సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రధ్దు చేసి ప్రజలను నూరు పాట్లకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధ్వజమెత్తారు. ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై దుమ్మెత్తిపోశారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచలోని ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదుకదా సమర్థించడం కూడా జరగలేదని, అందరూ అది అనాలోచిత నిర్ణయమని అన్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు.
అసలు నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్‌కే తెలియదన్నారు. నోట్ల రద్దు గురించి ఢిల్లీలో మోదీ వివరించిన రోజు సీఈఏ కేరళలో ఉన్నారని, సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అన్నది అవినీతి, తీవ్రవాదం, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి విజయం సాధించిందా అంటూ చురకలు అంటించారు.
అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు ఎలా అమలుచేస్తున్నారో అడిగి తెలుసుకునేవారని తెలిపారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌పై కూడా చిదంబరం విమర్శల వర్షం కురిపించారు. అదొక భీమా పథకం లాంటిదని.. 130 కోట్లకుపైగా జనాభా గల భారత్‌లో భీమా పథకాలతో ప్రజలకు లాభం జరగుతుందనే నమ్మకంలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కీమ్‌లు ఏ దేశంలోనూ విజయవంతం కాలేదని వివరించారు. అంతేకాకుండా ఈ పథకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment