మందకొడి పాలనవల్లే.. వృద్ధి పతనం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి మందకొడి పాలన, సహజ వనరుల కేటాయింపుల్లో తప్పిదాలే కారణమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. రాజకీయ స్థిరత్వం ఏర్పడినందువల్ల వచ్చే మూడేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతానికి పెరుగుతుందని అన్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఇన్వెస్టర్ల బృందంతో గురువారం నిర్వహించిన సమావేశంలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సిటీగ్రూప్ శుక్రవారం పేర్కొంది.
రెండేళ్ల క్రితం 8-9 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 4-5 శాతానికి తగ్గిపోవడానికి పర్యావరణ, భూసేకరణ సమస్యలు, ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణలో జాప్యం కూడా కారణాలేనని రాజన్ తెలిపారు. ఈ ఏడాది వృద్ధి రేటు 5.5% ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిందన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 5.7%కి ఎగసింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 4.6 శాతమే.
ద్రవ్యోల్బణంపై దృష్టి ...
ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉండడానికి సరఫరాలు మెరుగు పడకపోవడమే కారణమని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఈ సీజన్లో తక్కువ వర్షపాతం నమోదుకావడంతో ఆహార ద్రవ్యోల్బణంపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. జూలైలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.19 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 7.96 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 8.43 శాతం ఉందని చెప్పారు.
పటిష్టమైన ద్రవ్య విధానం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఈ ఏడాది 8 శాతానికి అదుపుచేయాలనీ, వచ్చే ఏడాది 6 శాతానికి తగ్గించాలనీ రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని వివరించారు. భారత్‌లో మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఎన్నికలు సమీపించడం వల్లే పరిమిత సంఖ్యలో బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేశామని తెలిపారు. భారత్‌లో విదేశీ బ్యాంకుల ప్రాతినిధ్యం పెంచేందుకు ప్రాధాన్య రంగ రుణ నిబంధనలను ఆర్‌బీఐ పునఃసమీక్షించే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు.
మొండి బకాయిలపై అది బ్రహ్మాస్త్రం...
మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకుల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’గా ప్రకటించడమేనని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రేట్ల కోత ఫిబ్రవరిలోనే: బీఓఎఫ్‌ఏ-ఎంఎల్
ఆర్‌బీఐ ఈ నెల 30వ తేదీన నిర్వహించే ద్రవ్య, పరపతి సమీక్షలోనూ పాలసీ రేట్ల కోత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తాజా నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతుండడమే దీనికి కారణమని పేర్కొంది. అయితే ఫిబ్రవరిలో మాత్రం రేట్ల కోత ఉండవచ్చని అభిప్రాయపడింది.