ముంబై: వృద్ధికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖతో తనకు ఎటువంటి విభేదాలు లేవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం పేర్కొన్నారు. వృద్ధిని పట్టించుకోకుండా, ద్రవ్యోల్బణం కట్టడి చర్యలకే రాజన్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజన్, తరువాత ఇప్పటివరకూ 3 సార్లు కీలక పాలసీ రేట్లను పెంచారు.
ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఐఎంఎండీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వృద్ధికి ఆర్‌బీఐ తగిన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడి ద్వారానే వృద్ధి వేగం పుంజుకుంటుందని వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్లే బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీరేట్లు కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. అమెరికా ఫెడ్ ట్యాపరింగ్ ప్రతికూలతను తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ప్రస్తుతం భారత్ ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. కార్యక్రమంలో రాజన్ ప్రసంగప్రతిని మాత్రం విడుదల చేశారు.