ఈ తప్పులతో.. తప్పవు తిప్పలు
ఆదాయం ఎంత ఆర్జిస్తున్నా, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనుకున్నా.. కొన్ని తప్పిదాలు దొర్లుతూనే ఉంటాయి. వాటి వల్ల ఆర్థిక పరిస్థితులు చిందర వందర అవుతుంటాయి. ఇలాంటివే కొన్ని తప్పిదాలు, వాటిని ఎదుర్కొనేందుకు తోడ్పడే కొన్ని పరిష్కార మార్గాలు ఇవి.
క్రెడిట్ కార్డు బకాయిలు..
క్రెడిట్ కార్డులు వాడకోవడం.. క్రెడిట్ రికార్డు మెరుగ్గా ఉంచుకోవడం అభిలషణీయమే. గడువులోగా సమయానికి కార్డు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేయగలిగితే ఇది మంచిదే. కానీ, తర్వాతెప్పుడో కట్టొచ్చు కదా అన్న ధీమాతో భారీ వస్తువులతో పాటు చిన్నా, చితకా కొనుగోళ్లకు కూడా క్రెడిట్ కార్డు బైటికి తీయడం అలవాటుగా మార్చుకోవద్దు. తీరా కట్టాల్సి వచ్చినప్పుడు సమయానికి డబ్బు సమకూరకపోతే.. బకాయి కొండలా పేరుకుపోతుంది. వడ్డీల మీద వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో చిక్కుకోకూడదంటే.. తర్వాత కట్టొచ్చులే అన్న మైండ్‌సెట్ నుంచి బైటపడాలి. చేతిలో డబ్బు లేనప్పుడు కొనడాన్ని విరమించుకోవడం ఉత్తమం.
ఆదాయాన్ని మించిన ఖర్చులు..
దీని గురించి మరీ విడమర్చి చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కొనే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కొన్ని ఖర్చులు అప్పటికి సబబే అనిపించినా.. ఆ తర్వాత ఆలోచిస్తే ఎంత వృథానో అర్థమవుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే.. 2 నెలల బ్యాంకు స్టేట్‌మెంటు, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లు పోల్చి చూడండి. అనవసరమైన వాటిపై ఎంతెంత ఖర్చు చేశామో తెలుస్తుంది. ఈ అలవాటు నుంచి బైటపడాలంటే.. ఆదాయంలో కనీసం పది శాతమైనా పొదుపు చేయడం ప్రారంభించాలి. మిగిలిన మొత్తాన్నే వ్యయాలకు ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులు.. ఆదాయాలకు లోబడే ఉండేలా చూసుకోవచ్చు.
రిటైర్మెంట్ ప్రణాళిక లేకపోవడం..
వ్యయాల విషయానికొస్తే.. ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు వగైరా అనేకానేకం ఉంటాయి. వీటి ధ్యాసలో పడి మిగతా అవసరాల కోసం పొదుపు చేయడం పక్కన పెట్టేస్తుంటాం. పిల్లల కాలేజీ ఫీజులు లాంటి ఖర్చుల కోసం కావాలంటే ఎక్కడైనా అప్పు దొరుకుతుంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత అవసరాలకు అప్పు పుట్టడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే, ఆదాయం తగ్గిపోవడం వల్ల తిరిగి చె ల్లించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది కదా. కాబట్టి..రేపో, ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు ఆదరాబాదరాగా పరుగెత్తడం కాకుండా, ముందు నుంచే కాస్త జాగ్రత్తపడాలి. కెరియర్ ప్రారంభం నుంచే రిటైర్మెంటు కోసం కూడా కొంత కొంతగా పక్కన పెడుతుండాలి.