విమర్శకులపై మండిపడ్డ రఘురాం రాజన్
ముంబై: ద్రవ్యోల్బణం కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ తనపై విమర్శిస్తున్న వారిపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ద్రవ్యోల్బణం కట్టడి కన్నా ఆర్థిక వృద్ధి మీదనే ఎక్కువ దృష్టి పెట్టానని విమర్శించే ముందు.. ఎలా ద్రవ్యోల్బణాన్ని కనిష్ఠాస్థాయికి తగ్గించాలో చూపాలని ఆయన సవాల్ చేశారు. ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శలు ఊసుపోని డైలాగులేనని ఆయన కొట్టిపారేశారు.
ప్రభుత్వ విధానాల పట్ల తరచూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసే రాజన్.. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంలో ఇలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయని, వరుసగా రెండు కరువులు, బలహీనంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఎలాంటి బహ్య పరిణామాలు ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంలో ఆటంకాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చిక్కులున్నా భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు చాలా బాగుందని, రుతుపవనాలు బాగుండి, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే.. మన వృద్ధిరేటు మరింతగా పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన అనుభవాలను వివరిస్తూ త్వరలోనే తనకు పుస్తకం రాసే ఆలోచన లేదని రాజన్ స్పష్టం చేశారు.