బ్యాంకులూ.. వడ్డీరేట్లు తగ్గించండి! | RBI Governor Raghuram Rajan optimistic about meeting inflation target of 5% | Sakshi
Sakshi News home page

బ్యాంకులూ.. వడ్డీరేట్లు తగ్గించండి!

Published Wed, Aug 10 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

బ్యాంకులూ.. వడ్డీరేట్లు తగ్గించండి!

బ్యాంకులూ.. వడ్డీరేట్లు తగ్గించండి!

ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ సూచన
తన చివరి పాలసీలో రేట్లు యథాతథం
ద్రవ్యోల్బణం భయాలే ప్రాతిపదిక

ముంబై: అందరూ ఊహించినట్లే కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. మంగళవారంనాటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ తన కీలక రుణ రేట్లు రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్ రేషియో... మూడింటినీ మార్పులేకుండా కొనసాగించింది.  ద్రవ్యోల్బణ భయాల వల్లే రేట్లు తగ్గించలేదని ఆర్‌బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ఇంకా ఈ ఆందోళనలు తొలగిపోలేదన్నారు. అయితే ద్రవ్యోల్బణం తగ్గే పరిస్థితి ఉంటే రేటు కోత దిశలో మున్ముందు నిర్ణయం ఉంటుందన్నారు.

‘‘నిజానికి ఇప్పటివరకూ తగ్గించిన దాదాపు 1.50 శాతం రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదలాయించలేదు’’ అని పాలసీ సమీక్ష అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాజన్ చెప్పారు. ఇందుకు బ్యాంకులు తరచూ ఏదో ఒక కారణాన్ని చెబుతున్నాయన్నారు. తాజాగా ‘డాలర్ తరలిపోయే భయాల’ను చూపిస్తున్నాయన్నారు. ‘‘ఇలాంటి భయాలేవీ అక్కర్లేదు’’ అని భరోసా ఇచ్చారాయన. కాగా రేటు కోత ఉండదని ఊహించినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఈ దిశలో ఆర్‌బీఐ నిర్ణయం ఉంటుందని నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డారు.

తక్షణం రేట్లు తగ్గించేది లేదు: బ్యాంకులు
ఆర్‌బీఐ సూచించినప్పటికీ తక్షణం వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఏమీ లేవని బ్యాంకర్లు స్పష్టం చేశారు. వృద్ధి రేటు ఊపందుకుంటేనే రేటు తగ్గింపు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.  మరోవైపు ఆర్‌బీఐ రేటు కోతకు ప్రస్తుతం అవకాశం ఉందని పారిశ్రా మిక వేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరి అభిప్రాయాలను చూస్తే...

అక్టోబర్ 4 ‘రేటు’కు మెజారిటీ బేస్..
రాజన్‌కు ఇది చిట్టచివరి పాలసీ సమీక్ష. సెప్టెంబర్ 4తో ఆయన పదవీ బాధ్యతలు ముగుస్తాయి. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2015 నుంచి మళ్లీ  6.5 శాతానికి తీసుకొచ్చారు. తదుపరి పాలసీ సమీక్ష అక్టోబరు 4న జరగనుంది. అయితే ఇప్పటిదాకా రేట్లపై గవర్నరు మాత్రమే నిర్ణయం తీసుకునే విధానం అక్టోబరు 4 నుంచి మారనుంది. ఆరుగురు సభ్యులు, ఆర్‌బీఐ గవర్నర్ కలిసి మెజారిటీ ప్రాతిపదికన ఇకపై నిర్ణయం తీసుకుంటారు. ‘రేటు నిర్ణయం’పై సభ్యులు సరిసమానంగా చీలిపోతే గవర్నర్ నిర్ణయం కీలకంగా మారుతుంది. ఆరుగురు సభ్యుల కమిటీని పరపతి విధాన కమిటీగా (ఎంపీసీ) వ్యవహరిస్తారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వం త్వరలో నియమిస్తుంది. ఆర్‌బీఐ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. కమిటీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు రాజన్ ఈ సందర్భంగా తెలిపారు.

నా పదవీ కాలం అద్భుతం..
తన పదవీకాలాన్ని అద్భుతమైనదనిగా రాజన్ అభివర్ణించారు. ‘విమర్శకులు కానీయండి. మద్దతుదారులు కానీయండి. ఎవరికి అనిపించింది వారు చెబుతారు. వీటన్నింటికీ నేను ప్రాధాన్యమివ్వను. సామాన్యుడికి ఏది మంచిదో అదే చేశా. నా చర్యల ఫలితాలు ఐదు నుంచి ఆరేళ్ల కాలంలో కనబడతాయి. దేశ పటిష్ట, సుస్థిర వృద్ధి, ఉపాధి కల్పన, మధ్య, సామాన్య వ్యక్తి ఆదాయం ఇవన్నీ పాలసీ లక్ష్యాలు. నేను చేయాల్సిందంతా చేశాను. వాటి ఫలి తాలు వస్తేనే తెలుస్తాయి. ఇవి ఎలా ఉన్నాయన్నది వచ్చే ఐదారేళ్లలో చూస్తారు. ఏది మంచో, ఏది చెడో చెప్పే తీర్పును ఆ తరవాత ఇద్దాం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఎవరి వ్యాఖ్యలెలా ఉన్నా ఫలితాలే ముఖ్యమని రాజన్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 4 తరువాత భవిష్యత్‌పై ఇంకా ప్రణాళికలు రూపొం దించుకోలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆప్ చికాగోలో పూర్వపు బాధ్యతల నిర్వహణ నుంచి భారత్ ఆర్థిక అంశాలపై పరిశోధనల వరకూ వివిధ అంశాలు పరిశీలనలో ఉన్నట్లు సూచించారు.
రాజన్ చివరి పాలసీ సమీక్ష సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి వచ్చిన ఆయన కుమార్తె, కుమారుడుఊహించిందే...

 







పాలసీ ముఖ్యాంశాలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం.
2017 జనవరి నాటికి ద్రవ్యోల్బణం రేటు అంచనా 5 శాతం. పెరిగే అవకాశాలే అధికం.
సాధారణ వర్షపాతం, 7వ వేతన కమిషన్ సిఫారసులు వృద్ధి రేటును పెంచుతాయి.
వస్తు, సేవల పన్ను అమలు పెట్టుబడులు, వ్యాపార సెంటిమెంట్‌కు సానుకూలం.
ఆగస్టు 5 నాటికి రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు. 365.7 బిలియన్ డాలర్లు.
జీఎస్‌టీ వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆలోచనలు ఇప్పటికి ఆలోచనలే.
సెప్టెంబర్‌లో 26 బిలియన్ డాలర్ల ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) రిడమ్షన్ల వల్ల బ్యాంకింగ్ ద్రవ్యలభ్యత (లిక్విడిటీ)కు ఎటువంటి విఘాతం కలుగదు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఇలాంటి సమస్య ఏదీ తలెత్తకుండా ఆర్‌బీఐ జాగరూకత వహిస్తుంది.
బ్యాంకులు తమ రేటు ప్రయోజనాన్ని కొంతమొత్తమే కస్టమర్లకు బదలాయించాయి.
కేవైసీ  గురించి ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలుసుకోవచ్చు.
తాజా డిపాజిట్ రేటు ప్రాతిపదికన రుణ రేటుకు సంబంధించి ‘మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు ఫ్రేమ్‌వర్క్’ను మరింత పటిష్టం.
బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య తీవ్రమైనదే అయినా... పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి.

ఇవీ కీలక రేట్లు...
బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో. ప్రస్తుతం ఇది 6.5 శాతం.
బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే డిపాజిట్లపై వాటికి ఆర్‌బీఐ చెల్లించేది రివర్స్ రెపో. ప్రస్తుతం ఇది 6 శాతం.
బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిష్పత్తే క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రస్తుతమిది 4%.

మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే పాలసీ విధానం ఉంది. వృద్ధి మెరుగుపడుతూ, వచ్చే కొద్ది నెలల్లో రుణ వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటున్న పక్షంలో వడ్డీరేట్లు కూడా తగ్గే వీలుంటుందని నేను విశ్వసిస్తున్నా. ద్రవ్యలభ్యతకు గవర్నర్ హామీ బ్యాంకింగ్‌కు సానుకూల అంశం. - ఆరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్

లిక్విడిటీపై హామీ హర్షణీయం
బ్యాంకింగ్‌కు ఎటువంటి ద్రవ్య లభ్యత సమస్యా రాకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్న హామీ స్వాగతనీయం. ద్రవ్యోల్బణం తగ్గుదల సంకేతాలతో రేట్లు తగ్గుదల చోటుచేసుకుంటుందని ఆర్‌బీఐ సూచించింది. ఇవి వృద్ధికి సత్ఫలితాలను ఇస్తుంది.
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్

వచ్చే నెలల్లో రేటు కోత...!
ప్రస్తుతం లేకున్నా... సమీప భవిష్యత్తులో రేటు కోత ఉంటుందని భావిస్తున్నా. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రభుత్వ వ్యవస్థాపరమైన చర్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 50-100 బేస్ పాయింట్ల మేర రేటు కోతకు వీలు కల్పిస్తాయని భావిస్తున్నా. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. - రాణా కపూర్, యస్ బ్యాంక్

తగిన సమయం...
వృద్ధి వేగం పుంజుకుంటోంది. రేటు తగ్గింపునకు ఇది తగిన సమయం. సమీప భవిష్యత్తులో  నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి వేగం పుంజుకోవడానికి వడ్డీరేట్ల కోత అవసరం. ప్రభుత్వ చర్చలు, తగిన వర్షపాతంతో త్వరలో రేటు కోతకు వీలుంది.
- హర్షవర్ధన్ నోటియా, ఫిక్కీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement