చిదంబరంతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం ఆర్థికమంత్రి పీ చిదంబరంతో సమావేశమయ్యారు. ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుండడం, పేలవ స్థాయిలో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, రానున్న సమీక్ష సందర్భంగా రెపోరేటుకు సంబంధించి ఆర్‌బీఐ నిర్ణయంపై వేర్వేరు అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
బ్యాంకింగ్ లెసైన్సుల కోసం ముందు జాగ్రత్తగానే ఈసీ అనుమతి కోరాం: రాజన్
కొత్త బ్యాంకు లెసైన్సుల జారీకి ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోరింది ముందు జాగ్రత్తగానేనని రాజన్ చెప్పారు. ‘ఇలాంటి (లెసైన్సు) ప్రకటనల విషయంలో అనిశ్చితి ఉండకూడదు. అందుకే, లెసైన్సుల జారీ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడే ఉన్నదా అని ఈసీని అడిగి తెలుసుకోవడం ముఖ్యం..’ అని అన్నారు.
రెపో పెంచే అవకాశాల్లేవ్: ఎస్‌బీఐ
కాగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ప్రకారం రెపోను పెంచే అవకాశాలు లేవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. ఒకవేళ పెంచినా ఇది పావుశాతంకన్నా తక్కువ ఉంటుందని అభిప్రాయపడింది.
బాసెల్ 3 ప్రమాణాల అమలు గడువు పొడిగింపు
బ్యాంకుల మూలధన పెంపునకు సంబంధించి బాసెల్ 3 అంతర్జాతీయ ప్రమాణాల అమలు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు గడువు మార్చి 2018 మార్చి 31కాగా, దీనిని మరో యేడాదికాలం అంటే 2019 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ తెలిపింది. మొండిబకాయిలు పెరగడం, బ్యాంకుల లాభదాయకతపై ఆందోళన వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం వెలువడింది.