వడ్డీరేట్లు అక్కడే..?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మంగళవారం(28న) చేపట్టనున్న పాలసీ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క వృద్ధి మందగమనం, మరోపక్క ద్రవ్యోల్బణం దిగొస్తున్న సంకేతాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బ్యాంకర్లు మాత్రం ఈసారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని అంటున్నారు. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో ఐదు నెలల కనిష్టమైన 6.16 శాతానికి దొగొచ్చిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరల తగ్గుముఖం పట్టడం దీనికి దోహదం చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం సైతం డిసెంబర్‌లో 9.87 శాతానికి(మూడు నెలల కనిష్టం) తగ్గింది. ఇదిలాఉండగా... పారిశ్రామిక రంగం మరింత తిరోగమనంలోకి జారిపోవడం కార్పొరేట్ రంగాన్ని కలవరపరుస్తోంది. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత ఘోరంగా మైనస్ 2.1 శాతానికి(అక్టోబర్‌లో మైనస్ 1.6%) పడిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్ కార్పొరేట్ల నుంచి మరోసారి బలంగా వినిపిస్తోంది. మరోపక్క, ఈ ఏడాది(2013-14)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5 శాతానికే పరిమితం కావచ్చనే అంచనాలు ఉన్నాయి. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టస్థాయి(5%)కి పడిపోవడం గమనార్హం.
డిసెంబర్ సమీక్షలో రాజన్ కీలకరేట్లను యథాతథంగా వదిలేయడం విదితమే.
అంతక్రితం సెప్టెంబర్, నవంబర్ సమీక్షల్లో రెపో రేటును వరుసగా పావు శాతం చొప్పున పెంచారు. సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యమని చెబుతూవస్తున్నారు. ద్రవ్యోల్బణం ఒక వినాశకర వ్యాధి అంటూ తాజాగా మరోసారి తన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. దీన్ని కట్టడి చేయడం దేశ ఆర్థికాభివృద్ధికి ఆవశ్యకమన్నారు. కాగా, సెంట్రల్ బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం ఒక్కటే లక్ష్యం కాదని, ఇతర అంశాల(వృద్ధి రేటు ఇతరత్రా)పైనా దృష్టిసారించాలని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవలే వ్యాఖ్యానించడం విశేషం.
బ్యాంకర్లు ఏమంటున్నారు...
ఆర్‌బీఐ రేపు చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని భావిస్తున్నా’ అని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) సీఎండీ ఎస్‌ఎల్ బన్సల్ వ్యాఖ్యానించారు.
హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కంట్రీ హెడ్ నైనాలాల్ కిద్వాయ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘వడ్డీరేట్లను తగ్గించడం సాధ్యం కాకపోతే.. కనీసం యథాతథంగా కొనసాగించడం ఒక్కటే ఆర్‌బీఐకి ఉన్న మార్గం. ఆర్‌బీఐ బహుశా ఈ సమీక్షలో పారిశ్రామిక రంగానికి ఇచ్చే సందేశం ఇదే కావచ్చు’ అని ఆమె పేర్కొన్నారు.
ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో ఎక్కడిరేట్లను అక్కడే ఉంచే అవకాశం ఉందని ఎస్‌బీఐ తాజా నివేదికలో అంచనా వేసింది. ‘ద్రవ్యోల్బణం విషయంలో ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఆర్‌బీఐ వేచిచూసే అవకాశం ఉంది. తదుపరి పాలసీ నిర్ణయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం దిగొచ్చినప్పటికీ... తయారీ రంగ ద్రవ్యోల్బణం మాత్రం దాదాపు అదేస్థాయిలో ఉండటమే దీనికి కారణం’. అని పేర్కొంది.
ప్రస్తుతం రేట్ల పరిస్థితి ఇదీ...
రెపో రేటు: 7.75 శాతం. ఆర్‌బీఐ నుంచి
తీసుకునే స్వల్పకాలిక రుణాలపై
బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు ఇది..
రివర్స్ రెపో రేటు: 6.75%. ఆర్‌బీఐ వద్ద
ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీరేటు.
సీఆర్‌ఆర్: 4 శాతం. బ్యాంకులు తమ మొత్తం
డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా
ఉంచాల్సిన శాతమిది. దీనిపై బ్యాంకులకు
ఎలాంటి వడ్డీ లభించదు.