ఆరోగ్యశ్రీలక్ష్మి | Sri Lakshmi coming to Hyderabad in 1997 was a turning point in her life | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలక్ష్మి

Published Mon, Jun 10 2019 2:38 AM | Last Updated on Mon, Jun 10 2019 2:38 AM

Sri Lakshmi coming to Hyderabad in 1997 was a turning point in her life - Sakshi

‘ఎలా ఉన్నావ్‌..’ అని అడుగుతాం ఆత్మీయులు ఎదురైతే. శ్రీలక్షి అడగరు... చూస్తారు. ఎలా ఉన్నారో ఆమెకు తెలిసిపోతుంది! డాక్టర్‌లు స్టెతస్కోప్‌ పెట్టి కనిపెడతారు. డాక్టరు కాని శ్రీలక్ష్మి మనసు పెట్టి  గ్రహిస్తారు. అభాగ్యులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తారు. అందుకే ఆమెకు శ్రీలక్ష్మి కాదు...
ఆరోగ్యశ్రీలక్ష్మి అన్నదే తగిన పేరు.

దాసరి శ్రీలక్ష్మీరెడ్డి పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో. పెళ్లితో ఖమ్మం జిల్లా కోడలయ్యారామె. పిల్లల చదువు కోసం 1997లో హైదరాబాద్‌కి రావడం ఆమె జీవితంలో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అప్పటి వరకు ఆమె సాధారణమైన గృహిణి, రుద్రాక్షపల్లిలోని పెద్ద భూస్వామి కుటుంబం కోడలు. ఇదే ఆమె గుర్తింపు. భర్త, ముగ్గురు పిల్లలతో ఇల్లే ప్రపంచంగా గడిచిపోయింది. కుటుంబం హైదరాబాద్‌ రావడంతో ఆమెలో ఉన్న సోషల్‌ వర్కర్‌ బయటికొచ్చింది. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆమెను సమాజం కోసం పనిచేసేలా తీర్చిదిద్దింది. సామాజిక కార్యకర్తగా మలిచింది.

పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని నమ్ముతారామె. అనారోగ్యాలు మనిషి ఆర్థిక పరిస్థితులను చూసి ఆగిపోవు. డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరని... జబ్బులు దరిచేరకుండా ఉండవు. అందుకే ఆరోగ్యం అందించడానికి ఎక్కువగా కృషి చేశారు శ్రీలక్ష్మి. అన్ని అనారోగ్యాల కంటే కంటి చూపు దెబ్బతినడం నిజంగా శాపమే. అందుకే దృష్టిలోపం ఉన్న పేదవాళ్లకు మెరుగైన కంటి చికిత్సను అందించడం మొదలుపెట్టారు. అలా దోమల్‌గూడలోని సాధూరామ్‌ కంటి ఆసుపత్రి సేవను నిరుపేద కాలనీలకు చేర్చడానికి వారధి అయ్యారు శ్రీలక్ష్మి.

డాక్టర్ల సహకారంతో వారాంతాల్లో కాలనీల్లో హెల్త్‌క్యాంపులు పెట్టించారు. పేషెంట్‌ మందులు, కళ్లద్దాలకు అయ్యే ఖర్చును ఇప్పటికీ ఆమే పెట్టుకుంటున్నారు. ఆపరేషన్‌ అవసరమైన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయించే వరకు ఆ పేషెంట్‌ బాధ్యత ఆమెదే. కాలనీలో మెడికల్‌ క్యాంపులో ఉచితంగా సర్వీస్‌ ఇవ్వడానికి డాక్టర్లు సంతోషంగా అంగీకరించేవారు, కానీ కాలనీవాసులను వైద్య పరీక్షకు తీసుకురావడమే పెద్ద సవాల్‌గా ఉండేదని అన్నారు శ్రీలక్ష్మి.

నా గుర్తింపు నేనే
‘‘నన్ను నేను... ఫలానా ఇంటి ఆడపడుచుని, ఫలానా ఇంటి కోడలిని, ఫలానా లాయర్‌ భార్యని అని, కలెక్టర్‌ తల్లి, డాక్టర్‌ తల్లి... అని పరిచయం చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. అలాగని ఆ గుర్తింపుల దగ్గరే ఆగిపోకూడదని కూడా అనుకున్నాను. నా గుర్తింపును నేనే అవాలని నా కోరిక. అందుకు రామకృష్ణ మఠం నాకు ఒక మార్గాన్ని చూపించింది. ఆ దారిలో నాకు చేతనైనంతగా సహాయం చేస్తున్నాను. దోమల్‌గూడ, మహబూబ్‌నగర్, కొడంగల్, కోస్గి, రావులపల్లి, కరీంనగర్‌లలో సర్వీస్‌ చేశాను. నేను కనిపించగానే ‘లక్ష్మక్కా!’ అని నోరారా పిలిచి వాళ్ల బాధలు చెప్పుకుంటారు.

మొదట్లో వైద్య శిబిరాలకే పరిమితమయ్యాను. కానీ కాలనీల్లో తిరుగుతున్నప్పుడు వాళ్లు ఎదుర్కొనే అనేక సామాజిక సమస్యలు కూడా తెలిశాయి. అందుకోసమే నేను నడుపుతున్న ‘శ్రీలక్ష్మి స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’ ఆఫీస్‌లో న్యాయసలహా విభాగం కూడా ఏర్పాటు చేశాను. ‘మహిళా సమస్యలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు– చైతన్యం’ కూడా నా సర్వీస్‌లో భాగమయ్యాయి.

ఖైదీలకు వైద్యం
అల్పాదాయ వర్గాల కాలనీల్లో పని చేయడం ఒక ఎత్తయితే చంచల్‌గూడ జైలు ఖైదీలకు వైద్య సహాయం చేయడం మరో ఎత్తు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వైద్యపరీక్షలు చేయించడానికి జైలు అధికారులు అనుమతిచ్చారు. డాక్టర్ల బృందంతో జైల్లో పరీక్షలు నిర్వహించాం. అయితే సమస్య అంతా... వాళ్లకు ఆపరేషన్‌లు చేయించడం దగ్గర మొదలైంది. అప్పటి వరకు పేదవాళ్లకు సాధూరామ్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేయించేదాన్ని. ఖైదీలను బయటి హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు, ప్రభుత్వ వైద్యశాలలోనే చేయించాలని తెలిసింది. ఖైదీలకు కంటి ఆపరేషన్‌లు చేయడానికి సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రి వైద్య అధికారులు తేదీలు ఖరారు చేశారు.

అయితే వాళ్లను జైలు నుంచి బయటికి పంపించడానికి నిబంధనలు చాలా పటిష్టంగా ఉంటాయి. హోమ్‌ మంత్రిని కలిసి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ‘ఆపరేషన్‌ తర్వాత జైలుకి తరలించే వరకు బాధ్యత వహిస్తానని, ఆ ఖైదీల్లో ఎవరైనా పారిపోతే నాదే పూచీకత్తు’ అని రాసి సంతకం చేసిన తర్వాత పంపించారు. ఖైదీలకు వైద్యం కోసం ఇంత రిస్క్‌ చేశానని తెలిసి ‘ముందు వెనుక ఆలోచించకుండా చేస్తూ పోవడమేనా’ అని మావాళ్లు కోప్పడ్డారు.

మనమే దారి చూపించాలి
హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత దాదాపుగా కొత్త ప్రపంచాన్ని చూశాననే చెప్పాలి. ‘ట్రైనింగ్‌’ అనే ప్రకటన కనిపిస్తే చాలు.. వెళ్లిపోయేదాన్ని. ఫినాయిల్, సోప్‌ ఆయిల్, ఇతర క్లీనింగ్‌ మెటీరియల్‌ తయారీతోపాటు బ్యూటీషియన్‌ కోర్సు, చిప్స్‌ తయారీ, క్యాండిల్‌ మేకింగ్, కంప్యూటర్‌ కోర్సు కూడా చేశాను. నేను నేర్చుకున్నవన్నీ పేద మహిళలకు నేర్పిస్తున్నాను. భర్త తాగుడుకు బానిసయ్యి, పిల్లలను పోషించలేక ఆత్మహత్యకు పాల్పడే వాళ్లను చూసినప్పుడు మనసు పిండేసినట్లయ్యేది. ‘మనిషిలో జీవనోత్సాహం ఉండాలి. మరణం దేనికీ సమాధానం కాదు’... ఈ మాట చెప్పడానికే ‘వై వియ్‌ డై... హౌ వియ్‌ లివ్‌’ అని కౌన్సెలింగ్‌ కూడా మొదలు పెట్టాను.

అయితే... చనిపోవాలనుకునే వాళ్లకు బతుకు మీద ఆశ కలిగించడంతో మన బాధ్యత తీరిపోదు, వాళ్లకు బతకడానికి ఒక దారి చూపించగలిగితేనే ఒక జీవితాన్ని కాపాడిన వాళ్లమవుతాం. నిజానికి బతకడానికి దారి తెలిస్తే ఎవరూ చనిపోవాలనుకోరు కూడా. అందుకే ఆ మహిళలకు నేను నేర్చుకున్న స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నాను. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించడంతోపాటు, ఆ మహిళలు తయారు చేసిన ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి వాటిని మార్కెట్‌ చేయడానికి హాస్పిటళ్లతో మాట్లాడడం కూడా నేనే. నా భర్త స్నేహితుల్లో చాలామంది డాక్టర్లు ఉండడం నాకు బాగా ఉపయోగపడింది.

మహిళా ఖైదీలకు కూడా కుటీర పరిశ్రమ నిర్వహణకు అవసమైన స్కిల్‌ ట్రైనింగ్‌ ఇచ్చాను. కార్పెంటరీ, స్వెటర్‌ అల్లకంలో కూడా శిక్షణ ఇప్పించాం. ఐఏఎస్‌ ఆఫీసర్‌ రామలక్ష్మిగారి సహాయంతో ఆ మహిళా ఖైదీలకు లోన్‌లు ఇప్పించాను. సమాజం కోసం చేసిన ప్రతి పనిలోనూ నేను ఆనందాన్ని ఆస్వాదించాను. అయితే  బెగ్గర్స్‌ రీహాబిలిటేషన్‌ చేసేటప్పుడు ఒక్కోసారి సహనానికి పరీక్షగా ఉండేది. వాళ్లకు హోమ్‌లో షెల్టర్‌ ఇచ్చి తిండి, దుస్తులు ఇస్తుంటే... వాళ్లు మాత్రం గంజాయి ఇప్పించమని ఒకరు, సిగరెట్‌ లేకపోతే ఉండలేమని కొందరు సతాయించేవాళ్లు.

నా కూతురు చెప్పిన మాట
సోషల్‌ లైఫ్‌లో ఎదురయ్యే అనేకానేక పురస్కారాలు, తిరస్కారాల గురించి మా అమ్మాయి ఒకటే మాట చెప్తుండేది. ‘ఎవరైనా సరే... తమకు ప్రత్యేకంగా గుర్తింపు రావాలని కోరుకుంటే చాలదు. ఆ వ్యక్తి ఆ గౌరవానికి తగిన వ్యక్తి అని ఎదుటి వాళ్లకు అనిపించాలి. అదే అసలైన గుర్తింపు’ అని, డిజర్వ్‌కీ డిజైర్‌కీ మధ్య తేడా తెలుసుకోవాలని చెప్తుంటుంది. నేను పెంచిన పాపాయి.. ఇంత పరిణతితో మాట్లాడుతుంటే నా పెంపకంలో ఇంతటి సంస్కారంతో పెరిగిందా లేక తను నేర్చుకున్న మంచి భావాలతో తనే నన్ను తీర్చిదిద్దుతోందా అనిపిస్తుంటుంది. మనం వేదిక మీద ఒక పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు మనసులో ‘‘అవును, ఈమె చాలా సేవ చేసింది. ఫలానా చోట ఫలానా సర్వీస్‌ చేయడం మాకు తెలుసు’’ అనుకోవాలి. అదే అసలైన గౌరవం. అవార్డులు అందుకుంటున్నప్పుడు నాకు మా అమ్మాయి చెప్పిన మాట గుర్తుకు వస్తుండేది.

ప్రతి పురస్కారమూ ఎంతో కొంత సంతోషాన్నిచ్చి తీరుతుంది. ఆ జ్ఞాపికను చూసినప్పుడు దాని వెనుక ఉన్న నా శ్రమ గుర్తుకు వస్తుంటుంది. అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది మాత్రం వైఎస్‌ఆర్‌ చేతుల మీద పురస్కారం అందుకోవడమే. అది కూడా ఎంత కాకతాళీయంగా జరిగిందంటే... రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రదానం జరుగుతోంది. నన్ను ఉత్తమ సోషల్‌ వర్క్‌ అవార్డుకు ఎంపిక చేశారు. నేను వెళ్లడం కొంచెం ఆలస్యమైంది. వైఎస్‌ఆర్‌ గారు రావడం కూడా ఆలస్యం కావడంతో కార్యక్రమం సమయానికి జరగాలనే ఉద్దేశంతో మంత్రుల చేతుల మీదుగా మొదలు పెట్టమని చెప్పార్ట వైఎస్‌ఆర్‌. నేను అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళ్లేటప్పటికి ఆయన కూడా వచ్చేశారు. ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. ఆయన చేతుల మీద అవార్డు అందుకునే అదృష్టం ఉండడంతోనే నేను కార్యక్రమానికి ఆలస్యమైనట్లున్నాను.

ఆయన నన్ను చూసి ‘ఇక్కడ కూడా ఉన్నావా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా పిచ్చితల్లీ’ అని నవ్వారు. అంతకు ముందు నేను చాలాసార్లు భర్త చేతిలో మోసపోయిన అమ్మాయిలకు న్యాయం చేయమని ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. వైఎస్‌ఆర్‌ ఆ మహిళలతో మాట్లాడి ‘కేసు డీల్‌ చేయమని సబితమ్మకు రాస్తున్నాను. వీళ్లను సబితమ్మ దగ్గరకు తీసుకెళ్లు’ అని పంపించేవారు. అందుకే ఆయన నన్ను అవార్డుల వేదిక మీద చూడగానే ఆ మాటన్నారు. అప్పుడు నేను ‘నాకు స్ఫూర్తి మీరే, మీరు చేసినంత చేయలేను, కానీ నేను చేయగలిగినంత చేస్తాను’ అని చెప్పాను. అప్పుడు తీసిన ఈ ఫొటో చూసుకుంటే ఆయన మాటలు ఇప్పుడు వింటున్నట్లే ఉంటుంది’’ అంటూ వైఎస్‌ఆర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫొటో చూపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు శ్రీలక్ష్మి.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: కె. రమేశ్‌ బాబు

అత్తగారి వర్ధంతికి పేదవారుండే కాలనీల్లో చీరల పంపిణీ, మామగారి పేరు మీద ఆయన వర్ధంతి రోజున సొంతూరు రుద్రాక్షపల్లిలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం శ్రీలక్ష్మికి ఇష్టమైన వ్యాపకాలు. ‘‘ఇన్నేళ్లుగా నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నాలో పని చేయాలనే తపన ఉండడం, ఇంత ఖర్చు ఎందుకు అనకుండా మా వారు డబ్బివ్వడమే’’ నంటారామె నవ్వుతూ. పెద్ద కొబ్బరి బోండాలు పండించినందుకు హార్టికల్చర్‌ శాఖ నుంచి ఉత్తమ వ్యవసాయదారుల అవార్డు భర్తతో కలిసి అందుకున్నారు శ్రీలక్ష్మి. వర్మీ కంపోస్టు తయారీ, వేస్ట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో సర్వీస్‌కి రాష్ట్రపతి అవార్డు, రామకృష్ణమఠం ఉత్తమ సోషల్‌ వర్కర్‌ అవార్డు, సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో ముగ్గుకి ఫస్ట్‌ ప్రైజ్‌ (గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఫొటోలు, మధ్యలో వైఎస్‌ఆర్‌ ఫొటోతో వేసిన థీమ్‌ ముగ్గు) అందుకోవడం శ్రీలక్ష్మికి అమూల్యమైన సందర్భాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement