సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని హేళన చేసిన టీడీపీ అగ్ర నాయకత్వం ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి జీవనాధారమైన రంగం వృద్ధి రేటును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధిని అంచనా వేసేందుకు స్థిరమైన ధరలను వినియోగిస్తారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రస్తుత ధరలపై వృద్ధి రేట్లతో వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అంచనాలకు మించి పనితీరు
సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే యనమల కరోనా సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోవిడ్ వల్ల 2020–21లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలియదా? గత సర్కారు వైదొలగే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 2017–18లో 10.09 శాతం వృద్ధి రేటు ఉంటే 2018–19లో 4.88 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–20లో రాష్ట్రం 7.23 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2019–20లో రాష్ట్రం వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవారంగంలో 6.20 శాతం వృద్ధితో అంచనాలకు మించి పనితీరు కనబరిచింది.
నిరుద్యోగంపైనా తప్పుడు లెక్కలే
రాష్ట్రంలో 6.5 శాతం నిరుద్యోగ రేటు ఉందని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగ రేటు (15 – 59 ఏళ్ల వయసు) 2018–19లో 5.7 శాతం ఉంటే 2019 –20లో 5.1 శాతానికి తగ్గింది. యనమల తప్పుడు లెక్కలతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దురదృష్టకరం.
ఎస్‌డీజీల్లో మరింత మెరుగ్గా 3వ ర్యాంకు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ, పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనలో రాష్ట్రం మెరుగుపడలేదంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2018–19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 2019 –20, 2020–21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో ఏపీ మెరుగ్గా 3వ స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రం పెర్ఫార్మర్ కేటగిరీలో ఉంటే ఇవాళ ఫ్రంట్‌రన్నర్ కేటగిరీకి ఎదిగాం.
67 నుంచి 81కి పెరిగిన మార్కులు
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పేదరిక నిర్మూలనలో 5వ స్థానంలో నిలిచి ఎస్‌డీజీ మార్కులను 67 నుంచి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకుని పేదలను కరోనా కష్టకాలంలో కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అసమానత 32 నుంచి 43 శాతానికి పెరిగిందని ఆరోపణలు చేస్తున్న యనమల ఏ లెక్కల ప్రకారం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. చెప్పే సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుకూల మీడియాలో పత్రికా ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదు. ఎస్‌డీజీ సూచీల్లో అసమానతల తగ్గింపు ఆశయంలో రాష్ట్రం 2018–19లో 15వ స్థానంలో ఉండగా 2020 – 21లో 6వ స్థానానికి మెరుగుపడింది.
జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలి
►45వ కౌన్సిల్ సమావేశంలో కేంద్రానికి ఆర్థిక మంత్రి బుగ్గన వినతి
సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్ర పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు తగ్గిపోవడంతో 2022 తర్వాత కూడా పరిహారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌన్సిల్‌కు తెలియచేశారు. జీఎస్టీ అమలుకు ముందు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో సగటు వృద్ధి రేటు 14 నుంచి 15 శాతం ఉండగా 2017లో జీఎస్టీ అమలు నాటి నుంచి 10 శాతానికి పరిమితమైందని బుగ్గన వివరించారు. దీంతో ఏటా పరిహారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, కోవిడ్ సంక్షోభంతో గత రెండేళ్లుగా జీఎస్టీ ఆదాయం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 14 శాతం వృద్ధి రేటు కంటే తక్కువగా నమోదైన మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే విధానాన్ని 2022 తర్వాత కూడా కొనసాగించాల్సిందిగా కోరారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాట్ పరిధిలో ఉన్న రెండు ఉత్పత్తులను అదేవిధంగా కొనసాగించాల్సిందిగా కోరారు.
ఆగస్టు వరకు పరిహారాన్ని త్వరగా ఇవ్వాలి
ప్రస్తుతం నాపరాళ్లపై 18 శాతంగా ఉన్న పన్నును 5 శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తిపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సోలార్ పవర్, లిక్కర్ తయారీలో జాబ్ వర్క్‌లపై పన్ను రేట్లను తగ్గించాల్సిందిగా బుగ్గన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోయిందని, సంక్షేమ పథకాలు సజావుగా అమలు కోసం ఆగస్టు వరకు జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment