ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో క్రమశిక్షణ, నిశిత పరిశీలన, వ్యూహాత్మక వినియోగం కీలకమని.. ఆర్థిక నిర్వహణను బట్టే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు సాధ్యమవుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశలో పనిచేయాలని.. దుబారా తగ్గించుకుని, ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యూహాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. రఘురాం రాజన్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు.
ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లండి
రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లాలని, ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టాలని రఘురాం రాజన్ సూచించినట్టు తెలిసింది. మైనింగ్‌తోపాటు నాలా చార్జీల్లాంటి పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పినట్టు సమాచారం. కొత్త వాహనాలు కొనడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వంటి దుబారా ఖర్చుల జోలికి వెళ్లవద్దని.. సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
పథకాల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రఘురాం రాజన్ తన అనుభవాలను సీఎం బృందంతో పంచుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment