
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా బుధవారం శాసన మండలిలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఆర్‌డీఏ రద్దు, ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు బిల్లులపై సవరణలను సెలెక్ట్ కమిటీకి పంపించాలని యనమల పేర్కొనగా బుగ్గన విభేదించారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని చెప్పారు. ఈ సమయంలో యనమల జోక్యంచేసుకుంటూ మంత్రులు సభలో ఉండకూడదని, వారిని బయటకు పంపించాలంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. చైర్‌ను మీరెలా డిక్టేట్ చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. బిల్లులను చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తేవడం సరికాదన్నారు. రూల్‌బుక్‌లో నిబంధనలను బుగ్గన చదివి వినిపించారు.
తొలుత మోషన్ మూవ్ కాలేదన్న చైర్మన్..
బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో సవరణలకు సంబంధించి ఎటువంటి మోషన్ మూవ్ కాలేదని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. యనమల చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని, క్షుణ్నంగా నిబంధనలు చదివి వినిపించినా సెలెక్ట్ కమిటీకి పంపించాలనడం దారుణమని బుగ్గన పేర్కొనగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని మండలి ఛైర్మన్ షరీఫ్ తొలుత ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని చెప్పగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు.
ఈ దశలో చైర్మన్ అశోక్‌బాబు నోటీసులు ఇచ్చారని చెప్పడం పట్ల అధికార పక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నోటీసులు పాత తేదీలు వేసి ఇవ్వవచ్చని, యనమల చాలా మేధావితనంతో మాట్లాడుతున్నారని బుగ్గన అన్నారు. బిల్లును పరిగణనలోకి తీసుకున్న సమయంలోనే నిబంధనల మేరకు సవరణల మోషన్ మూవ్ చేయాలని, అలా మూవ్ చేసినట్లు రికార్డులున్నాయేమో చెప్పాలని చైర్మన్‌ను బుగ్గన కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ బిల్లు పరిగణనలోకి తీసుకున్న విషయం టీడీపీ సభ్యులకు తెలియదన్నారు. కాసేపటి తరువాత రెండు నోటీసులు ఇచ్చారని చైర్మన్ చెప్పారు.
మంత్రులవైపు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు
గతంలో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఎలా బిల్లు పెట్టారో గుర్తు చేసుకోవాలని, అయినా వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని యనమలకు మంత్రి బుగ్గన చురకలంటించారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్ద గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు పోడియం వద్దకు చేరుకుని బిల్లులను ఆమోదించాలని చైర్మన్‌ను అభ్యర్ధించారు. మంత్రులు చేతులు జోడించి వేడుకుంటుండగా టీడీపీ సభ్యులు బుద్ధా వెంకన్న, రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బీటెక్ రవిలు మంత్రి బొత్సను దూషించారు. నారా లోకేష్ ఒక్కసారిగా మంత్రులు, అధికారపక్ష సభ్యల వైపు దూసుకురాగా టీడీపీ సభ్యుడు టీడీ జనార్ధన్ వెనక్కు తీసుకెళ్లారు. టీడీపీ సభ్యులు దూషణల పర్వం కొనసాగించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ రకంగా రౌడీయిజం చేస్తారా? అంటూ మంత్రి బొత్స నిలదీశారు. టీడీపీ సభ్యుల తీరు, హావభావాలు, చైర్మన్ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.