ఉద్దేశ పూర్వకంగానే ప్రజలకు తప్పుడు సమాచారం | Buggana Rajendranath Comments On Yanamala and other TDP Leaders | Sakshi
Sakshi News home page

ఉద్దేశ పూర్వకంగానే ప్రజలకు తప్పుడు సమాచారం

Published Wed, Jul 15 2020 3:33 AM | Last Updated on Wed, Jul 15 2020 7:38 AM

Buggana Rajendranath Comments On Yanamala and other TDP Leaders - Sakshi

టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి అంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు. లేని అభివృద్ధిని కాగితాల్లో చూపారు. ఇప్పుడు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వృద్ధి రేటు తగ్గిపోయిందంటున్నారు. ఇది నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా? టీడీపీ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలతో పోల్చితే వరుసగా తగ్గిపోయింది. ఆస్తులు తగ్గిపోయి అప్పులు పెరిగాయి.  

సాక్షి, అమరావతి: ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దీని వల్ల ఆయన ప్రజల్లో మరింత చులకనవుతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. గత 13 నెలల కాలంలో సీఎం జగన్‌ నవరత్నాల ద్వారా 3.99 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.43,603 కోట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఆర్థిక ప్రగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అప్పులు, రాష్ట్ర ఆదాయం, బడ్జెట్‌ వ్యయం, రెవెన్యూ, ద్రవ్య లోటు అంశాల్లో యనమల చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని కొట్టి పారేశారు. విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
  
టీడీపీ హయాంలో అన్నీ కోతలే 
సంక్షేమం విషయంలో టీడీపీ హయాంలో అన్నీ కోతలే. సీఎం జగన్‌ హయాంలో ఇవ్వడమే తప్ప కోతలు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు నవరత్నాల ద్వారా రూ.30,883 కోట్లు ఇచ్చాం. టీడీపీ 2018–19లో ఆ వర్గాలకు ఇచ్చింది కేవలం రూ.5,689 కోట్లే.   
– కాపులకు చంద్రబాబు ఐదేళ్ల హయాంలో రూ.3,150 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.2000 కోట్లే. మా ప్రభుత్వం గత 13 నెలల్లో కాపులకు రూ.2,800 కోట్లు వ్యయం చేసింది.  
 
స్థూల ఉత్పత్తి – వాస్తవాలు 
– 2017–18లో జీఎస్‌డీపీ రూ.8,03,000 కోట్లుగా పేర్కొనగా, సవరించిన అంచనాల్లో రూ.11,000 కోట్లు తగ్గిపోయింది. 2018–19లో జీఎస్‌డీపీ రూ.9,33,000 కోట్లుగా పేర్కొనగా, సవరించిన అంచనాల్లో రూ.70,448 కోట్లకు తగ్గిపోయింది.  
– 2018–19లో తలసరి ఆదాయం రూ.1,51,000 ఉండగా, 2019–20లో అది రూ.1,61,000కు పెరిగింది. ద్రవ్యోల్బణం దేశ సగటు 4.77 శాతం ఉండగా ఏపీలో కేవలం 3.54 శాతమే ఉంది. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో ద్రవ్యోల్బణం పెరుగుదల తక్కువగా ఉంది. 
– రెవెన్యూ రాబడులు 2018–19లో రూ.1,14,670 కోట్లు ఉండగా, 2019–20లో దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ 1,10,800 కోట్లు ఉంది. కేవలం రూ.3,799 కోట్లే తగ్గింది. – 2018–19లో రెవెన్యూ వ్యయం రూ.1,28,560 కోట్లు ఉండగా, 2019–20లో రూ.1,37,518 కోట్లు అయింది. రూ.8,948 కోట్లు పెరిగింది.  
 
బకాయిల వల్లే రెవెన్యూ, ద్రవ్య లోటు 
– కేపిటల్‌ వ్యయం తగ్గడానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలతో నిర్మించారు. రాజధాని పేరుతో రహదారులు కిలో మీటర్‌కు రూ.40 కోట్లతో అంచనాలు వేశారు. వాటిని నిలుపుదల చేసి రివర్స్‌ టెండర్ల ద్వారా ప్రభుత్వ ధనం ఆదా చేయడానికి సమయం పట్టింది. గత టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పని చేసింది. 
– రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల బకాయిలతో పాటు మరో రూ.20 వేల కోట్లు పౌర సరఫరా సంస్థకు, విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టింది. వాటిని చెల్లించడంతో రెవెన్యూ, ద్రవ్య లోటు పెరిగింది.  
– 2018–19లో బడ్టెట్‌ వ్యయం రూ.1,63,690 కోట్లు ఉంటే 2019–20లో రూ.174,755 కోట్లు వ్యయం చేశాం.   
– గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ.14,832 కోట్ల బకాయిలను (ధాన్యం సేకరణ, విత్తన సబ్సిడీ, ఎంఎస్‌ఎంఈ, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యుత్‌ సంస్థల బకాయిలు, అగ్రిగోల్డ్, రైతులకు సున్నా వడ్డీ బకాయిలు) చెల్లించడంతో ద్రవ్యలోటు పెరిగింది. 
– రాష్ట్ర సొంత పన్ను ఆదాయంతోపాటు కేంద్ర పన్నుల వాటా రూపంలో 2019–20లో రూ.1,14,733 కోట్ల ఆదాయం వచ్చింది.  
 
ప్రజలకు మంచి జరుగుతోందని బాధా? 
– గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీతో పాటు అసలు చెల్లించాలి. వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే మేమే రుణాలు ఎక్కువగా చెల్లించాం.   
– 1994–95లో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 18 శాతం ఉండగా, చంద్రబాబు పాలనలో 30 శాతానికి వెళ్లింది. 2004–2014 మధ్య కాలంలో అది 22 శాతానికి తగ్గింది. అయితే 2014 నుంచి టీడీపీ ప్రభుత్వం దీన్ని 28 శాతానికి తీసుకువెళ్లింది.  
– రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు, జీఎస్‌టీ పరిహారం, రెవెన్యూ లోటు బకాయిలు, పోలవరం వ్యయం రూ.3,800 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాము. రాష్ట్ర పునిర్విభజన చట్టంలోని రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంటు మంజూరు చేయాలని విన్నవించాం. 
– దీంతో పాటు విదేశీ సంస్థ కోవిడ్‌ నేపథ్యంలో తక్కువ వడ్డీతో పాటు గ్రాంటుతో రుణం ఇస్తామని ముందుకు వస్తే అందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరాం. దీన్ని ఎలా తప్పుపడతారు? రాష్ట్రానికి మంచి జరగడం టీడీపీకి, పచ్చ మీడియాకు ఇష్టం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement