'మోదీ సర్కారును ముందే హెచ్చరించా'
పెద్ద నోట్ల రద్దుపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నల్లధనం అణచివేతకు నరేంద్రమోదీ సర్కారు అమలుచేసిన పెద్దనోట్ల రద్దు.. పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదని వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఆర్బీఐ.. 99శాతం రద్దైన కరెన్సీ తిరిగి బ్యాంకుకు చేరిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు విషయంలో నరేంద్రమోదీ సర్కారును తాను ముందే హెచ్చరించానని, నోట్ల రద్దు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా స్పల్పకాలికంగా జరిగే నష్టమే ఎక్కువ అని తాను చెప్పానని తెలిపారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను సూచించానని, అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
'ఐ డూ వాట్ ఐ డూ: రిఫార్మ్స్, రెటారిక్, రిజాల్వ్' పేరిట రాజన్ రాసిన పుస్తకం వచ్చేవారం విడుదల కానుంది. 2016 ఫిబ్రవరిలో పెద్దనోట్ల రద్దుపై తన అభిప్రాయం తెలుపాలని ప్రభుత్వం మౌఖికంగా కోరిందని, దీంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపడితే.. తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అనువైన సమయంపై నోట్‌ను ఆర్బీఐ సర్కారుకు సమర్పించిందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌గా గత ఏడాది సెప్టెంబర్ 5న తన పదవీకాలం ముగియడంతో తిరిగి షికాగో యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ అధ్యాపకుడిగా రాజన్ చేరిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు గురించి తన హయాంలోనే ప్రభుత్వం సంప్రదించినా.. నిర్ణయం తీసుకోవాలని మాత్రం తనను కోరలేదని స్పష్టం చేశారు.