వనపర్తి క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ మధుసూదన్ కథనం ప్రకారం.. వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వింటోంది.
ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యా లయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు.
తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లోనే మధ్యాహ్నం ఉరేసుకొని చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment