హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొందరు కార్పొరేట్లతో కలిసి యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీరిలో జేఎస్‌డబ్లు్య గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రానున్న ఈ యూనివర్సిటీకి ‘క్రియా’ అని పేరు పెట్టారు. క్రియా యూనివర్సిటీకి తొలుత రూ.750 కోట్ల నిధులు సమకూరతాయని ఇండస్‌ఇండ్ బ్యాంక్ చైర్మన్, యూనివర్సిటీ సూపర్‌వైజరీ బోర్డు చైర్మన్ ఆర్.శేషసాయి ముంబైలో తెలిపారు. దాతృత్వంలో భాగంగా కార్పొరేట్లు ఈ యూనివర్సిటీకి ఖర్చు చేస్తారన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారుగా రఘురామ్ రాజన్ వ్యవహరిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ సబ్జెక్టును రాజన్ బోధిస్తున్న సంగతి తెలిసిందే.
క్లాసులు 2019 నుంచి..: యూనివర్సిటీలో 2019 జూలై నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుంది. హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.7–8 లక్షలు ఉండనుంది. లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్‌లో బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లుంటాయి. తాత్కాలికంగా శ్రీసిటీలోని ఐఎఫ్‌ఎంఆర్ క్యాంపస్‌లో క్లాసులు ప్రారంభిస్తారు. తర్వాత సొంత భవనంలోకి మారుస్తారు. 200 ఎకరాల్లో నిర్మించే క్రియా యూనివర్సిటీ సొంత భవనం 2020 నాటికి సిద్ధమవుతుంది. ప్రపంచ అభివృద్ధిలో పాలుపంచుకునే నవతరం భారతీయులను ఇక్కడ తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అందుబాటులో లేని, భవిష్యత్‌కు అవసరమైన విద్యావిధానం తీసుకొస్తామని చెప్పారు. కాగా, జిందాల్, మహీంద్రాలు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. పద్మభూషణ్ నారాయణన్ వఘుల్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విద్యావేత్త సుందర్ రామస్వామి వైస్ చాన్స్‌లర్‌గా ఉంటారు.
యూనివర్సిటీ ప్రకటన సందర్భంగా రాజన్, ఆనంద్ మహీంద్రా, సజ్జన్ జిందాల్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment