుు. వ్యాపార విశ్వాసం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థారుుకి చేరింది. సూచీ విలువ గత సర్వేలో 62.8గా ఉండగా తాజా సర్వేలో అది 67.3 శాతానికి పెరిగింది.
సర్వే ప్రధానాంశాలు
♦ మోస్తరు నుంచి గరిష్ట స్థారుులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 63 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి వర్షాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు డిమాండ్‌ను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తమైంది.
♦ సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 31 శాతం మంది రానున్న ఆరు నెలల్లో మరింత మంది ఉద్యోగులను భర్తీ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే 56 శాతం మంది మాత్రం తాము సమీప భవిష్యత్తులో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవచ్చని పేర్కొన్నారు.
♦ 75 శాతం మంది సమీప భవిష్యత్తులో ఆర్థిక రంగం మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. పరిశ్రమ స్థారుులో పనితీరు మెరుగుపడుతుందని 63 శాతం మంది అంచనా వేయగా, సంస్థల స్థారుులో మెరుగైన పనితీరు ఉంటుందని 70 శాతం మంది అభిప్రాయం తెలిపారు.
♦ దేశ ఆర్థిక రంగం తిరిగి కోలుకునే క్రమంలో ఉందని, ఆర్థిక రంగం పనితీరు మెరుగుపడుతుందనే సంకేతాలు ఉన్నట్టు చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంటూ ఇకపైనా ఇదే కొనసాగుతుందనే ఆశావహ దక్పథం వ్యక్తమైంది. జీఎస్టీని దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేదిగా కంపెనీలు అభివర్ణించారుు.
♦ రుణాల వ్యయం విషయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు సర్వేలో 46 శాతం మందే ఇలా చెప్పారు. రుణాల అందుబాటు విషయంలో 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.