Minister Buggana Rajendranath Comments On Yanamala Ramakrishnudu - Sakshi
Sakshi News home page

‘యనమల’ పిల్లి శాపాలు.. ఉనికి చాటుకునేందుకేనా?

Published Sun, Oct 9 2022 12:06 PM | Last Updated on Sun, Oct 9 2022 12:49 PM

Minister Buggana Rajendranath Comments On Yanamala Ramakrishnudu - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏపీలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని.. అది చూసి ఓర్వ లేక యనమల రామకృష్ణుడు, ఇతర టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. సీఎం జగన్‌ పాలనపై  యనమల రామకృష్ణుడు దుమ్మెత్తి పోయడం చూస్తే.. పిల్లి శాపాలు.. అనే సామెత గుర్తుకు వస్తోందన్నారు.  ‘పిల్లి శాపాలకు ఉట్లు తెగవు’ అనేది యనమల మాటలకు అక్షరాలా సరిపోతుందన్నారు.
చదవండి: ఆ అగ్రిమెంట్‌లో తప్పేముంది?   

కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇపుడేమో.. నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారు. సానుకూల దృక్పథం (పాజిటివ్‌ అప్రోచ్‌) అనేది వారి పదకోశం (డిక్షనరీ)లోనే ఉన్నట్లుగా లేవు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పనిలో నిరంతరం మేము నిమగ్నమై ఉంటే మా పై రాళ్లేయడమే ఈ బ్యాచ్‌ పనిగా కనుపిస్తోంది. 

ఏఏ దేశాల్లో పరిస్థితులు బాగ లేవో మరీ వెతికి పట్టుకుని అలాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వస్తాయని, ప్రజలు నానా అగచాట్లు పడాలని టీడీపీ నేతలు నిరంతరం కోరుకుంటున్నట్లుగా ఉంది. అందుకే నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తూనే... మరో వైపు అభివృద్ధి వైపు మేము దృష్టి సారిస్తూ ఉంటే... శాపనార్థాలు పెట్టడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి నిప్పులు చెరిగారు.

‘‘యనమల 2020-21 సంవత్సర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే పదే పదే మాట్లాడతారు. సామి అది కరోనా సంవత్సరం అని చెప్పిన కూడా పదే పదే 2020-21 గురించే మాట్లాడతారు. కరోనా ఎదుర్కొని ప్రజలను కాపాడుకొని 2021-22 లో మెరుగు చెందితే టీడీపీ నాయకులూ మాత్రం కరోనా సంవత్సరం కష్టాలు ఉండాలని కోరుకుంటున్నారు. 2020–21 సంవత్సరంలో ఎందుకిలా జరిగిందో.. రాష్ట్ర ప్రజలకు తెలియని అంశం కాదు.

ఆనాడు కోవిడ్‌ మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. మన రాష్ట్రంలో కూడా విలయతాండవం చేసింది. రాష్ట్రంలో జనజీవితం అతలాకుతలం అయింది. తత్ఫలితంగా ఆదాయవనరులకు బాగా గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ 8 వేల కోట్లు తగ్గింది. కరోనా సమయంలో మహామ్మారి కట్టడికి, కోవిద్ వైద్యానికి, టెస్టింగ్ కి, కోవిద్ కేర్ సెంటర్ లు నిర్వహించడం, ఉచిత బియ్యం సరఫరా అదనంగా రూ 7,130 కోట్లు వ్యయం చేసింది.  వీటి తో పాటు నవరత్నాలు అమలు చేయడంలో ఎక్కడ వెనకడుగు వేయలేదని’’ మంత్రి అన్నారు.

రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి కదల లేకపోయారు. అంతే కాదు, పేద, మధ్య తరగతి కుటుంబాలు కోవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయి సురక్షితంగా ఉండటానికి తాపత్రయపడ్డారు. ఇలాంటి తరుణంలో వారందరి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఓ వైపు ఆదాయ వనరులు పడిపోతున్నా.. ఏ మాత్రం జంకకుండా సాహసంతో డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమ చేసి వారిని ఆదుకున్నాం. ఇంత మొత్తంలో ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమ చేసిన సందర్భం ఎక్కడా కోవిడ్‌ సమయంలో లేనే లేదు.

టీడీపీ హయాంలో అప్పులు అసాధారణంగా పెరిగాయి
ఐదేళ్ళ టీడీపీ హయాం లో (2014-19) చేసిన అప్పులు 19.6% పెరిగితే, వైస్సార్సీపీ హయాం లో (2019-22) మూడు సంవత్సరాలలో, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు  తీసుకున్న అప్పులు తో కలుపుకొని  చేసిన అప్పులు ( రెండు సంవత్సరాల కోవిడ్ కష్టాలను ఎదుర్కొని కూడా) 15.5% మాత్రమే పెరిగాయి. ఐదేళ్ళ టీడీపీ హయాం లో (2014-19)  ఏ రకమైన ఆర్ధిక ఇబ్బందులు లేకుండా కూడా 19.6% వృద్ధితో అప్పు చేశారు. ఐదేళ్ళ టీడీపీ పాలనలో అమలు చేసిన ఆర్ధిక విధానాలతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వములో ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి. ఎన్ని ఇబ్బందులున్నా వీటిని సమన్వయం చేస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.

గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ సంయోజిత వార్షిక ఎదుగుదల రేటు (CAGR) 9.89 % పెరిగినప్పుడు, మన రాష్ట్ర CAGR 16.80% పెరిగింది.. అదే మన ప్రభుత్వ హయాం లో  కేంద్ర ప్రభుత్వ CAGR 14.37% పెరిగిన కూడా మన రాష్ట్ర CAGR 13.28% మాత్రమే పెరిగింది.. CAG నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది.

యనమలకి రాష్ట్ర అప్పులు 8,00,000 కోట్లు అనే లెక్కలు ఎక్కడ నుండి వచ్చాయో మాకు తెలీదు. అది పచ్చి అబద్ధం.. మీరు, మీ వక్తలు కాదు, వాస్తవాలు, గణాంకాలతో రుజువు చేయగలరా? రాష్ట్ర అప్పు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల తీసుకున్న అప్పులు తో కలుపుకొని  1,71,176  కోట్ల . ఈ విషయాన్ని  ముఖ్యమంత్రి అసెంబ్లీ లో వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోతూ రూ.40,000 కోట్ల వర్కుల బిల్లులను పెండింగ్ పెడితే ఆ బిల్లులు మన ప్రభుత్వంపై పెనుభారం అయ్యాయి. విద్యుత్తు కొనుగోలు, పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పును రూ. 46,200 కోట్లు మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు.

దురదృష్టకరమైన రాష్ట్ర విభజన, అనంతర టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పరిపాలన, కోవిడ్‌ మహమ్మారి విలయతాండవం వంటి కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. అర్థిక పరిస్థితి ఇలా దెబ్బ తిన్నప్పటికీ మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ గతంలో తలెత్తిన ఇబ్బందికరమైన పరిస్థితులను చక్కదిద్దుతూ వస్తోంది.

వైసీపీ ప్రభుత్వంలో మూల ధన వ్యయం మెరుగుపడింది
మూలధన వ్యయం గురించి వాస్తవ అంకెలను సీఎం అసెంబ్లీలో  వివరించారు. సగటు 2014-19 లో మూలధన వ్యయం సంవత్సరానికి రూ.15,227 కోట్లు కాగా మా ప్రభుత్వంంలో 2019 నుండి ఇప్పటి వరకు సగటు గా రూ.18,362 కోట్లు. మేము చేసిన మూల ధన వ్యయం ముఖ్యంగా - విద్య, ఆరోగ్యంపై చేయడం జరిగింది. కానీ వారి ప్రభుత్వం కాలంలో దేని పైన వారు దేనిపై వ్యయం చేశారో తెలియదు. ఒక నిర్దేశిత దిశా లేదు.  ఒక నిర్దేశిత లక్ష్యం లేదు. ఒక వేళ లక్ష్యం ఉన్న, అది అసాధ్యమైన లక్ష్యం. రోడ్ల నిర్మాణాలు, నాడు- నేడు క్రింద స్కూల్స్ మరియు ఆసుపత్రుల ఆధునీకరణ, గ్రామ సచివాలయాలు నిర్మాణం, హెల్త్ క్లినిక్ల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, మొదలగు అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం.

అప్పపై వడ్డీ మరియు వడ్డీ రేట్లు
వడ్డీ శాతం వారి హయాం లో సగటు గా 8.49% కి వారు అప్పు తెస్తే, మేము అధికారంలోకి వచ్చాక 6.96 % కె అప్పు తెచ్చాము.. అంతే చెల్లించే వడ్డీ శాతం కూడా 1.5 % తగ్గింది. వడ్డీలు కడుతున్నాము.. ఎందుకు కడుతున్నాము?.. మీరు ఎడ పెడా చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాము.. మీ హయాం లో రకరకాల కార్పొరేషన్ లు పెట్టి అప్పుల రూపం లో ప్రజా ధనాన్ని పక్క దోవ పట్టించలేదా? రైతు సాధికార సంస్థ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పవర్ సెక్టర్, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ అన్నవి పెట్టి అప్పును దారి మళ్లించింది మీరు కాదా అని నేను అడుగుతున్న?

వైసీపీ ప్రభుత్వంలో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి
మా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద మరియు మధ్యతరగితి ప్రజలకు నేరుగా సుమారు రూ 1,70,000 కోట్ల డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం.

గత ప్రభుత్వ హయాం లో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు,  రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న వారిని లబ్దిదారునిగా ఎంచుకున్నారు. లక్ష్యం నిర్ణీతం. అర్హత ఉన్నా కూడా ఫలాలు అందేవి కావు.. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హత ఉంటే చాలు. 

వైసీపీ హయాంలో ఆర్ధిక నిర్వహణ మెరుగు పడుతుంది
వేస్ అండ్ మీన్స్ అన్నది రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన సదుపాయం. ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్ని సార్లైనా వేస్ అండ్ మీన్స్ కు వెళ్ళవచ్చు. మేము కనక నిబంధనలకు విరుధంగా వెళితే ఎందుకు అనుమతిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవడం తిరిగి చెల్లించడం జరుగుతువుంది. ఇది అదనపు అప్పు కాదు. 2018 -19 సంవత్సరం లో మీకు ఒకసారికి 1510 కోట్లు ప్రకారం 144 రోజులు OD అనుమతి చేస్తే.. మీరు 19,654 కోట్లు OD తీసుకున్నారు. అంటే 107 రోజులు (74.30%) మీరు OD పొందారు. 

2019 -20  సంవత్సరం లో మాకు  ఒకసారికి 1510 కోట్లు ప్రకారం 144 రోజులు OD అనుమతి చేస్తే.. మేము 17631 కోట్లు OD తీసుకున్నాము. అంటే 57 రోజులు (39.58%) మేము OD పొందాము. 2020 -21  సంవత్సరం లో మాకు  ఒకసారికి 2416 కోట్లు ప్రకారం 200 రోజులు OD అనుమతి చేస్తే.. మేము 31812 కోట్లు OD తీసుకున్నాము. అంటే 103 రోజులు (51.50%) మేము OD పొందాము. మరి మీరు చెప్పే కాకి లెక్కలు (330 రోజులు) ఎక్కడ నుండి వచ్చాయి?’ అని మంత్రి రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement