రాజన్ రాజీనామా ‘చిదంబర’ రహస్యం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రాజన్ వైదొలగడం వెనుక కారణంపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి,కాంగ్రెస్ నేత పి. చిదంబంర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించినందు వల్లే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. వాస్తవానికి రాజన్ ఆర్‌బీఐ గవర్నర్ గా కొనసాగాలనుకున్నారనీ, కానీ పరిస్థితులు ఆయనను రాజీనామా వైపు నడిపించాయని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను తీవ్రంగా వ్యతిరేకించిన రాజన్ పదవీకాలం పొడించలేదని ఆరోపించారు. అలాగే రాజన్ రాజీనామా సందర్బంగా ఆర్‌బీఐ తరపున రాజన్ డీమానిటైజేషన్ను వ్యతిరేకిస్తూ 5 పేజల లేఖను ప్రభుత్వానికి సమర్పించారని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియను ఎందుకు చేపట్టకూడదో వాదిస్తూ ఈ ఐదు పేజీల లేఖను రాసినట్టు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ లేఖను బహిర్గతం చేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంటే రాజన్ లేఖను బైటపెట్టగాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా గత ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ పదవీకాలం ముగియనుండగా... రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అనే చర్చ ఒక పక్క జోరుగా సాగుతుండగానే రాజన్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ను ప్రభుత్వం నియమించింది. అలాగే నవంబర్ 8 న ప్రధాని మోదీ 80శాతం చలామణిలోఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. మరోవైపు అప్పట్లో ఆర్‌బీఐ గవర్నర్ పదవినుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి పలుమార్లు రాజన్ పై దాడికి దిగినపుడు కూడా చిదంబరం రాజన్‌కు మద్దతుగగా నిలిచిన సంగతి తెలిసిందే.