Economic Conditions
-
దుబారా తగ్గాలి..పన్నేతర ఆదాయం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో క్రమశిక్షణ, నిశిత పరిశీలన, వ్యూహాత్మక వినియోగం కీలకమని.. ఆర్థిక నిర్వహణను బట్టే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు సాధ్యమవుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశలో పనిచేయాలని.. దుబారా తగ్గించుకుని, ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యూహాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. రఘురాం రాజన్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లండి రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లాలని, ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టాలని రఘురాం రాజన్ సూచించినట్టు తెలిసింది. మైనింగ్‌తోపాటు నాలా చార్జీల్లాంటి పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పినట్టు సమాచారం. కొత్త వాహనాలు కొనడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వంటి దుబారా ఖర్చుల జోలికి వెళ్లవద్దని.. సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పథకాల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రఘురాం రాజన్ తన అనుభవాలను సీఎం బృందంతో పంచుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు లెక్కలు తగవు: బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని హేళన చేసిన టీడీపీ అగ్ర నాయకత్వం ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి జీవనాధారమైన రంగం వృద్ధి రేటును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధిని అంచనా వేసేందుకు స్థిరమైన ధరలను వినియోగిస్తారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రస్తుత ధరలపై వృద్ధి రేట్లతో వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంచనాలకు మించి పనితీరు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే యనమల కరోనా సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోవిడ్ వల్ల 2020–21లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలియదా? గత సర్కారు వైదొలగే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర జీఎస్డీపీ 2017–18లో 10.09 శాతం వృద్ధి రేటు ఉంటే 2018–19లో 4.88 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–20లో రాష్ట్రం 7.23 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2019–20లో రాష్ట్రం వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవారంగంలో 6.20 శాతం వృద్ధితో అంచనాలకు మించి పనితీరు కనబరిచింది. నిరుద్యోగంపైనా తప్పుడు లెక్కలే రాష్ట్రంలో 6.5 శాతం నిరుద్యోగ రేటు ఉందని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగ రేటు (15 – 59 ఏళ్ల వయసు) 2018–19లో 5.7 శాతం ఉంటే 2019 –20లో 5.1 శాతానికి తగ్గింది. యనమల తప్పుడు లెక్కలతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దురదృష్టకరం. ఎస్‌డీజీల్లో మరింత మెరుగ్గా 3వ ర్యాంకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ, పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనలో రాష్ట్రం మెరుగుపడలేదంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2018–19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 2019 –20, 2020–21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో ఏపీ మెరుగ్గా 3వ స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రం పెర్ఫార్మర్ కేటగిరీలో ఉంటే ఇవాళ ఫ్రంట్‌రన్నర్ కేటగిరీకి ఎదిగాం. 67 నుంచి 81కి పెరిగిన మార్కులు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పేదరిక నిర్మూలనలో 5వ స్థానంలో నిలిచి ఎస్డీజీ మార్కులను 67 నుంచి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకుని పేదలను కరోనా కష్టకాలంలో కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అసమానత 32 నుంచి 43 శాతానికి పెరిగిందని ఆరోపణలు చేస్తున్న యనమల ఏ లెక్కల ప్రకారం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. చెప్పే సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుకూల మీడియాలో పత్రికా ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదు. ఎస్డీజీ సూచీల్లో అసమానతల తగ్గింపు ఆశయంలో రాష్ట్రం 2018–19లో 15వ స్థానంలో ఉండగా 2020 – 21లో 6వ స్థానానికి మెరుగుపడింది. జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలి ►45వ కౌన్సిల్ సమావేశంలో కేంద్రానికి ఆర్థిక మంత్రి బుగ్గన వినతి సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్ర పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు తగ్గిపోవడంతో 2022 తర్వాత కూడా పరిహారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌన్సిల్‌కు తెలియచేశారు. జీఎస్టీ అమలుకు ముందు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో సగటు వృద్ధి రేటు 14 నుంచి 15 శాతం ఉండగా 2017లో జీఎస్టీ అమలు నాటి నుంచి 10 శాతానికి పరిమితమైందని బుగ్గన వివరించారు. దీంతో ఏటా పరిహారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, కోవిడ్ సంక్షోభంతో గత రెండేళ్లుగా జీఎస్టీ ఆదాయం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 14 శాతం వృద్ధి రేటు కంటే తక్కువగా నమోదైన మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే విధానాన్ని 2022 తర్వాత కూడా కొనసాగించాల్సిందిగా కోరారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాట్ పరిధిలో ఉన్న రెండు ఉత్పత్తులను అదేవిధంగా కొనసాగించాల్సిందిగా కోరారు. ఆగస్టు వరకు పరిహారాన్ని త్వరగా ఇవ్వాలి ప్రస్తుతం నాపరాళ్లపై 18 శాతంగా ఉన్న పన్నును 5 శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తిపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సోలార్ పవర్, లిక్కర్ తయారీలో జాబ్ వర్క్‌లపై పన్ను రేట్లను తగ్గించాల్సిందిగా బుగ్గన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోయిందని, సంక్షేమ పథకాలు సజావుగా అమలు కోసం ఆగస్టు వరకు జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని
వనపర్తి క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం.. వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటోంది. ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యా లయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు. తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లోనే మధ్యాహ్నం ఉరేసుకొని చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం. -
ఆరోగ్యశ్రీలక్ష్మి
‘ఎలా ఉన్నావ్..’ అని అడుగుతాం ఆత్మీయులు ఎదురైతే. శ్రీలక్షి అడగరు... చూస్తారు. ఎలా ఉన్నారో ఆమెకు తెలిసిపోతుంది! డాక్టర్లు స్టెతస్కోప్ పెట్టి కనిపెడతారు. డాక్టరు కాని శ్రీలక్ష్మి మనసు పెట్టి గ్రహిస్తారు. అభాగ్యులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తారు. అందుకే ఆమెకు శ్రీలక్ష్మి కాదు... ఆరోగ్యశ్రీలక్ష్మి అన్నదే తగిన పేరు. దాసరి శ్రీలక్ష్మీరెడ్డి పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో. పెళ్లితో ఖమ్మం జిల్లా కోడలయ్యారామె. పిల్లల చదువు కోసం 1997లో హైదరాబాద్‌కి రావడం ఆమె జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఆమె సాధారణమైన గృహిణి, రుద్రాక్షపల్లిలోని పెద్ద భూస్వామి కుటుంబం కోడలు. ఇదే ఆమె గుర్తింపు. భర్త, ముగ్గురు పిల్లలతో ఇల్లే ప్రపంచంగా గడిచిపోయింది. కుటుంబం హైదరాబాద్ రావడంతో ఆమెలో ఉన్న సోషల్ వర్కర్ బయటికొచ్చింది. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆమెను సమాజం కోసం పనిచేసేలా తీర్చిదిద్దింది. సామాజిక కార్యకర్తగా మలిచింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని నమ్ముతారామె. అనారోగ్యాలు మనిషి ఆర్థిక పరిస్థితులను చూసి ఆగిపోవు. డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరని... జబ్బులు దరిచేరకుండా ఉండవు. అందుకే ఆరోగ్యం అందించడానికి ఎక్కువగా కృషి చేశారు శ్రీలక్ష్మి. అన్ని అనారోగ్యాల కంటే కంటి చూపు దెబ్బతినడం నిజంగా శాపమే. అందుకే దృష్టిలోపం ఉన్న పేదవాళ్లకు మెరుగైన కంటి చికిత్సను అందించడం మొదలుపెట్టారు. అలా దోమల్‌గూడలోని సాధూరామ్ కంటి ఆసుపత్రి సేవను నిరుపేద కాలనీలకు చేర్చడానికి వారధి అయ్యారు శ్రీలక్ష్మి. డాక్టర్ల సహకారంతో వారాంతాల్లో కాలనీల్లో హెల్త్‌క్యాంపులు పెట్టించారు. పేషెంట్ మందులు, కళ్లద్దాలకు అయ్యే ఖర్చును ఇప్పటికీ ఆమే పెట్టుకుంటున్నారు. ఆపరేషన్ అవసరమైన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయించే వరకు ఆ పేషెంట్ బాధ్యత ఆమెదే. కాలనీలో మెడికల్ క్యాంపులో ఉచితంగా సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్లు సంతోషంగా అంగీకరించేవారు, కానీ కాలనీవాసులను వైద్య పరీక్షకు తీసుకురావడమే పెద్ద సవాల్‌గా ఉండేదని అన్నారు శ్రీలక్ష్మి. నా గుర్తింపు నేనే ‘‘నన్ను నేను... ఫలానా ఇంటి ఆడపడుచుని, ఫలానా ఇంటి కోడలిని, ఫలానా లాయర్ భార్యని అని, కలెక్టర్ తల్లి, డాక్టర్ తల్లి... అని పరిచయం చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. అలాగని ఆ గుర్తింపుల దగ్గరే ఆగిపోకూడదని కూడా అనుకున్నాను. నా గుర్తింపును నేనే అవాలని నా కోరిక. అందుకు రామకృష్ణ మఠం నాకు ఒక మార్గాన్ని చూపించింది. ఆ దారిలో నాకు చేతనైనంతగా సహాయం చేస్తున్నాను. దోమల్‌గూడ, మహబూబ్‌నగర్, కొడంగల్, కోస్గి, రావులపల్లి, కరీంనగర్‌లలో సర్వీస్ చేశాను. నేను కనిపించగానే ‘లక్ష్మక్కా!’ అని నోరారా పిలిచి వాళ్ల బాధలు చెప్పుకుంటారు. మొదట్లో వైద్య శిబిరాలకే పరిమితమయ్యాను. కానీ కాలనీల్లో తిరుగుతున్నప్పుడు వాళ్లు ఎదుర్కొనే అనేక సామాజిక సమస్యలు కూడా తెలిశాయి. అందుకోసమే నేను నడుపుతున్న ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ ఆఫీస్‌లో న్యాయసలహా విభాగం కూడా ఏర్పాటు చేశాను. ‘మహిళా సమస్యలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు– చైతన్యం’ కూడా నా సర్వీస్‌లో భాగమయ్యాయి. ఖైదీలకు వైద్యం అల్పాదాయ వర్గాల కాలనీల్లో పని చేయడం ఒక ఎత్తయితే చంచల్‌గూడ జైలు ఖైదీలకు వైద్య సహాయం చేయడం మరో ఎత్తు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వైద్యపరీక్షలు చేయించడానికి జైలు అధికారులు అనుమతిచ్చారు. డాక్టర్ల బృందంతో జైల్లో పరీక్షలు నిర్వహించాం. అయితే సమస్య అంతా... వాళ్లకు ఆపరేషన్లు చేయించడం దగ్గర మొదలైంది. అప్పటి వరకు పేదవాళ్లకు సాధూరామ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేదాన్ని. ఖైదీలను బయటి హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు, ప్రభుత్వ వైద్యశాలలోనే చేయించాలని తెలిసింది. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయడానికి సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రి వైద్య అధికారులు తేదీలు ఖరారు చేశారు. అయితే వాళ్లను జైలు నుంచి బయటికి పంపించడానికి నిబంధనలు చాలా పటిష్టంగా ఉంటాయి. హోమ్ మంత్రిని కలిసి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ‘ఆపరేషన్ తర్వాత జైలుకి తరలించే వరకు బాధ్యత వహిస్తానని, ఆ ఖైదీల్లో ఎవరైనా పారిపోతే నాదే పూచీకత్తు’ అని రాసి సంతకం చేసిన తర్వాత పంపించారు. ఖైదీలకు వైద్యం కోసం ఇంత రిస్క్ చేశానని తెలిసి ‘ముందు వెనుక ఆలోచించకుండా చేస్తూ పోవడమేనా’ అని మావాళ్లు కోప్పడ్డారు. మనమే దారి చూపించాలి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత దాదాపుగా కొత్త ప్రపంచాన్ని చూశాననే చెప్పాలి. ‘ట్రైనింగ్’ అనే ప్రకటన కనిపిస్తే చాలు.. వెళ్లిపోయేదాన్ని. ఫినాయిల్, సోప్ ఆయిల్, ఇతర క్లీనింగ్ మెటీరియల్ తయారీతోపాటు బ్యూటీషియన్ కోర్సు, చిప్స్ తయారీ, క్యాండిల్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు కూడా చేశాను. నేను నేర్చుకున్నవన్నీ పేద మహిళలకు నేర్పిస్తున్నాను. భర్త తాగుడుకు బానిసయ్యి, పిల్లలను పోషించలేక ఆత్మహత్యకు పాల్పడే వాళ్లను చూసినప్పుడు మనసు పిండేసినట్లయ్యేది. ‘మనిషిలో జీవనోత్సాహం ఉండాలి. మరణం దేనికీ సమాధానం కాదు’... ఈ మాట చెప్పడానికే ‘వై వియ్ డై... హౌ వియ్ లివ్’ అని కౌన్సెలింగ్ కూడా మొదలు పెట్టాను. అయితే... చనిపోవాలనుకునే వాళ్లకు బతుకు మీద ఆశ కలిగించడంతో మన బాధ్యత తీరిపోదు, వాళ్లకు బతకడానికి ఒక దారి చూపించగలిగితేనే ఒక జీవితాన్ని కాపాడిన వాళ్లమవుతాం. నిజానికి బతకడానికి దారి తెలిస్తే ఎవరూ చనిపోవాలనుకోరు కూడా. అందుకే ఆ మహిళలకు నేను నేర్చుకున్న స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నాను. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించడంతోపాటు, ఆ మహిళలు తయారు చేసిన ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని మార్కెట్ చేయడానికి హాస్పిటళ్లతో మాట్లాడడం కూడా నేనే. నా భర్త స్నేహితుల్లో చాలామంది డాక్టర్లు ఉండడం నాకు బాగా ఉపయోగపడింది. మహిళా ఖైదీలకు కూడా కుటీర పరిశ్రమ నిర్వహణకు అవసమైన స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాను. కార్పెంటరీ, స్వెటర్ అల్లకంలో కూడా శిక్షణ ఇప్పించాం. ఐఏఎస్ ఆఫీసర్ రామలక్ష్మిగారి సహాయంతో ఆ మహిళా ఖైదీలకు లోన్లు ఇప్పించాను. సమాజం కోసం చేసిన ప్రతి పనిలోనూ నేను ఆనందాన్ని ఆస్వాదించాను. అయితే బెగ్గర్స్ రీహాబిలిటేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి సహనానికి పరీక్షగా ఉండేది. వాళ్లకు హోమ్‌లో షెల్టర్ ఇచ్చి తిండి, దుస్తులు ఇస్తుంటే... వాళ్లు మాత్రం గంజాయి ఇప్పించమని ఒకరు, సిగరెట్ లేకపోతే ఉండలేమని కొందరు సతాయించేవాళ్లు. నా కూతురు చెప్పిన మాట సోషల్ లైఫ్‌లో ఎదురయ్యే అనేకానేక పురస్కారాలు, తిరస్కారాల గురించి మా అమ్మాయి ఒకటే మాట చెప్తుండేది. ‘ఎవరైనా సరే... తమకు ప్రత్యేకంగా గుర్తింపు రావాలని కోరుకుంటే చాలదు. ఆ వ్యక్తి ఆ గౌరవానికి తగిన వ్యక్తి అని ఎదుటి వాళ్లకు అనిపించాలి. అదే అసలైన గుర్తింపు’ అని, డిజర్వ్కీ డిజైర్కీ మధ్య తేడా తెలుసుకోవాలని చెప్తుంటుంది. నేను పెంచిన పాపాయి.. ఇంత పరిణతితో మాట్లాడుతుంటే నా పెంపకంలో ఇంతటి సంస్కారంతో పెరిగిందా లేక తను నేర్చుకున్న మంచి భావాలతో తనే నన్ను తీర్చిదిద్దుతోందా అనిపిస్తుంటుంది. మనం వేదిక మీద ఒక పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు మనసులో ‘‘అవును, ఈమె చాలా సేవ చేసింది. ఫలానా చోట ఫలానా సర్వీస్ చేయడం మాకు తెలుసు’’ అనుకోవాలి. అదే అసలైన గౌరవం. అవార్డులు అందుకుంటున్నప్పుడు నాకు మా అమ్మాయి చెప్పిన మాట గుర్తుకు వస్తుండేది. ప్రతి పురస్కారమూ ఎంతో కొంత సంతోషాన్నిచ్చి తీరుతుంది. ఆ జ్ఞాపికను చూసినప్పుడు దాని వెనుక ఉన్న నా శ్రమ గుర్తుకు వస్తుంటుంది. అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది మాత్రం వైఎస్ఆర్ చేతుల మీద పురస్కారం అందుకోవడమే. అది కూడా ఎంత కాకతాళీయంగా జరిగిందంటే... రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రదానం జరుగుతోంది. నన్ను ఉత్తమ సోషల్ వర్క్ అవార్డుకు ఎంపిక చేశారు. నేను వెళ్లడం కొంచెం ఆలస్యమైంది. వైఎస్ఆర్ గారు రావడం కూడా ఆలస్యం కావడంతో కార్యక్రమం సమయానికి జరగాలనే ఉద్దేశంతో మంత్రుల చేతుల మీదుగా మొదలు పెట్టమని చెప్పార్ట వైఎస్ఆర్. నేను అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళ్లేటప్పటికి ఆయన కూడా వచ్చేశారు. ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. ఆయన చేతుల మీద అవార్డు అందుకునే అదృష్టం ఉండడంతోనే నేను కార్యక్రమానికి ఆలస్యమైనట్లున్నాను. ఆయన నన్ను చూసి ‘ఇక్కడ కూడా ఉన్నావా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా పిచ్చితల్లీ’ అని నవ్వారు. అంతకు ముందు నేను చాలాసార్లు భర్త చేతిలో మోసపోయిన అమ్మాయిలకు న్యాయం చేయమని ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. వైఎస్ఆర్ ఆ మహిళలతో మాట్లాడి ‘కేసు డీల్ చేయమని సబితమ్మకు రాస్తున్నాను. వీళ్లను సబితమ్మ దగ్గరకు తీసుకెళ్లు’ అని పంపించేవారు. అందుకే ఆయన నన్ను అవార్డుల వేదిక మీద చూడగానే ఆ మాటన్నారు. అప్పుడు నేను ‘నాకు స్ఫూర్తి మీరే, మీరు చేసినంత చేయలేను, కానీ నేను చేయగలిగినంత చేస్తాను’ అని చెప్పాను. అప్పుడు తీసిన ఈ ఫొటో చూసుకుంటే ఆయన మాటలు ఇప్పుడు వింటున్నట్లే ఉంటుంది’’ అంటూ వైఎస్ఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫొటో చూపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు శ్రీలక్ష్మి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేశ్ బాబు అత్తగారి వర్ధంతికి పేదవారుండే కాలనీల్లో చీరల పంపిణీ, మామగారి పేరు మీద ఆయన వర్ధంతి రోజున సొంతూరు రుద్రాక్షపల్లిలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం శ్రీలక్ష్మికి ఇష్టమైన వ్యాపకాలు. ‘‘ఇన్నేళ్లుగా నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నాలో పని చేయాలనే తపన ఉండడం, ఇంత ఖర్చు ఎందుకు అనకుండా మా వారు డబ్బివ్వడమే’’ నంటారామె నవ్వుతూ. పెద్ద కొబ్బరి బోండాలు పండించినందుకు హార్టికల్చర్ శాఖ నుంచి ఉత్తమ వ్యవసాయదారుల అవార్డు భర్తతో కలిసి అందుకున్నారు శ్రీలక్ష్మి. వర్మీ కంపోస్టు తయారీ, వేస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో సర్వీస్‌కి రాష్ట్రపతి అవార్డు, రామకృష్ణమఠం ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ (గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఫొటోలు, మధ్యలో వైఎస్ఆర్ ఫొటోతో వేసిన థీమ్ ముగ్గు) అందుకోవడం శ్రీలక్ష్మికి అమూల్యమైన సందర్భాలు. -
భారత్‌లో మధ్యతరగతి పురోభివృద్ధి ఎంతో
న్యూఢిల్లీ : భారత్‌లో మధ్య తరగతి జనాభాపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో 120 కోట్ల మంది జనాభాతో రెండో స్థానంలో వున్న భారత్ 2022 నాటికి చైనాను అధిగమించి మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. అలాగే 2027 నాటికి మధ్య తరగతి జనాభా కూడా ప్రపంచ రికార్డును సాధిస్తుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. 2004 నాటి గణాంకాల ప్రకారం భారత్‌లో మధ్య తరగతి ప్రజల సంఖ్య 30 కోట్లు ఉండగా, అది కేవలం ఎనిమిది ఏళ్లలోనే, అంటే 2012 నాటికి 60 కోట్లకు చేరుకుందని, మొత్తం దేశ జనాభాలోనే సగానికి చేరకుందని ఆ నివేదిక తెలియజేసింది. మధ్యతరగతి ఆదాయం 1990 దశకంలో 25లక్షల డాలర్లు ఉండగా అది 2015 సంవత్సరం నాటికి ఐదు కోట్ల డాలర్లకు చేరుకుందని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. అలాగే వారి రోజువారి తలసరి సగటు ఖర్చు రెండు డాలర్ల నుంచి 10 డాలర్ల మధ్యనుందని నివేదిక తెలిపింది. వారి దిగువ మధ్య తరగతి తలసరి రోజువారి ఖర్చు 4 నుంచి 6 డాలర్ల వరకు ఉందని పేర్కొంది. 2027 నాటికి భారత్‌లోని మధ్య తరగతి జనాభా అమెరికా, యూరప్, చైనాలను అధిగమించి ప్రపంచ రికార్డును సాధిస్తుంది. 2005 నాటి నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే 2014 వరకు మధ్య తరగతి ఇంటి పొదుపు మొత్తాలు మూడింతలు పెరిగాయి. అంటే నాడు ఆరువేల డాలర్లు ఉండగా, అవి నేడు 24వేల డాలర్లకు చేరుకున్నాయి. మధ్యతరగతిలోకి మరిన్ని వృత్తులు, వ్యాపారులు చేరడంతో ఈ తరగతి గణనీయంగా పెరుగుతోంది. వెండర్లు, ఫుడ్ ఇండస్ట్రీ, లెదర్ వర్క్, పెయింటర్లు, కార్పెంటర్లు, కన్స్ట్రక్షన్, క్లాత్షాప్, వాషింగ్, సెక్యురిటీ సర్వీసెస్, వెల్డింగ్, రిపేరింగ్, కేబుల్, ఎలక్ట్రికల్ వర్క్స్, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, డాటా ఎంట్రీ, జరీ మేకర్స్, బ్యాంగిల్ మేకర్స్ మధ్య తరగతి పరిధిలోకి వచ్చేశారు. -
ఆర్థిక రంగం పనితీరు బాగు
♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం ♦ సమీప కాలంలో డిమాండ్ ♦ ఊపందుకుంటుందనే ఆశాభావం న్యూఢిల్లీ: దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అంతకుముందు ఆరు నెలల కాలంతో పోల్చి చూసినప్పుడు మెరుగ్గా ఉన్నాయని భారత పరిశ్రమ (ఇండియా ఇంక్) వర్గాలు భావిస్తున్నారుు. అరుుతే, రుణాలపై వ్యయాలు, రుణాల అందుబాటు విషయంలో ఇంకా ఆందోళనకర పరిస్థితే ఉన్నట్టు ఫిక్కీ నిర్వహించిన వ్యాపార విశ్వాస సూచీ (ఓబీసీఐ) సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యారుు. వ్యాపార విశ్వాసం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థారుుకి చేరింది. సూచీ విలువ గత సర్వేలో 62.8గా ఉండగా తాజా సర్వేలో అది 67.3 శాతానికి పెరిగింది. సర్వే ప్రధానాంశాలు ♦ మోస్తరు నుంచి గరిష్ట స్థారుులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 63 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి వర్షాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు డిమాండ్‌ను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తమైంది. ♦ సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 31 శాతం మంది రానున్న ఆరు నెలల్లో మరింత మంది ఉద్యోగులను భర్తీ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే 56 శాతం మంది మాత్రం తాము సమీప భవిష్యత్తులో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవచ్చని పేర్కొన్నారు. ♦ 75 శాతం మంది సమీప భవిష్యత్తులో ఆర్థిక రంగం మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. పరిశ్రమ స్థారుులో పనితీరు మెరుగుపడుతుందని 63 శాతం మంది అంచనా వేయగా, సంస్థల స్థారుులో మెరుగైన పనితీరు ఉంటుందని 70 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ♦ దేశ ఆర్థిక రంగం తిరిగి కోలుకునే క్రమంలో ఉందని, ఆర్థిక రంగం పనితీరు మెరుగుపడుతుందనే సంకేతాలు ఉన్నట్టు చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంటూ ఇకపైనా ఇదే కొనసాగుతుందనే ఆశావహ దక్పథం వ్యక్తమైంది. జీఎస్టీని దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేదిగా కంపెనీలు అభివర్ణించారుు. ♦ రుణాల వ్యయం విషయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు సర్వేలో 46 శాతం మందే ఇలా చెప్పారు. రుణాల అందుబాటు విషయంలో 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!!
ఈక్విటీ మార్కెట్ అంటే రిస్కు సహజం. అందుకే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉ ండాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవాలంటే ‘డైనమిక్ అసెట్ అలొకేషన్’ వ్యూహం సరైనదని చెప్పొచ్చు. అసెట్ కేటాయింపులు ఇలా... చాలా మంది ఇతరులను అనుసరిస్తుంటారు. అది సరికాదు. బయటైనా, స్టాక్ మార్కెట్లోనైనా. తమకు తెలిసిన వారు షేర్లు అమ్మేస్తున్నారు కదా అని వీరు కూడా స్టాక్స్ అమ్మేస్తారు. అలాగే అందరూ కొంటున్నారు కదా అని వీరు కూడా కొనేస్తారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. సరైన ప్లానింగ్ లేకుండా ఇలా చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అసెట్ అలొకేషన్ వ్యూహాన్ని అనుసరించాలి. అసెట్ అలొకేషన్ వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ఇన్వెస్ట్మెంట్ల నుంచి సెంటిమెంట్‌ను తరిమేయొచ్చు. దీంతో మనం మార్కెట్ బాగులేనపుడు స్టాక్స్‌ను అమ్మేయడం, బాగున్నప్పుడు కొనడం వంటి చర్యలకు దూరంగా ఉంటాం. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సాయంతో ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. డైనమిక్ రీ-బ్యాలెన్సింగ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో తక్కువ కొనడం, ఎక్కువ అమ్మడం అనే విధానాన్ని గమనిస్తాం. ఇక్కడ మన సెంటిమెంట్లతో సంబంధం ఉండదు. ఈక్విటీ మార్కెట్స్ ఆశాజనకంగా లేనప్పుడు (పడ్డప్పుడు) అందులో ఇన్వెస్ట్‌చేసి, పెరుగుతున్నప్పుడు కొన్ని షేర్లను విక్రయించి లాభాలను స్వీకరించవచ్చు. ఫండ్ నిబంధనల ప్రకారం అసెట్ అలొకేషన్స్ను మార్చుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్‌ను తీసుకుంటే.. ఇందులో రీ-బ్యాలెన్సింగ్ ప్రతిరోజూ జరుగుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీల వాటా షేర్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు 30 శాతంగా, ధరలు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు 80 శాతంగా ఉంటుంది. దీని కోసం ఫండ్ కొన్ని ప్రమాణాలను అవలంబిస్తూ ఉంటుంది. సాధారణంగా అందరికీ తెలిసిన సూత్రం... ‘ప్రైస్-బుక్ వేల్యూ’. ఈక్విటీల ప్రైస్-టు-బుక్‌వేల్యూ ఆధారంగా మార్కెట్ స్థితిని అంచనా వేయవచ్చు. పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు సంబంధించి డైన మిక్ అసెట్ అలొకే షన్ ఫండ్స్ ప్రతిరోజూ ప్రైస్-బుక్ వేల్యూను గమనిస్తాయి. దీని ప్రకారమే అసెట్స్‌ను రీ-బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఒకానొక రోజు బుక్ వేల్యూ అనుకున్న స్థాయికి కన్నా దిగువకు వచ్చినప్పుడు ఫండ్ తర్వాతి రోజు ఎక్కువ ఈక్విటీలను కొంటుంది. బుక్ వేల్యూ ఇంకా పడితే ఈక్విటీ కేటాయింపును పెంచుకుంటుంది. పోర్ట్‌ఫోలియోలోని మొత్తం ఈక్విటీ పరిమితిలోనే ఇదంతా జరుగుతుంది. ఇలా రోజూ రీ-బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల పోర్ట్‌ఫోలియో దృఢంగా తయారవుతుంది. ఫండ్స్ ప్రయోజనాలు మీరు ఈక్విటీ ఎంచుకున్నారా? ఫిక్స్డ్ ఇన్కమ్ మార్గాన్ని ఎన్నుకున్నారా? అనే దాంతో సంబంధం లేకుండా రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యాల ఆధారంగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిద్వారా మార్కెట్లోకి అడుగుపెడితే ైడె వర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనే ప్రయోజనాలను పొందొచ్చు. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్లకు ప్రతిఫలం ఉంటుంది. ఇవి కొత్త ఇన్వెస్టర్లకు, ఒక రకంగా రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే బాగుంటాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. సీహెచ్.రామ్ ప్రకాశ్ -
36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-ఆగస్ట్ మధ్యకాలంలో 36.5 శాతం వృద్ధితో రూ.2.63 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ఎక్సైజ్ పన్ను వాటా రూ. 1.02 లక్షల కోట్లుగా, కస్టమ్స్ పన్ను వాటా రూ.85,138 కోట్లుగా, సేవా పన్ను వాటా రూ. 75,006 కోట్లుగా ఉంది. జీడీపీ, పరోక్ష పన్ను గణాంకాలు వంటి అంశాలు దేశ ఆర్థిక పరిస్థితుల మెరుగుదలను సూచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తె లిపారు. పన్ను వసూళ్ల పెరుగుదల జీడీపీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
రుణ-డిపాజిట్ నిష్పత్తిని తొలగించిన చైనా
బీజింగ్: మందగమన ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్న చైనా... ఈ దిశలో శనివారం మరో కీలక అడుగు వేసింది. బ్యాంకింగ్‌లో రుణ-డిపాజిట్ రేషియో 75 శాతం పరిమితిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో బ్యాంకులు తమ డిపాజిట్ల నిధులను పరిమితి లేకుండా రుణాలు అందించడానికి వినియోగించుకోవచ్చు. అంటే బ్యాకింగ్ వద్ద ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) మరింత పెరుగుతుందన్నమాట. ఆ మేరకు 1995 నుంచీ అమలవుతున్న కమర్షియల్ బ్యాంక్ చట్ట సవరణను చైనా చట్టసభ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఆమోదించింది. కాగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా 2015 సంవత్సరానికి స్థానిక ప్రభుత్వాల రుణాలపై పరిమితులనూ విధించింది. ఈ పరిమితి 16 ట్రిలియన్ యువాన్ (2.505 ట్రిలియన్ డాలర్లు)గా ఎన్పీసీ నిర్ణయించింది. షేర్లలోకి కోట్లాది నిధుల కుమ్మరింపు, కరెన్సీ విలువ తగ్గింపు, వడ్డీరేట్లు, రిక్వైర్మెంట్ రిజర్వ్ రేషియోల కోత వంటి పలు చర్యలను ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చైనా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా మందగమనం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై చూపుతోంది. -
బాల్యం బందీ
వలస బాటపడుతున్న మత్స్యకార బాలలు ఇప్పుడు వంటపనికి... రాబోయే రోజుల్లో వేటకు ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న వైనం పేదరికం కారణంగా చదువుకు దూరం వేళ్లూనుకుంటున్న బాలకార్మిక వ్యవస్థ పేదరికం వారిపాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా పనిదొరక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పిల్లల్ని వలసబాట పట్టించాల్సిన దుస్థితి దాపురించింది. చిన్నతనంలో వంటపనివారిగా... రాబోయే కాలంలో చేపలవేట కార్మికునిగా మార్చాల్సి వస్తోంది. విలువైన వారి బాల్యం బందీగా మార్చి చదువుకు దూరం చేస్తోంది. ఎచ్చెర్ల: జిల్లాలోని విశాల తీరప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలకు వేటే జీవనాధారం. పరిస్థితుల ప్రభావం... ప్రకృతి సహకరించకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వేటకు దూరం కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు 194 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తీరప్రాంతంలోని 12 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 98,450 మంది జనాభా ఉండగా, 53,469 మందికి చేపల వేటే ప్రధాన వృత్తి. 1225 ఇంజిన్ బోట్లు, 2598 సంప్రదాయ నాటుపడవలు వేటకు వినియోగిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం అమలవుతుంది. ఈ రోజుల్లో జీవనభృతికోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ చేపలు వేటాడితే కాంట్రాక్టర్లు రూ.20 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తారు. ఇదే అదనుగా పిల్లల తరలింపు ఇదే తరుణంలో 15ఏళ్ల లోపు పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి వలసలు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు కాంట్రాక్టర్లనుంచి రూ.50 వేలు వరకు అడ్వాన్స్ తీసుకొని గుజరాత్‌లోని వీరావల్, సూరత్, మహారాష్ట్రలోని ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పంపిస్తారు. వీరు అక్కడ వంట మనుషులుగా పనిచేస్తారు. అందుకు నెలకు రూ.5వేల వరకు జీతంగా వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వీరూ చేపల వేట నేర్చు కుని ఆ వృత్తిలోకి మారుతారు. ఈ విధంగా పిల్లల బాల్యం మసకబారుతోంది. చదువుకు దూరమై వలస కార్మికులుగా మారిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థల సర్వేతో... ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం, బడేవానిపేట, బుడగట్లపాలెం అనే మూడు మత్స్యకార గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నిర్మూలనకు పాటుపడుతోంది. పాఠశాలకు ఈ మధ్య విద్యార్థులు వెళ్లకపోవటాన్ని గుర్తించిన ఈ సంస్థ దీనిపై ఆరా తీయగా విద్యార్థులు వలస వెళ్లిన విషయం వెలుగు చూసింది. వెంటనే వారు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా ఈ మూడు పంచాయతీల్లో 70 మంది విద్యార్థులను వలస వెళ్లకుండా ముస్కాన్, ఐసీడీఎస్, పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖలు అడ్డుకున్నాయి. దీనిపై పిల్లల తల్లిదండ్రులు గుర్రుగా ఉన్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా వలసలను శాశ్వతంగా నివారించవచ్చన్నది నిపుణుల సూచన. బాలల భవిష్యత్తు దెబ్బ తింటుంది మత్స్యకార గ్రామాల్లో బాలకార్యిక వ్యవస్థ, బాల్య వివాహాలు రెండూ ప్రధాన సమస్యలు. ఈ రెండింటిపైనా ప్రజలను చైతన్య పరుస్తున్నాం. తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలకోసం పిల్లలను వలస పంపిస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బ తింటుంది. చదువు విలువ సైతం ప్రజలకు తెలియటం లేదు. దీనిపై వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం అధికారులు చర్యలు చేపట్టాలి. 10వ తరగతి వరకు మత్స్యకార గ్రామాల్లో నిర్బంధ విద్య అమలు చేయాలి. - గురుగుబెల్లి నరసింహమూర్తి, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, కార్యదర్శి -
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ విమాన ప్రయాణీకుల సంఖ్య శాతాల్లో అధికంగా ఉంది. జూన్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16.3 శాతం పెరిగింది. దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, టికెట్లను తక్కువ ధరలకు ఆఫర్ చేయడం వంటి అంశాలు ఇందుకు కారణమని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అభిప్రాయపడింది. ఇదే సమయంలో అంతర్జాతీయ దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 6.5 శాతం పెరిగింది. -
సిలబస్ మార్పులపై కమిటీ
పోటీ పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్‌లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుత సిలబస్‌లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్‌ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్‌లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం! రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్పీఎస్సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్‌కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్ప్లస్ మ్యాన్‌పవర్ సెల్(ఎస్ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్పీఎస్సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్‌లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు. కమిషన్‌కు పోస్టుల మంజూరు టీఎస్పీఎస్సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్‌కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్‌కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి. -
ఈ తప్పులతో.. తప్పవు తిప్పలు
ఆదాయం ఎంత ఆర్జిస్తున్నా, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనుకున్నా.. కొన్ని తప్పిదాలు దొర్లుతూనే ఉంటాయి. వాటి వల్ల ఆర్థిక పరిస్థితులు చిందర వందర అవుతుంటాయి. ఇలాంటివే కొన్ని తప్పిదాలు, వాటిని ఎదుర్కొనేందుకు తోడ్పడే కొన్ని పరిష్కార మార్గాలు ఇవి. క్రెడిట్ కార్డు బకాయిలు.. క్రెడిట్ కార్డులు వాడకోవడం.. క్రెడిట్ రికార్డు మెరుగ్గా ఉంచుకోవడం అభిలషణీయమే. గడువులోగా సమయానికి కార్డు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేయగలిగితే ఇది మంచిదే. కానీ, తర్వాతెప్పుడో కట్టొచ్చు కదా అన్న ధీమాతో భారీ వస్తువులతో పాటు చిన్నా, చితకా కొనుగోళ్లకు కూడా క్రెడిట్ కార్డు బైటికి తీయడం అలవాటుగా మార్చుకోవద్దు. తీరా కట్టాల్సి వచ్చినప్పుడు సమయానికి డబ్బు సమకూరకపోతే.. బకాయి కొండలా పేరుకుపోతుంది. వడ్డీల మీద వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో చిక్కుకోకూడదంటే.. తర్వాత కట్టొచ్చులే అన్న మైండ్‌సెట్ నుంచి బైటపడాలి. చేతిలో డబ్బు లేనప్పుడు కొనడాన్ని విరమించుకోవడం ఉత్తమం. ఆదాయాన్ని మించిన ఖర్చులు.. దీని గురించి మరీ విడమర్చి చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కొనే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కొన్ని ఖర్చులు అప్పటికి సబబే అనిపించినా.. ఆ తర్వాత ఆలోచిస్తే ఎంత వృథానో అర్థమవుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే.. 2 నెలల బ్యాంకు స్టేట్మెంటు, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు పోల్చి చూడండి. అనవసరమైన వాటిపై ఎంతెంత ఖర్చు చేశామో తెలుస్తుంది. ఈ అలవాటు నుంచి బైటపడాలంటే.. ఆదాయంలో కనీసం పది శాతమైనా పొదుపు చేయడం ప్రారంభించాలి. మిగిలిన మొత్తాన్నే వ్యయాలకు ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులు.. ఆదాయాలకు లోబడే ఉండేలా చూసుకోవచ్చు. రిటైర్మెంట్ ప్రణాళిక లేకపోవడం.. వ్యయాల విషయానికొస్తే.. ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు వగైరా అనేకానేకం ఉంటాయి. వీటి ధ్యాసలో పడి మిగతా అవసరాల కోసం పొదుపు చేయడం పక్కన పెట్టేస్తుంటాం. పిల్లల కాలేజీ ఫీజులు లాంటి ఖర్చుల కోసం కావాలంటే ఎక్కడైనా అప్పు దొరుకుతుంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత అవసరాలకు అప్పు పుట్టడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే, ఆదాయం తగ్గిపోవడం వల్ల తిరిగి చె ల్లించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది కదా. కాబట్టి..రేపో, ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు ఆదరాబాదరాగా పరుగెత్తడం కాకుండా, ముందు నుంచే కాస్త జాగ్రత్తపడాలి. కెరియర్ ప్రారంభం నుంచే రిటైర్మెంటు కోసం కూడా కొంత కొంతగా పక్కన పెడుతుండాలి. -
ఆర్థిక ఆరోగ్యానికి నవ సూత్రాలు
ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా, ఆర్థికంగా పురోగమించాలన్నా ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ప్రణాళిక రూపొందించుకోవడమే కాదు..దాన్ని పాటించడమూ ముఖ్యమే. ఆర్థిక ప్రణాళికకు సంబంధించి కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి: ఖర్చులెప్పుడూ ఆదాయానికన్నా తక్కువగానే ఉండాలన్నది ఒక బండగుర్తు. అయితే, ఇది చెప్పడం ఎంత సులువో .. ఆచరించడం అంత కష్టం. అయినా సరే అందుబాటులో ఉన్న పొదుపు మార్గాలను ప్రయత్నించి చూడాలి. ఆదాయాన్ని పెంచుకోవడం కష్టం కానీ.. కాస్త ప్రయత్నిస్తే ఖర్చులు తగ్గించుకోవడం సులువే. మరో విషయం.. ఉద్యోగంలో జీతానికి సంబంధించి కూడా మీ నైపుణ్యాలను సమీక్షించుకుని, ఉద్యోగ బాధ్యతలను బట్టి సదరు ఉద్యోగానికి ఎంత జీతం అందుకోవాలన్నది లెక్క వేసుకోవాలి. ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు తగ్గినా.. మీరు తక్కువ జీతానికి పనిచేస్తున్నట్లే. బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలి: దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలియకపోతే.. పొదుపు లక్ష్యాలను సాధించలేం కదా. అందుకే, ఖర్చులపై నియంత్రణ సాధించేందుకు బడ్జెట్ అంటూ ఉండాలి. ఆదాయంలో నుంచి ముందుగా కొంత మొత్తం పొదుపునకు కేటాయించండి. మిగిలిన దాంట్లో తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులు, నిత్యావసరాల ఖర్చులు వంటివి చూసుకోవాలి. అప్పటికీ ఇంకా మిగిలితే అప్పుడు మిగతా లగ్జరీలవైపు చూడొచ్చు. చిన్న మొత్తమైనా అసలు పొదుపు చేయడం అన్నది ముఖ్యం. ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత సంపద సమకూరుతుంది. క్రెడిట్ కార్డు వాడకం తగ్గాలి: ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే ప్రధాన అడ్డంకులు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు, పేరుకుపోయే రుణాలు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించడం వల్ల నెల నెలా నగదుపరమైన ఖర్చులు కాస్త పెరిగినట్లు అనిపించినా అంతిమంగా మాత్రం ఎంతో కొంత చేతిలో మిగులుతుంది. పొదుపు వృథా కావొద్దు: మీ ఆదాయాన్ని అత్యంత తక్కువ వడ్డీనిచ్చే సేవింగ్స్ అకౌంట్లలో వృథాగా మురిగిపోనివ్వొద్దు. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ రేట్లను మించి ధరలు పెరిగిపోతుంటాయి. పెపైచ్చు ఈ రకంగా వచ్చే వడ్డీలపై పన్ను పోటు ఉంటుంది. పెట్టుబడుల్లో జాప్యం వద్దు: సాధారణంగా ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనం మెచ్యూర్ అయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని మరోదాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మధ్యలో బోలెడంత జాప్యం జరుగుతుంటుంది. దీని వల్ల సదరు మొత్తంపై రావాల్సిన రాబడులను కోల్పోతుంటాం. అత్యవసర నిధి ఉండాలి: ఏ ఆర్థిక అవసరం ఎప్పుడు ముంచుకొస్తుందో ఊహించలేము. కనుక మొత్తం డబ్బంతా ఏదో ఒకదాంట్లో ఇన్వెస్ట్ చేసేయడమో లేదా ఖర్చు చేసేయడమో చేయకుండా.. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కనీసం 3 నుంచి ఆరు నెలల అవసరాలకు తగిన ంత డబ్బు ఈ ఫండ్‌లో ఉండేలా చూసుకోవాలి. బీమా తప్పనిసరి: కుటుంబ పెద్దగా తమకేదైనా అనుకోనిది జరిగితే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతనూ విస్మరించకూడదు. ఇందుకోసం ఎప్పటికప్పుడు తగినంత బీమా కవరేజీ ఉందా లేదా అన్నది సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వీలునామా: కూడబెట్టినది ఎంతైనా సరే.. తమపై ఆధారపడి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికోసం కచ్చితంగా వీలునామా రిజిస్టరు చేయించి ఉంచాలి. అలాగే, ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే.. వారసులకు తగిన న్యాయం చేసినట్లవుతుంది. ప్రతి దానికీ రికార్డు ఉండాలి.. జమా, ఖర్చులేవైనా సరే ప్రతి దానికీ కచ్చితంగా రికార్డు పాటించాలి. అప్పుడే పన్ను పరమైన డిడక్షన్స్ తీసుకోవడానికి సాధ్యపడుతుంది. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.